Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత జీవన విధానంతో కుటుంబ సభ్యుల మధ్య పెరిగిపోతున్న దూరం ఎన్నో మానసిక, శారీరక అనారోగ్యాలకి కారణం అంటున్నారు పరిశోధకులు. టీనేజ్ పిల్లల కోపతాపాలు, వారి నడవడిక, ప్రవర్తన ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల మధ్య వుండే అనుబంధంపై ఆధారపడి వుంటాయని కూడా చెబుతున్నారు వీరు. అంతేకాదు, భార్యాభర్తలు నువ్వు, నేను ఒకటి అంటూ మొదలుపెట్టిన ప్రయాణం కాస్తా తల్లిదండ్రులు అయ్యేసరికి నువ్వెంత అంటే నువ్వెంత అనేలా మారిపోవడానికి ముఖ్య కారణం 'దూరమే' అంటున్నారు పరిశోధకులు. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే సరి....
- భార్యాభర్తల మధ్య కావలసినంత సమయం ఉన్నప్పుడు ఆ బంధం చక్కగా సాగిపోతుంది. ఎప్పుడైతే పిల్లలు, బాధ్యతలు అంటూ మొదలవుతాయో ఇద్దరికి మధ్య కలసి గడిపే సమయం తగ్గిపోతుంది. దాంతో చిన్న చిన్న అపార్థాల నుంచి పెద్దపెద్ద గొడవలదాకా వెళ్తుంది. అయితే అందరి విషయంలో ఇలా జరగదు. సమస్యకు మూలం 'కమ్యూనికేషన్ గ్యాప్' అన్న విషయం తెలుసుకున్న భార్యాభర్తలు రోజువారీ ఒత్తిడి పనుల మధ్య కూడా ఒకరికోసం ఒకరు కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య అనుబంధం ఎన్ని ఏళ్ళు గడచినా, ఎంత పని ఒత్తిళ్ళలో వున్నా చక్కగా, హాయిగా ఉంటుంది..
- భార్యాభర్తల బంధం తాజాగా ఉండాలంటే 'ఇద్దరూ కలసి గడిపే సమయం' ముఖ్యం. రోజూ తప్పకుండా ఇద్దరూ కొంత సమయాన్ని గడపటం. అంటే ఉదాహరణకి భార్యాభర్తలు ఇద్దరూ ఉదయం, రాత్రి వాకింగ్‌కి వెళ్ళడం, ఆదివారాలలో బయట భోజనం చేయడం, ఇలా ఏదో ఒకటి అలవాటుగా మార్చుకున్న జంటల మధ్య అపోహలు తక్కువగా ఉంటాయి.
- ఇక ఇంట్లో అత్తాకోడళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వుంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే తప్ప తగ్గదు. శ్రీవారిని, పిల్లల్ని ఆనందపరచడానికి, చిన్నచిన్న బహుమతులు ఇచ్చినట్టే అప్పుడప్పుడు అత్తగారికి కూడా బహుమతులు ఇస్తుండాలి. అలాగే అత్తగారి తరపు వారితో మంచి సంబంధాలు కలిగి వుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎంత బిజీగా వున్నా, అలసిపోయినా సరే అత్తగారితో ఆరోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి చెబుతూ కాసేపు కబుర్లు చెప్పాలి. ఆమె చెప్పే విషయాలని ఓపిగ్గా వినాలి. ఇలా చేస్తే అత్తాకోడళ్ళ మధ్య మంచి బంధం వుంటుంది. అదేంటి... అత్తగారి వైపు నుంచి చేయాల్సినవి ఏం లేవా అంటే... వున్నాయి... అవి కోడలిని చిన్నచిన్న విషయాలకీ ప్రశ్నించకుండా వుండటం, ఆమె పుట్టింటి వారితో మంచి అనుబంధాన్ని ఏర్పచుకోవటం, మధ్యమధ్యలో ఫోన్ చేసి పలకరించడం వంటి చిన్న చిన్న విషయాలు వారి మధ్య బంధాన్ని చక్కగా వుంచుతాయి.
- ఇక పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇలా బంధం ఏదైనా కానివ్వండి సూత్రం ఒక్కటే ఒకరికి ఒకరు సమయం ఇచ్చుకోవడం, తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవటం, కొంచెం సున్నితంగా వుండటం. ఇవి ఏ బంధాన్ని అయినా తాజాగా వుంచుతా. ముఖ్యంగా కలిసి గడిపే సమయాన్ని అలవాటుగా మార్చుకుంటే చాలు.