Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రతి ఒక్కరూ నిత్యం సమస్యలతో సహవాసం చేస్తూ జీవనం సాగిస్తు న్నారు.యాంత్రికంగా మారిపోయిన నేటి జీవన విధానంలో నిద్ర కూడా ఓ సమస్యగా పరిణమిస్తుంది. అయితే నిద్ర మనిషి ఆరోగ్యానికి ఓ వరం అని చెప్పాలి. ఆహారం, నీరు లేకుండా సుమారుగా ఒకటి, రెండు వారాలైనా ఉండగలమేమో గాని నిద్ర లేకుండా బ్రతకడం మాత్రం అసంభవం. ఒకవేళ ఉండే ప్రయత్నం చేస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. నేడు పలు సంస్థల్లో పగలు, రాత్రి డ్యూటీలు చేసేవారికి పలు అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. మనిషి శరీరానికి ఆహారం, నీరుతో పాటు నిద్ర కూడా అంతే అవసరం. నిశ్చింతగా నిద్రలేనివారు పలు రకాల అనారోగ్యాలతో బాధ పడుతుంటారని ఎంతోమంది వైద్యులు చెప్పిన మాట. అతి నిద్రకాక పోయినా మనిషి ఎంతవరకు నిద్రపోతే అనారోగ్యంపై ప్రభావం చూపదో, అంత నిద్ర తప్పనిసరి. ఆయా వయసులను బట్టి, వారి వయసు రీత్యా 6 నుండి 8 గంటల వరకు చక్కని నిద్ర అవసరం. నిద్రలేమితో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక చక్కని నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యవసరం.
మరి కలతలు లేని నిద్ర కావాలంటే..
దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. ఎన్నో టెన్షన్లు ఉంటాయి. వాటిని ఎంతగా గుర్తుచేసుకోకూడదనుకున్నా గుర్తుకొస్తునే ఉంటాయి. అలాగే ఇంటి బడ్జెట్ వంటి విషయాలను చర్చించడం, ఆలోచించడం వంటివి సాధ్యమైనంతవరకు వాటిని నిద్రకుపక్రమించేముందు పెట్టుకోకపోవడం మంచిది. ముఖ్యంగా టీవీ కూడా బెడ్రూంలో పెట్టుకోకుండా ఉంటే మంచిది. దానివల్ల లేట్‌గా నిద్రపోయే అవకాశం ఉంది. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అర్ధాకలితో కానీ, పూర్తి ఆకలితోకానీ నిద్రపోయే ప్రయత్నం చేయవద్దు. ఒక్కోసారి అది కూడా నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంది. పోషక విలువలు గల పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. నిద్రించే గదిలో ఆహ్లాదకరమైన సువాసనలు ఉంటే అవి మీ మెదడుపై ప్రభావాన్ని చూపించి చక్కని నిద్రను కలిగిస్తాయి.
అలాగే చీటికిమాటికి నిద్రలేపే దోమలు గదిలో లేకుండా చూసుకోవడం ముఖ్యం.అలాగే వివిధ రంగులు కూడా మనిషిని ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా ఇంటికి వేసే రంగులు. అలాగే బెడ్రూంలో అమర్చే బెడ్ ల్యాంప్ రంగులు కూడా. చాలామంది నిద్ర త్వరగా పడుతుందన్న ఆలోచనతో బెడ్రూముల్లో లైట్‌గ్రీన్, లైట్ బ్లూ కలర్ బెడ్లైట్స్ను అమర్చుతారు. వీలున్నంతవరకు బెడ్రూమ్లో ఎక్కువ కాంతి వచ్చే బెడ్ల్యాంప్లను వాడవద్దు. కలతనిద్ర ఆరోగ్యంపైనే కాదు, మనసును కూడా ప్రభావితం చేస్తుంది. కనుక కంటినిండ నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం.