Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలే పండగలు. దాంతో మహిళలు ఎంతో బిజీ... బిజీ... వరలక్ష్మీ వ్రతం, కేరళ స్పెషల్ పండగ ఓనం, రాఖీ... మన ఇళ్ళలో పండగలప్పుడు, పూజలప్పుడు స్వీట్లు చేయడం తప్పనిసరి. మరి, ఇన్ని పండగలు ఒకేసారి కలిసిరావడంతో ఇంట్లో స్వీట్ల ఘుమఘుమలే. అవే కొద్దిగా వెరైటీగా చేస్తే... మరెందుకు ఆలస్యం ప్రారంభించండి.
అడ పాయసం
కావల్సిన పదార్థాలు: అడ (రైస్ల్ ప్లాక్స్ లేదా రైస్ చిప్స్ ఇవి మార్కెట్లో లభిస్తాయి) - ఒక ప్యాకెట్ (వీటిని బియ్యంతో తయారుచేస్తారు) పాలు - 2 లీటర్లు, జీడిపప్పు - 10, ఎండు ద్రాక్ష - 10, నెయ్యి - ఒక కప్పు, కుంకుమపువ్వు - చిటికెడు, చక్కెర - ఒక కప్పు;
తయారీ: ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరిగించాలి. అందులో 100-150గ్రాముల అడ వేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి లోతైన గిన్నె తీసుకొని అందులో పాలు పోసి కాచాలి. పాలు బాగా కాగిన తర్వాత, వేడినీటిలో నానబెట్టుకొన్న అడను వడగట్టి పాలలో వేసి మద్యమధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది, ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇందులో పంచదార వేసి కరిగే వరకూ కలపాలి.
ఒక చిన్న కప్పులో ఒక స్పూన్ పాలు, చిటికెడు కుంకుమపువ్వు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పాయసం చిక్కబడుతున్నప్పుడు అందులో కుంకుమపువ్వు మిశ్రమాన్ని వేయాలి. మరో పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకొని అడ పాయసంలో వేసి కలపాలి. చివరగా కొద్దిగా నెయ్యి పైన వేసి కలపాలి. అంతే ఓనమ్ స్పెషల్ అడ పాయసం రెడీ.గసగసాల హల్వా
కావల్సిన పదార్థాలు: గసగసాలు - 100గ్రా, చక్కెర - 1/2 కప్పు, పాలు - 2 కప్పులు, నెయ్యి - 1/2 కప్పు, యాలకులు - 5(పొడి చేసుకోవాలి), బాదం - 6;
తయారీ: ముందుగా గసగసాలను శుభ్రంగా కడిగి, సన్నగా ఉన్న మట్టి, దుమ్మును తొలగించాలి. తర్వాత నీరు పూర్తిగా కారిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద మందపాటి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక గసగసాలు వేసి, తక్కువ మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు అందులో పాలు పోసి మరిగించాలి. అలాగే యాలకులపొడి కూడా వేసి మీడియం మంట మీద పాలు చిక్కబడే వరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడే, అందులో చక్కెర కూడా వేసి కలపాలి. పాలు చిక్కబడి, గసగసాలతో కలిసిపోయి మొత్తగా హల్వాలా తయారైనప్పుడు బాదం పప్పుతో గార్నిష్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన గసగసాల హల్వా రెడీ.
ఆలూ ఖీర్
కావల్సిన పదార్థాలు: ఆలు - 2, నెయ్యి - 4 టీ స్పూన్లు, ఎండుద్రాక్ష- 10, జీడిపప్పు - 10, పాలు - మూడు కప్పులు, చక్కెర - ముప్పావు కప్పు, యాలకులపొడి - అర టీ స్పూను, కుంకుమపువ్వు - కొద్దిగా;
తయారీ: ముందుగా ఆలు తొక్క తీసి తురుముకోవాలి. తర్వాత ఈ తురుమును నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి నీటిలో నాననివ్వాలి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. వేడి అయిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు నీటిలో నుండి ఆలు తురుములోని నీటినంతా పిండేసేయాలి. ఈ తురుమును పాన్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి (అడుగంటకుండా). వేగిన తర్వాత అందులోనే పాలు పోసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో పంచదార, యాలకుల పొడి, ద్రాక్ష, జీడిపప్పు వేసి కలపాలి. చివరగా కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన ఆలూ ఖీర్ రెడీ
కోవా కోకనట్ బర్ఫీ
కావల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము - ఒక కప్పు, కోవా - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, మిల్క్ పౌడర్ - ఒక టేబుల్ స్పూను, చక్కెర - ఒక కప్పు, యాలకులు - 1/4 టేబుల్ స్పూను, నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు. తయారీ: ముందుగా స్టౌవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరో పాన్ లో కోవా, చక్కెర వేసి కరిగేంతవరకు కలుపుతుండాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కొబ్బరి తురుము, మిల్క్ పౌడర్ వేసి కలపాలి.
ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు చెంచాల నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. దీనిలో పాన్లో ఉడుకుతున్న మిశ్రమాన్ని వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయంత సైజులో ఉండలుగా చుట్టుకోవడమే. లేదా చాకుతో చతురస్రాకారంలో మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు. అంతే కోవా కోకనట్ బర్ఫీ రెడీ.