Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఉసిరికి మంచి గిరాకీ. ఇటు ఆరోగ్యానికి, అటు రుచికి దీనికి ఇదే సాటి. అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద ఉసిరి పచ్చడితో తినాలి అంటారు పెద్దలు. ఉసిరి ఆవకాయతో కొసరి కొసరి ముద్దలు పెడుతుంటే పిల్లలూ, పెద్దలూ గుటకలేసుకుని మరీ తింటారు. విటమిన్ సి ఎక్కువగా వుండి రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఉసిరితో ఇంకా ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. వాటిలో కొన్ని ఈ రోజు తెలుసుకుందాం...
పులిహోర
కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఆరు, ఉడికించిన రైస్ - అర కేజీ, ఆవాలు - అరస్పూన్, శెనగపప్పు - మూడు టీస్పూన్లు, పల్లీలు - ఐదు స్పూన్లు, ఎండు మిర్చి - ఆరు, నూనె - నాలుగు టీస్పూన్, ఉప్పు - తగినంత, పంచదార - ఒక స్పూన్, మినప్పప్పు - ఒక టీస్పూన్, కరివేపాకు తరుగు - ఒక కప్పు.
తయారీ విధానం: గింజలు తొలిగించిన ఉసిరికాయలను మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. అన్నం వండి పెద్ద ప్లేటులోకి తీసుకోవాలి. ఆపై స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి ఎర్రగా వేయించాలి. అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి. అందులో పసుపు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి వేయాలి. ఈ మిశ్రమాన్ని వండి చల్లార్చి ఉంచిన అన్నంలో కలపాలి. చివరగా కొద్దిగ బెల్లం వేసి కలిపి ఓ గంటసేపు అలాగే ఉంచి ఆ తర్వాత తింటే ఎంతో రుచిగా వుంటుంది.
ఉసిరి ఆవకాయ
కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు - పది, ఆవపిండి - ఆర కప్పు, కారం - ఒక కప్పు, ఉప్పు - కప్పు, పసుపు - చిటికెడు, వేయించిన మెంతి పొడి - స్పూను, చింతపండు గుజ్జు - మూడు స్పూన్లు, ఇంగువ అర స్పూను, పోపుదినుసులు - తగినన్ని, నువ్వులనూనె - ఒకటిన్నర కప్పు.
తయారు చేసే విధానం: ఆవకాయ పెట్టాలంటే ముందుగా ఉసిరికాయకి చాకుతో గానీ, ఫోర్క్‌తో గానీ గాట్లు పెట్టి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిలో నువ్వుల నూనె వేసి ఉసిరికాయల్ని మూతపెట్టి దోరగా వేయించుకోవాలి. వేగాక వాటిని ఒక బౌల్ లోకి తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారం, అరకప్పు ఆవపొడి,(ఘాటు కావాలనుకునేవారు ఒక కప్పు వేసుకోవచ్చు) మెంతిపొడి, వేడినీటితో నానబెట్టిన చింతపండు గుజ్జు, పచ్చి మెంతులు కొన్ని వేసి కలపాలి. ఇలా కలుపుకున్న ఆవకాయలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవాలి. మిగిలిన నువ్వుల నూనెని కూడా కలిపి ఉంచుకుంటే ఏడాది మొత్తం నిల్వ ఉండే ఉసిరికాయ ఆవకాయ రెడీ అవుతుంది.
పొడి
కావలసిన పదార్థాలు: ఉసిరి కాయలు - పావుకిలో, జీలకర్ర - రెండు స్పూన్లు, మిరియాలు - అరస్పూన్, శొంఠి - యాభై గ్రాములు, ఇంగువ - కొద్దిగా, ఉప్పు - సరిపడా.
తయారీ విధానం: ఉసిరికాయల్ని ఎండపెట్టాలి. అవి ఎండిన తరువాత ఉసిరికాయలు, జీలకర్ర, ఇంగువ, శొంఠి, మిరియాలు, ఉప్పుతో కలిపి మిక్సీ పట్టాలి. ఈ ఉసిరి పొడిని వేడి వేడి అన్నంలో, నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది.
జామ్
కావల్సిన పదార్థాలు: ఉసిరికాయలు - పది, నిమ్మకాయ - ఒకటి, అరటిపండ్లు - రెండు, యాపిల్, బీట్రూట్ - ఒక్కోటి చొప్పున, చక్కెర - కప్పు, నెయ్యి - ఐదు చెంచాలు.
తయారీ విధానం: బాణలిలో నాలుగు చెంచాల నెయ్యి కరిగించి ఉసిరికాయల్ని వేయాలి. అవి మెత్తగా మగ్గాక దింపేసి ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. బీట్రూట్ చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. యాపిల్, అరటిపండ్లను చిన్న ముక్కల్లా కోసుకోవాలి. ఇప్పుడు బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి బీట్రూట్ తురుము వేసి వేయించాలి. కాసేపటికి బీట్రూట్ తురుములోని పచ్చిదనం పోతుంది. అప్పుడు ఉసిరిముక్కలూ, అరటిపండు, యాపిల్ ముక్కలు వేసి మూత పెట్టేయాలి. ఈ ముక్కలు మెత్తగా అయ్యాక చక్కెర కూడా వేసి కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగి చిక్కగా దగ్గరకొచ్చాక పొయ్యి కట్టేయాలి. కాసేపటికి ఈ జామ్ చల్లారుతుంది. అప్పుడు నిమ్మరసం వేసి కలిపి ఓ సీసాలోకి తీసుకోవాలి. ఇది రెండు మూడు రోజులు తాజాగా ఉంటుంది. దీన్ని బ్రెడ్ స్లైసులపై రాసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.