Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుకుల పరుగుల జీవితం. ఏ కాస్త సమయం దొరికినా ఫోన్లోనే. ఇక పిల్లలతో గడిపే సమయం ఎక్కడిది? దాంతో పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ప్రేమ, అనుబంధాలూ తక్కువే. ఇలాంటి వాతావరణం ఉండే ఇండ్లలోని పిల్లలూ ఇతరులని అనుసరిస్తూ ఉంటారు. లేదంటే సెలబ్రిటీల నుంచి స్ఫూర్తిపొందుతూ వాళ్లని తమలా ఊహించేసుకుంటుంటారు. ఇలా వారు తమకంటూ సష్టించుకుంటున్న పిల్లల కొత్త ప్రపంచంలో తల్లిదండ్రులకు స్థానం లేకుండా పోతుంది. మరి అలా కాకుండా ఉండాలంటే...మనలో మార్పే ముఖ్యం.
పిల్లలే ముఖ్యమని తెలిసేలా..
పిల్లలు మీ ఉనికిని గ్రహించేలా మెలగండి. ఇందుకోసం వాళ్ల ప్రెజెన్స్ మీకెంతో ముఖ్యమైన విషయం అన్నట్టుగా ప్రవర్తించండి. చేతిలోని మొబైల్ పక్కన పెట్టేయండి. వాళ్లు చెప్పే మాటలు మనసు పెట్టి శ్రద్ధగా వినండి. ఆ మాటల ద్వారా వాళ్ల మనసుని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన విషయమైనా సరే పిల్లలు హుషారుగా చెప్తున్నప్పుడు ఆసాంతం వినండి. 'అలాగా!' అంటూ మరింత ఆసక్తి కనబరచండి. పిల్లలు ఆడుతుంటే చూడటానికి స్కూల్‌కి వెళ్లి పక్కన కూర్చున్న వాళ్లతో కబుర్లలో పడకండి. వాళ్లు ప్రతి చిన్న విషయాన్ని కనిపెట్టగలుగుతారు. వాళ్లు మీకు మానసికంగా కనెక్ట్ కావాంటే శరీరంతో పాటు మనసును కూడా లగం చేయండి.
ఎక్కువ సమయం వారితోనే...
టెక్నాలజీ జీవితాల్లో భాగమైపోయింది కాబట్టి ఎల్లవేళలా ఆన్లైన్లో ఉండటం అవసరం కావొచ్చు. అయితే మీరెంత పని ఒత్తిడితో ఉన్నారో మీ పిల్లలకు తెలియాల్సిన అవసరం లేదుగా! వాళ్లతో ఆటలాడటానికి, మీ పనులకు ప్రత్యేక సమయాలుంటాయనేట్లుగా వ్యవహరించకండి. అలాంటి బిహేవియర్ వల్ల పిల్లలతో మీరు కలిసి ఉన్నా లేనట్టే ఫీలవుతారు. కాబట్టి పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. కొన్నిసార్లు రోజు మొత్తం పిల్లలకు దూరంగా ఉండాల్సి రావొచ్చు. అలాంటప్పుడు ఫోన్ ద్వారా టచ్‌లో ఉండండి. ఎదురుగా ఉన్నప్పుడు ఎంత సరదాగా మాట్లాడతారో ఫోన్లో కూడా అలాగే మాట్లాడండి. ఆరోజంతా వాళ్లతో గడపలేదనే లోటును పిల్లలు ఫీలవ్వకుండా చేయండి.
శ్రద్ధగా వినండి
వయసు పిల్లలైనా వారికి అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉండాలి. పిల్లల వయసునిబట్టి వాళ్ల ప్రాధామ్యాలపరంగా మీ ప్రెజెన్స్ అవసరం అనిపించిన సందర్భాలన్నిటిలో మీరు ఉండేలా చూసుకోండి. ఇందుకోసం ఆఫీసు పనులు పక్కనపెట్టి రాత్రి భోజనం వేళకి ఇంటికి చేరుకోవలసిరావొచ్చు. నిద్రపట్టేవరకూ కథ చదివి వినిపించాల్సిరావొచ్చు. స్కూల్ నుంచి పికప్ చేసుకోవలసిరావొచ్చు. సందర్భం ఏదైనా వాళ్లతో కనెక్ట్ అయ్యే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. ఐదేళ్ల బాబు ఆరోజు స్కూల్లో నేర్చుకున్న కొత్త ఇంగ్లీషు పదం గురించి చెప్పేటప్పుడు, పదిహేనేళ్లవాడు తన ఫ్రెండ్‌తో వచ్చిన అభిప్రాయభేదాల గురించి చెప్పేటప్పుడు సమానమైన శ్రద్ధ కనబరచండి.
వ్యక్తులు కాదు ప్రతిభే ముఖ్యం
ఎవరైనా ఆటగాడు, నటుడిని అభిమానిస్తున్నప్పుడు వాళ్లు ఆడే విధానాన్ని లేదా ఫలానా సినిమాలో నటనను ఇష్టపడుతున్నట్టు స్పష్టంగా చెప్పండి. సెలబ్రిటీలను వ్యక్తిగతంగా మనం ఎరగం కాబట్టి నిజ జీవితంలో వాళ్లెలాంటివారో మనకు తెలిసే వీలులేదనే విషయాన్ని గ్రహించేటట్టు చిన్న వయసులోనే పిల్లలకు నేర్పండి. ఇలాంటి నైజం అలవడితే సమాజం సెలబ్రిటీలను ఆరాధించే తీరును బట్టి పిల్లలు వాళ్లను రోల్ మోడల్స్‌గా ఎంచుకోకుండా ఉంటారు. ఈ తత్వం పిల్లలకు ఎంత చిన్న వయసులో వంటబడితే అంత మేలు.