Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల తప్పిన అనుమానం రాగానే మూత్ర పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఈ కిట్లు మెడికల్ షాపులలో దొరుకుతున్నాయి. నెలసరి రావల్సిన తేదీకి రాకపోతే ఈ పరీక్ష చేసుకోవాలి. ఇది నెల తప్పిన వారం రోజుల తర్వాతనే చేసుకోవాలి.
టెస్ట్ ఎలా చేసుకోవాలి
గర్భిణి మూత్రంలో పిండం నుంచి వచ్చే ఒక హార్మోన్ ఉంటుంది. దీన్ని బట్టి నెలతప్పిన విషయం నిర్ధారణ అవుతుంది. ఈ పరీక్ష చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం కరెక్ట్‌గా తెలుస్తుంది. పొద్దున్నే నిద్ర లేవగానే వచ్చే మూత్రం ఒక సీసాలో పట్టుకోవాలి. రెండు చుక్కల యూరిన్‌ను పిల్లర్ ద్వారా కిట్‌లో వుండే చిన్న గిన్నె లాంటి భాగంలో వేయాలి. ఇలా వేసిన తర్వాత కిట్ మధ్యలోఎరుపు రంగులో రెండు గీతలు వస్తాయి. రెండు గీతలు ఎరుపు రంగులో వస్తే కడుపులో పిండం పెరుగుతుందని స్పష్టం అవుతుంది. ఒకే గీత వస్తే మాత్రం గర్భం లేనట్టుగా అర్థం చేసుకోవాలి.
ఇంకొన్ని పరీక్షలు
గర్భం నిర్ధారణ అయ్యాక కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. బరువు, ఎత్తు, రక్తపోటు, మూత్రంలో ఆల్బుమిన్, పెల్వికీ పరీక్షలు చేసి గర్భిణీ ఆరోగ్యాన్ని డాక్టర్లు అంచనా వేస్తారు.
మొదటి మూడు నెలలలో కలిగే మార్పులు
మొదటి మూడునెలల్లో కలిగే మార్పులు అందరిలో ఒకేలా వుంటాయని చెప్పలేము. గర్భం నిలిచిన ఏడు రోజుల తర్వాత చిన్న కణాల గుంపు గుడ్డుగా మారి, గర్భసంచి గోడకు అంటుకుంటుంది. ఈ మార్పు జరుగుతున్నప్పుడు కొత్త రక్త కణాలు ఏర్పడుతాయి. ఈ కారణంగా కొంత మందిలో చాలా అరుదుగా రక్తస్రావం కనిపిస్తుంది.
ఎక్కువ సార్లు మూత్ర విసర్జన
హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల చాలా సార్లు మూత్ర విసర్జన అవుతుంది. శరీరం వేడిగా, బరువు వెక్కినట్లు అనిపిస్తుంది. పాల గ్రంథులు పెరగటం మొదలవుతాయి. రొమ్ములకు రక్త ప్రసరణ ఎక్కువ కావటం వలన నరాలు స్పష్టంగా కనబడతాయి. కొంతమందికి చనుమొనల భాగం నల్లగా, పెద్దగా అవుతుంది. ఈ మార్పులు మొదటి సారి గర్భం దాల్చిన వారిలోనే బాగా కనబడతాయి. ఈ సమయంలో సాధారణంగా వికారం, వాంతులు అవుతుంటాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మొదటి మూడు నెలలలో తీసుకోవాల్సి జాగ్రత్తల విషయానికి వస్తే అవసరం లేకుండా ఎక్కువ సార్లు పెల్వికీ పరీక్ష చేయించుకోకూడదు. అయితే అకస్మాత్తుగా రక్త స్రావం కనపడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
పొత్తి కడుపులో నొప్పి
పొత్తి కడుపులో మరీ ఎక్కువగా నొప్పి వుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు డాక్టర్లు రాసిచ్చిన మందులు కాకుండా ఏ ఇతర మందులు వాడకూడదు. నొప్పి తగ్గడానికి మందులు వేసుకోకూడదు. ముఖ్యంగా మొదటి మూడు నెలలు ఇది తప్పకుండా పాటించాలి.
పిండం ఎదుగుదల
మొదటి మూడు నెలలు పొట్ట పెరగటం అంతగా కనిపించదు. ఆరు నెలలు నిండే సరికి పిండం పూర్తిగా ఎదిగి కళ్ళు, ముక్కు , చెవులు, కాళ్ళు చేతులతో బిడ్డ ఆకారానికి వస్తుంది. ఈ సమయంలో తల్లి ఏ మందులు తీసుకున్నా వాటి ప్రభావం బిడ్డ మీద కూడా వుంటుందని గ్రహించాలి.
- డాక్టర్ రమాదేవి,
ప్రొఫెసర్ , గాంధీ మెడికల్ కాలేజీ,