Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణిపూర్‌లోని పంజీ బజార్ వెళితే మనకో అరుదైన దృశ్యం కనబడుతుంది. 50 ఏండ్ల ఓ మహిళ... ట్రాక్పాంట్, షర్ట్ ధరించి ఆటో దగ్గర నిలబడి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె మణిపూర్ మొట్టమొదటి ఆటో డ్రైవర్.. లైబీ ఒయినమ్. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్లినా ఎంతో గౌవరం. కానీ మొట్టమొదట ఆమె ఆటో నడిపినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది. అందరూ ఆమెను చూసి నవ్వారు. పేర్లు పెట్టారు. కించపరిచారు. అయినా ఇద్దరు కొడుకుల ఉన్నత చదువులకోసం ఆటో డ్రైవర్‌గా మారిన ఆమె కథనం ఎంతో స్ఫూర్తిదాయకం.
లైబీది చాలా కష్టపడే మనస్తత్వం. ఇద్దరు కొడుకులు, భార్యాభర్తలు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్టుగా ఉండేది. కానీ... అనుకోని విధంగా జీవితం మారిపోయింది. భర్తకు తీవ్రమైన మధుమేహం అని తేలింది. మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ పోషణ భారమంతా లైబీ మీదే పడింది. ఇటుకబట్టీల్లో పనిచేసింది లైబీ. అలా వచ్చిన డబ్బుతో ఓ సెకండ్ హ్యాండ్ ఆటోను కొని... కిరాయికిచ్చింది. ఆ డ్రైవర్ బాధ్యతారాహిత్యంతో వాల్ల పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. 2011-12 ప్రాంతంలో మణిపూర్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాంతో ఇద్దరు కొడుకులు చదువు మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. వాళ్లకు తిండిపెట్టడమే గగనమయ్యింది. కొడుకుల కడుపునింపడం కోసం తన కడుపు మాడ్చుకుంది ఎన్నోసార్లు.
ఇవన్నీ కాదని... తమ ఆటో రిక్షాను తానే నడపాలని నిర్ణయించుకుంది. నిజానికి మణిపూర్ మరీ... శ్రమలో మహిళల భాగస్వామ్యం లేనిరాష్ట్రం కాదు. అన్ని రకాల శ్రమల్లో మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. అయినా ఆమె ఆటోనడపడం మొదలుపెట్టగానే ఎన్నో విమర్శలు. ఏదైనా ఆడవాళ్ల పనులుంటే చూసుకోమన్నారు. చివరకు ట్రాఫిక్ పోలీసులు సైతం... ఆమె కనబడితే ఎక్కువ ఫైన్ వేసేవారు. ఆటోడ్రైవర్ కొడుకని పిల్లలను కూడా ఏడిపించేవారు. మరోవైపు ఇంట్లో దారుణమైన పరిస్థితులు. అన్నింటినీ ఎదురీదింది. ఆమె ముందున్న లక్ష్యం ఒక్కటే ఇద్దరు కొడు కులను చదివిం చాలి. అలా ఓ రోజు ఆటోస్టాండ్‌లో నిలబడిన ప్పుడే... ఫిలిం మేకర్ మీనా ఆమెను చూసింది. తన కెమెరాతో లైబీ జీవితాన్ని చిత్రీకరిం చింది. 2015లో ఆ డాక్యుమెంటరీ జాతీయ అవార్డును దక్కించుకున్నది. డాక్యుమెంటరీ వార్తా పత్రికల్లో హెడ్లైన్ అయిన తరువాత.. లైబీ జీవితం కాస్త మెరుగైంది. ఆమెను గుర్తించడం, గౌరవించడం మొదలుపెట్టారు. ఆమెకు ఆదాయం కూడా పెరిగింది. దాంతో కొత్త ఆటో కొనుక్కుంది. ఇంటి లోన్ కూడా లభించింది. ఇప్పుడు పెద్దకొడుకు గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది ఆ యువకుడి లక్ష్యం. దాన్ని నెరవేర్చడం కోసమే కష్టపడుతున్నాననంటుంది లైబీ. చిన్న కొడుకు చండీగఢ్‌లోని ఫుట్‌బాల్ అకాడమీలో చేరాడు.