Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల కూతురు సోని ఆరో తరగతి చదువుతోంది. సోని చేసే ప్రతి పనిని కమల నియంత్రిస్తూ ఉంటుంది. ఎప్పుడూ అది చేయొద్దు..ఇది ఇలా చేయకూడదని చెబుతూనే ఉంటుంది. కమల మాదిరిగా మీరు కూడా అనుక్షణం మీ పిల్లల వెంటపడి ఏదొకటి చెప్తున్నారా? అయితే ఇకపై ఇలా చేయకండి, అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలు చేసే ప్రతి పనిని గమనిస్తూ దానిని విమర్శిస్తూ.. ఏదో ఒకటి చెప్పుకుంటూ వుండటం మంచిది కాదని వారు సూచిస్తున్నారు. వారిని కాస్త స్వేచ్ఛగా వదలాలి. వారిని ఆలోచింపజేయాలి.
అలాగే టీవీ ఛానల్స్ అన్నీ ఓపెన్ అయ్యే మాదిరి చూడాలి. వారికి అవసరమైన విషయాలకు సంబంధించి సమాచారం అందించాలి. కాని డిక్టేట్ చేయడం, విమర్శించడం లాంటివి చేయకూడదు. అనుక్షణం వారి వెంటపడి ఏదోకటి చెప్తుంటే పని జరగదు. వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తారో ముందుగా అది వినాలి.
కొందరు పిల్లలు ఏదైనా చెప్పిన వెంటనే నేర్చేసుకుంటారు. ఇంకొందరు అలా నేర్చుకోలేకపోతారు. అంతమాత్రాన వారు పనికిరారని అర్థంకాదు. ఇలాంటి వారిలో నేర్చుకునే లక్షణాన్ని పెంపొందించడానికి అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు తమవంతు కృషి చేయాలి. పిల్లల అభ్యాసం, అభ్యాస వైఫల్యాల్ని ఎదుర్కొనే విషయంలో ఇంట్లో పెద్దలు సున్నితమైన విధానాలను అనుసరించాల్సి వుంటుంది.
కొందరు తల్లిదండ్రులు పిల్లలు తమ అంచనాలకు తగిన విధంగా మార్కులు తెచ్చుకోకపోతే ఇక వారి జీవితమే నాశనమైనట్లు భావిస్తారు. పిల్లల వల్ల కుటుంబం పరువు పోయినట్లు గోల చేస్తారు. దీని వల్ల పిల్లలు కుటుంబానికి దూరమైపోతారు.
ఫలితాలెలా ఉన్నా మీరు పిల్లల్ని ప్రేమిస్తున్నామని, అయితే తమలో ఉన్న సామర్థ్యాన్ని పిల్లలు సరిగ్గా ఉపయోగించడంలేదని అందుకే తాము బాధపడుతున్నట్లు వివరించాలి. ఇలాంటి భరోసా వల్ల వారిలో అబద్ధాలు చెప్పే గుణం తగ్గుతుంది. ప్రోగెస్ కార్డుల్లో మార్కుల్ని మార్చే ప్రయత్నాలు చెయ్యరు. పరీక్షల్లో కాపీలు కొట్టరు. ప్రొగ్రెస్ రిపోర్ట్ కార్డులపై సంతకాల ఫోర్జరీ అంతకంటే చెయ్యరు. ఇతరత్రా తప్పులకు ఆస్కారం ఉండదు.