Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదహారేళ్లకే అతని నుంచి ఆమెగా మారింది. అందుకు కుటుంబాన్ని ఒప్పించడానికి చాలా కష్టపడింది. తనపట్ల వివక్ష చూపుతున్న సమాజాన్ని ఎదిరించింది. చివరకు జీవితాన్ని గెలిచింది. ఆ విజేత కల్కి సుబ్రహ్మణ్యం. కవిగా, నటిగా, వ్యాపారవేత్తగా ఎదగడమే కాదు... సమాజంలో తనలాంటి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆ ఉద్యమకారిణి పరిచయం...
కల్కి ఈ స్థానానికి చేరుకోవడానికి చాలా అడ్డంకులు ఎదుర్కొంది. ఒకవైపు శరీరం మగాడి ది.. మనసు స్త్రీత్వాన్ని కోరుకుంటుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు తన స్థితి ఏమిటో తెలియని పరిస్థితి. కౌమార దశలోకి వచ్చాక... తానో మగాడిగా ఎదగడం లేదని అర్థమైంది ఆమెకు. ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒకరోజు ధైర్యాన్ని కూడదీసుకుని తన సమస్యను తల్లిదండ్రుల ముందుంచింది. వాళ్ళు కన్నీటి పర్యంతమయ్యారు. భవిష్యత్ గురించి భయపడ్డారు. అయితే వాళ్ల భయాన్ని గమనించిన కల్కి... తనని తానుగా వదిలేస్తే, కుటుంబ గౌరవం నిలబెడతానని మాటిచ్చింది. కల్కి మీద నమ్మకంతో చివరికి ఒప్పుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అందుకు నిదర్శనం ఆమె సాధించిన విజయాలు.
వ్యాపారవేత్తగా...
ఓ ఫ్రెండు తన మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని అమ్మి పెట్టమని అడిగాడు. తెలిసినవాళ్లందరినీ అడిగి చూసింది. ఎవ్వరూ ముందుకురాలేదు. అప్పుడు ఆమెకు ఆన్లైన్లో పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అలా కల్కి ఎంటర్‌ప్రైజెస్‌కు పునాది పడింది. వస్తున్న లాభాలు చూసి సంతోషించింది. అక్కడితో ఆగలేదు తను. త్వరలో స్వచ్ఛమైన, పర్యావరణానికి నష్టం కలిగించని ఆర్గానిక్ సబ్బులు, హెల్త్ కేర్ ఉత్పత్తులతో 'కల్కి ఆర్గానిక్స్' అనే కొత్త వెంచర్‌ను ప్రారంభించబోతోంది.
కవయిత్రిగా..
జర్నలిజం, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్డిగ్రీ చేసిన కల్కి కల్కి ఇంగ్లిష్, తమిళ్లో అద్భుతంగా రాస్తుంది. పదేళ్లుగా ఆమె ట్రాన్స్ జెండర్స్ హక్కుల కోసం అనేక రచనలు చేసింది. ఆమెకు కవిత్వం అంటే కూడా ఇష్టం.కవితల సంకలనం 'కురి అరితియన్' ఆవిష్కరించింది. ఇందులోని కవితల తనలాంటి విభిన్న మహిళల జీవితాలను ఆవిష్కరిస్తాయని చెబుతుందామె. మొదటి కవితా సంకలనానికి మంచి ఆదరణ రావడంతో త్వరలో మరో రెండు తమిళ కవితల పుస్తకాలు, ఇంగ్లీష్ బుక్‌ని తీసుకురావాలనుకుంటోంది.
హక్కుల ఉద్యమంలో..
మనదేశంలో ట్రాన్స్‌జెండర్స్‌కు కనీస గౌరవం లేదు సరికదా సమాజం ఆమోదం లభించదు. బతుకుతెరువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదువు వుండదు. ఇల్లు, వాకిలి లేవు. అసలు రేపటి మీద నమ్మకమే ఉండదు. అలాంటి వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ట్రాన్స్జెండర్లకు చట్టపరంగా గుర్తింపు కోసం ప్రస్తుతం ఆమె పోరాడుతున్నది. వారి హక్కుల కోసం ఓ వైపు న్యాయస్థానాల్లో పోరాడుతూనే, విద్యా సంస్థల్లో ట్రాన్స్జెండర్లు ఎలాంటి వివక్ష లేని స్వేచ్ఛా వాతావరణంలో చదువుకునే పరిస్థితులకోసం ఉద్యమిస్తోంది. సామాజిక, న్యాయ, ఆర్ధిక రంగాల్లో వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న సహోదరి ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తోంది. 2009లో ఆమె ట్రాన్స్జెండర్ల కోసం ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. 2011లో 'నర్తకి' అనే ఓ తమిళ సినిమాలో కల్కి నటనకు ఇటు తమిళ నాడులోనే కాక, ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలొచ్చాయి. 2010 ఫిబ్రవరి 21న కల్కి చెన్నై లయన్స్‌క్లబ్ నుంచి 'లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్‌ను అందుకుంది.
పుస్తకాలతోనే...
'నేను అందరిలాంటి దాన్ని కాను. అయినా.. ఎవరికంటే తక్కువ కాను. ఎప్పటికప్పుడు, అందరికంటే మెరుగ్గా, మరింత ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నిస్తాను. జీవితంలో ప్రతిక్షణం ఏదో ఒకటి నేర్చుకుంటాను' అని తనను తాను నిర్వచించుకుంటుంది. కష్టాలొచ్చినప్పుడు ఎదురొడ్డి నిలబడాలి. పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి భయపడడం వల్ల నిస్పృహ వస్తుందే తప్ప.. ప్రయోజనం ఉండదని చెబుతుంది కల్కి. ఇదంతా ఎలా సాధ్యమయిందంటే.. కుటుంబ ప్రేమానురాగాలు, చదివిన పుస్తకాలు కొండంత ధైర్యాన్నిచ్చాయని చెబుతుంది.
- ఆద్యా ఏంజిలో