Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేస్తున్న ఉద్యోగానికన్నా మెరుగైన జీతంతో, పెరుగుతున్న హోదాతో ఎంతో మంది ఉద్యోగాలు మారుతుంటారు. ఇలా ఉద్యోగాలు మారుతున్నప్పుడల్లా ఆర్థిక విషయాలు అంటే జీతం తాలుకూ బ్యాంక్ ఎకౌంట్, పిఎఫ్ లాంటి వాటి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇప్పుడు ఏ సంస్ధలోనైనా వారు ఇచ్చే వేతనాలన్నీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. బ్యాంకులు కూడా ఉద్యోగస్థుల కోసం ప్రత్యేకంగా 'జీరో బ్యాలెన్స్' వేతన ఖాతాలను అందిస్తున్నాయి. అందువల్ల కొత్త ఉద్యోగంలో చేరినప్పుడల్లా కొత్త వేతన ఖాతాను కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, ఇలాంటప్పుడే చాలా మంది పొరపాటు చేస్తుంటారు. అదేంటంటే... పాత వేతన ఖాతాను రద్దు చేసుకోకుండానే కొత్త ఖాతాను ప్రారంభిస్తారు. దీని వల్ల ఇబ్బందులు వస్తుంటాయి.
పాత వేతన ఖాతా రద్దు
వేతన ఖాతాలో కనీసం మూడు నెలల పాటు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే దాన్ని సాధారణ పొదుపు ఖాతాగా మార్చేస్తాయి బ్యాంకులు. అప్పుడు మీకుండే 'జీరో బ్యాలెన్స్' ప్రయోజనం దూరమవుతుంది. కనీసం ఖాతాలో కనీస నిల్వ లేకపోతే... రుసుము విధిస్తారు. ఇది కూడా బ్యాంకును బట్టి మారుతుంటుంది. పైగా ఖాతా అమల్లో ఉండాలంటే క్రమం తప్పకుండా ఆర్థిక వ్యవహారాలు నడపాలి.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రెండేళ్ళకు మించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాలను నిష్క్రియ ఖాతాలుగా వ్యవహరిస్తారు. ఒకవేళ అలా మార్చినా కూడా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? కొత్త ఉద్యోగంలో చేరిన వెంటనే పాత సంస్థ అందించిన వేతన ఖాతాను రద్దు చేసుకోవడం ఉత్తమ మార్గం. ఇలా చేయడం వల్ల అనవసరమైన చార్జీలు చెల్లించాల్సిన బాధ తప్పుతుంది. పైగా ఇలా రుసుములు చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోరు మీద కూడా దాని ప్రభావం పడుతుంది.
మరీ, ఈపీఎఫ్ సంగతి?
ఉద్యోగం మారినప్పుడు చాలా మంది ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) దగ్గర అయోమయానికి గురవుతారు. ఇలాంటి సందర్భాల్లో రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి, మొత్తంగా సొమ్ము తీసేసుకొని ఖాతాను రద్దు చేసుకొని, కొత్త ఉద్యోగ సంస్ధ ద్వారా కొత్త ఖాతాను ప్రారంభించడం. లేదా పాత ఖాతా రద్దు చేసుకోకుండా కొత్త సంస్ధకు బదిలీ చేసుకోవడం.
అంతేకాదు, పాత ఖాతాను రద్దు చేసుకోకుండా కొత్త ఖాతను ప్రారంభించవచ్చు. కానీ తాజా నిబంధనల ప్రకారం మూడేళ్ల పాటు ఈపీఎఫ్ ఖాతాలో సొమ్ము జమ కాకపోతే దానిని నిరర్థక ఖాతాగా పరిగణిస్తారు. అందులో ఉన్న సొమ్ముకు ఎలాంటి వడ్డీని చెల్లించరు. కాబట్టి అన్నిటికన్నా మంచి పద్ధతి పాత ఖాతాను కొత్త సంస్ధకు బదిలీ చేసుకోవడం.
ఎందుకంటే, పదవీ విరమణ తర్వాత పెద్ద మొత్తం ఆశించేవారు ఈపీఎఫ్ నుంచి సొమ్ము తీయకుండా దాన్ని బదిలీ చేసుకోవడమే ఉత్తమం. దీని వల్ల చక్రవడ్డీ ప్రయోజనాలు దూరం కావు. పైగా పన్ను పరంగా కూడా కలిసి వస్తుంది. ఖాతాను కొత్త ఉద్యోగ సంస్ధకు బదిలీ చేసుకోవడానికి కనీసం మూడు నెలలు పట్టవచ్చు. బదిలీ చేయించుకోవడానికే నిర్ణయించుకుంటే, మీ కొత్త, పాత సంస్ధల్లోని హెచ్.ఆర్ విభాగానికి ఆ విషయం చెబితే సరిపోతుంది. సంబంధిత వ్యవహారాలన్నీ వారే చూసుకుంటారు.
ఆదాయపు పన్ను విషయంలో...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ప్రణాళికలు వేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. కాబట్టి, పాత సంస్ధలో పనిచేస్తున్నప్పుడు అక్కడి ఎకౌంట్స్ విభాగానికి సమర్పించిన పన్ను ఆదా పథకాల్లో చేసిన పొదుపు, మదుపుల వివరాలు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే, కొత్త సంస్థలో చేరిన తర్వాత ఆదాయపు చెల్లించటానికి రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, వాటిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి.
పాలసీల విషయంలో...
నెలవారీ జీతంపై ప్రీమియం చెల్లిస్తూ జీవిత పాలసీలు తీసుకుంటే, బీమా సంస్ధకు లేదా బీమా సలహాదారుడిని సంప్రదించి మీరు ఉద్యోగం మారిన విషయంతోపాటు, మీ కొత్త బ్యాంకు ఖాతా వివరాలను కూడా తెలియజేసి వివరాలను మార్చించుకోండి. దానివల్ల మీ పాలసీకి చెల్లించే ప్రీమియానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇది ఒక మార్గమయితే, మరో మార్గం కూడా ఉంది. అది, పాలసీలకు ప్రీమియాలను చెల్లించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇలాంటి వాటిని మీ సొంత బ్యాంకు ఖాతాకు జత చేసుకోవడం ఉత్తమం.