Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగుసార్లు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదడం అంటే సాధారణంగానే అనిపిస్తుండొచ్చు. కానీ.. అది సముద్రంలో 215 కిలోమీటర్ల దూరమయితే అసాధారణం అవుతుంది. ఆ అసాధారణ పనిని ఓ క్యాన్సర్ సర్వైవర్ చేస్తే... కచ్చితంగా ఆమె సూపర్ హ్యూమన్ అయి ఉంటుంది. అలాంటి సూపర్ ఉమెన్... సారా థామస్. ఇంగ్లీష్ ఛానల్‌ను నాలుగుసార్లు ఈదిన మొట్టమొదటి మహిళ.
అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో పుట్టి పెరిగిన సారా థామ్‌సకు ఈదడం అంటే సరదా. పదేండ్ల వయసునుంచే ఈదడం నేర్చుకుంది. హైస్కూల్లో ఉన్నప్పుడు 200 మీటర్లు, 500 మీటర్లు తరువాత మైలు ఇలా ఫ్రీ స్టయిల్లో ఈదుతూ పోయింది. తరువాత పొలిటికల్ సైన్స్ జర్నలిజంలో డిగ్రీ చదివింది సారా. అప్పుడూ కూడా ఈతను వదిలిపెట్టలేదు. కానీ మాస్టర్స్ చదివేటప్పుడు మాత్రం ఈతకు దూరంగా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్‌లో లీగల్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అది పూర్తవ్వడంతోనే... మళ్లీ ఈత మీద దృష్టి సారించింది. మాస్టర్స్ స్విమ్ టీమ్‌లో చేరింది. 25 ఏళ్ల వయసులోనే 10 కి.మీ ఈత పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. సారాథామస్ మొట్టమొదటిసారి 2007లో కొలొరాడోలో పది కిలోమీటర్లు ఓపెన్ వాటర్ స్విమ్ చేసింది. అది మొదలు.. రానురాను స్విమ్మింగ్‌లో ఆమె అడుగుపెట్టని విభాగం లేదు. అన్నింట్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లీష్ ఛానల్‌ను (ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య ఉన్న ఇంగ్లీష్ ఛానల్ నది (33.3 కి.మీ దూరం) ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సరుకు రవాణా మార్గం) తొలిసారి 2012లో ఈదింది. ఆ తరువాత 2016లో మళ్లీ విజయవంతంగా అవతలి ఒడ్డుకు చేరింది. అదే సంవత్సరం పోవెల్ నదిలో 128.7 కి.మీ దూరాన్ని 56 గంటల్లో ఈది అందర్నీ ఆశ్చర్యపరిచింది.
క్యాన్సర్‌తో పోరాడుతూనే...
సుదీర్ఘ సమయం ఈదడంలో ఆరితేరిన ఆమె జీవితంలో రొమ్ము కేన్సర్ రూపంలో అనుకోని కుదుపు. 2017 నవంబర్‌లో సారాకు రొమ్ము కేన్సర్ ఉందని వైద్యులు గుర్తించారు. 2018 వేసవిలో కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ చికిత్సలు చేశారు. దాంతో ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఆమె మాత్రం కేన్సర్ నుంచి బయటపడిన వారు తిరిగి మునుపటి జీవితాన్ని ఆస్వాదించగలరని నిరూపించాలనుకున్నది. సర్జరీ పూర్తయిన ఏడాదిలోనే నీటి కొలనులోకి దిగింది. సెప్టెంబర్ 15న ఇంగ్లీష్ ఛానల్ నదిలో నాలుగోసారి అడుగుపెట్టింది సారా. ఆమెకు దారి చూపించడం, ఆహారం అందించడం, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే నీళ్లలోకి దిగి కాపాడేందుకు ఆమె తల్లి, భర్త, కొందరు సహాయకులు ఒక పడవలో ఆమెకు తోడుగా వెళ్లారు. ఫ్రాన్స్‌లోని కలాయిస్ పోర్టు నుంచి ఆదివారం ఉదయం ఈదడం మొదలెట్టిన ఆమెకు ఈ ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏం జరగలేదు. 24 గంటలు ఈదిన తర్వాత అనారోగ్యంగా అనిపించిందామెకు. ఇక నా వల్ల కాదు ఆపేద్దాం అనుకున్నది. కానీ ఆమె భర్త, తల్లి ప్రోత్సహించారు. ప్రతి 30 నిమిషాలకు కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ద్రవాహారం అందించారు. ఈదుతున్న క్రమంలో ఉప్పు నీళ్లు నోట్లోకి వెళ్లడంతో ఆమె గొంతు, నాలుక ఉబ్బిపోయాయి. మార్గమధ్యంలో కొన్ని జెల్లీఫిషలు సారా ముఖం మీద గాయాలు చేశాయి. గమ్యానికి 400 మీటర్ల దూరంలో పెద్ద అలలో చిక్కుకుంది సారా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వెరవకుండా ఆమె తన సాహస యాత్రను పూర్తి చేసింది. అన్ని అడ్డంకులనూ అధిగమించి 54 గంటలు ఈది తీరం చేరుకున్నది సారా. దీంతో నాలుగోసారి విజయవంతంగా ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.