Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా సాధికారత అంటే చదువుకోవడం, ఉద్యోగం చేయడం మాత్రమే కాదు. మహిళలు పురుషులతో సమానంగా అధికారాన్ని పొందడం. అధికారం అంటే కుంటుంబంపైనా? సమాజంపైనా? పిల్లలపైనా? భర్తపైనా? కాదు. కట్టుకునే బట్టలపైనా, చదువులు, ఉపాధి అవకాశాలపైనా, భర్తను ఎంపిక చేసుకునే విషయంలో. ఇంకా చెప్పాలంటే వారి జీవితాలపైన వారే నిర్ణయాధికారం తీసుకోవడం.
- ఇప్పటికీ ఇంటా, బయటా స్త్రీలు చేస్తున్న పని విలువకు గుర్తింపు లేదు. ప్రపంచంలో మూడింట రెండు వంతుల శ్రమ స్త్రీలదేనని ఐరాస (ఐక్య రాజ్య సమితి) అధికారిక అధ్యయనం వెల్లడించింది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో ఆర్థికంగా తమ అవసరాలను తామే తీర్చుకోగలిగే అవకాశాలు కల్పించాలి. అప్పుడే ఆర్థికంగా పురుషులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. స్త్రీల ప్రథమ బాధ్యత పిల్లలు, ఇల్లు అని భావిస్తుంటారు చాలామంది మహిళలు. ఇది చాలా పొరపాటు.
అన్ని రంగాల్లో : చాలామంది మహిళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేసే ఉద్యోగాలను మాత్రమే ఎంచుకుంటారని భావన సమాజంలో ఉంది. ఈ రకమైన ధోరణి, చిన్నచూపు సహజమే. కానీ అదే సమయంలో మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్రను వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాల్లో విస్తృతావకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికీ ఇంటి పనుల్లో తమ శ్రమను వృథా చేసుకుంటున్నా వారు చాలామంది ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ఇంటి పనుల్లో మహిళలు కూరుకుపోవడం వల్ల దేశం ప్రతి ఏటా 1.7 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతుందని ఆర్థికనిపుణులు వెల్లడిస్తున్నారు.
సమాజాభివృద్ధికి: విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా నైపుణ్యం, నైపుణ్యం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అందువల్ల స్త్రీలకు సమాన విద్యావకాశాలు కల్పించాలి. చైతన్యవంతమైన మహిళా సమాజం, కుటుంబం స్థితిగతులనూ మార్చగలదు. ఇది సమాజాభివృద్ధికి అనివార్యం.
రాజకీయ సాధికారత: పరిపాలనలో, రాజకీయ అధికారంలో స్త్రీలకు సమాన అవకాశాలు ఉండాలి. అప్పుడే రాజకీయ నిర్ణయీకరణ అంశాల్లో వారి పాత్రకు గుర్తింపు లభిస్తుంది. మహిళల సమస్యలను ప్రస్ఫుటంగా వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ సాధికారత లభిస్తే ఇతర సాధికారతలపైనా గణనీయ ప్రభావం ఉంటుంది.
చట్టపరమైన విషయాల్లో: సమాజంలో ప్రభావవంతమైన, చట్టపరమైన విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు మహిళల బాధ్యత కచ్చితంగా ఉండాలి. చట్టపరంగా ఎలాంటి వివక్షలూ ఉండొద్దు. చట్టంలో పేర్కొన్నదానికి, వాస్తవంగా జరుగుతున్నదానికి మధ్య తేడా రాకుండా చూసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానులే. స్త్రీ, పురుషులనే భావన చూపొద్దు.