Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూత్ర వ్యవస్ధలో భాగాలైన మూత్ర వాహిక, మూత్రాశయం, మూత్రనాళాలు, మూత్ర పిండాలు- ఇందులో ఏ అవయవానికి ఇన్ఫెక్షన్ వచ్చినా దానిని మూత్రవ్యవస్ధ ఇన్ఫెక్షన్గా భావించవచ్చు. పురుషుల కంటే స్త్రీలకు ఈసమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. ప్రతి ఇద్దరు స్త్రీలలో ఒకరికి, ప్రతి 10 మంది పురుషులలో ఒకరికి తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈసమస్య వస్తుంది. గర్భిణీలో ఈ ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటే తల్లికి,బిడ్డకు ఆరోగ్యకరం.
స్త్రీలకే ప్రత్యేకమైన ప్రమాద కారకాలు:
శరీర నిర్మాణ పరంగా, స్త్రీల మూత్ర ద్వారం, మల ద్వారం మధ్య, మూత్ర వాహిక, మూత్రాశయానికి మధ్య దూరం తక్కువ ఉంటుంది. బ్యాక్టీరియా తక్కువ దూరం ప్రయాణించి సులభంగా మూత్ర వ్యవస్ధలోకి ప్రవేశించడం వలన స్త్రీలు ఎక్కువ తరచుగా ఈ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారు. లైంగిక జీవితం గడుపుతున్న స్త్రీలకు, లైంగిక జీవితం గడపని స్త్రీల కంటే సులభంగా ఇన్ఫెక్షన్ సోకుతుంది.
గర్భధారణ సమయంలో మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు తరచుగా ఎందుకు వస్తాయి?
గర్భధారణ సమయంలో హార్మోన్ల ప్రభావం వలన మూత్ర వ్యవస్ధలో మార్పులు జరిగి తరచుగా మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
నెలలు గడిచేకొద్ది పెరిగే మూత్రాశయంపై గర్భాశయపు ఒత్తిడి వలన గర్భిణి మూత్రాన్ని పూర్తిగా విసర్జించలేరు. మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రంలో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుంది.
గర్భం సమయంలో ఇమ్యూన్ వ్యవస్ధ బలహీనమవడం కూడా ఒక కారణం
గర్భిణిలో ముఖ్యమైన సమస్య లక్షణాలు లేకుండా మూత్రంలో బ్యాక్టీరియా వుండడం. వెంటనే చికిత్స చెయ్యకపోతే బ్యాక్టీరియా మూత్రపిండాల్ని చేరి సమస్య తీవ్రమవుతుంది.
ఇన్ఫెక్షన్లు- ఇబ్బందులు
- నిరంతరం మూత్ర విసర్జన చెయ్యాలనిపించడం
- మూత్ర విసర్జన సమయంలో మంట
- కొద్ది కొద్దిగా, ఎక్కువ సార్లు మూత్రం పోసుకోవడం
- మూత్రం చిక్కగా ఉండడం
- మూత్రం ఎరుపుగా, ముదురు గులాబీ రంగులో లేక కోలా రంగులో ఉండడం- మూత్రంలో రక్తం పోతున్నప్పుడిలా ఉంటుంది
- మూత్రం ఘాటు వాసనతో ఉండడం
- పొత్తి కడుపు మధ్యలో, పెల్విక్ ఎముకకు పైన నెప్పి
- తీవ్రమైన అలసట, వణుకు
- చలి, జ్వరం( ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు చేరిన సూచిక)
- నడుము నెప్పి లేక నడుము దిగలాగినట్లు ఉండడం
గర్భిణికి రాగల విపరిణామాలు: మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. అప్పుడు ఈ సమస్యలు రావొచ్చు:
- నెలలు నిండకుండానే ప్రసవం
- తక్కువ బరువులో బిడ్డ పుట్టడం
ఇన్ఫెక్షను నివారించడమెలా?
రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. నీటిని సమృద్ధిగా తాగడం వలన మూత్రాన్ని పలచగా చేసి బ్యాక్టీరియాని బయటకు తోసేస్తుంది.
మూత్రాశయంలో మూత్రం మిగలకుండా పూర్తిగా మూత్రవిసర్జన చేయాలి.
జననాంగాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మూత్ర, మల విసర్జన తరువాత, స్నానం చేసేటప్పుడు జననాంగాల్ని ముందు నుండి వెనుకకు కడుక్కోవాలి. మలద్వారం దగ్గర పడిన నీరు యోని, మూత్రద్వారంలోకి చేరకూడదు.
వెనుకవైపు నుండి ముందు వైపుకు కడుక్కుంటే మలద్వారం దగ్గర ఉండే బ్యాక్టీరియా యోనిలోకి, మూత్రవాహికలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లను కలగజేస్తాయి
ప్రతిసారి లైంగిక సంపర్కం ముందు మూత్ర విసర్జన చేసి జననాంగాల్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి. లైంగిక సంపర్కం తరువాత కూడా మూత్ర విసర్జన చేసి జననాంగాల్ని ఎక్కువ నీటితో శుభ్రపరచుకోవాలి
మూత్రాశయంపై ఒత్తిడిని, పొత్తికడుపులో నెప్పిని తగ్గించడానికి గోరువెచ్చటి నీటితో పొత్తికడుపుమీద కాపడం పెట్టుకోవాలి.
ఫెమినైన్ హైజీన్ స్ప్రేలు, వెజైనల్ డూష్లు మొదలైన వాటిని వాడకూడదు. అవి జననాంగాలు కందిపోయేలా చేస్తాయి. డూష్లు ఇన్ఫెక్షన్లనుండి కాపాడే మంచి బ్యాక్టీరియాని తొలగిస్తాయి.
జననాంగాల దగ్గర పొడిగా ఉంచుకోవాలి. వదులుగా ఉన్న దుస్తుల్ని వేసుకోవాలి. బిగుతుగా ఉండే జీన్స్, బిగుతుగా ఉన్న పాంట్స్, నైలాన్ లో దుస్తుల్ని వాడకూడదు. అవి తడిని ఆరనివ్వకుండా బ్యాక్టీరియా వృద్ధి అవడానికి తగిన అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తాయి.
పరీక్షలు:
మూత్ర పరీక్ష- మూత్రంలో చీముకణాలు, రక్తకణాలు ఉన్నాయేమో పరీక్షించాలి మూత్రంలో ఏ రకపు బ్యాక్టీరియా ఉంది, ఏ ఏంటీబయాటిక్ ఆ బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది అనేది తెలుసుకోవడానికి కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్ష చెయ్యాలి.
చికిత్స:
కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్ష రిజల్ట్ రావడానికి మూడు రోజులు పడుతుంది. ఈలోపు బాధలు తగ్గడానికి, సాధారణంగా ఉండే ఇ.కోలై బ్యాక్టీరియాపై పనిచేసే మందుల్ని ప్రారంభించి రిపోర్ట్ట్్ వచ్చాక దానిని బట్టి మందును కొనసాగించవచ్చు. మూత్రవిసర్జనలో మంట, నెప్పి ఉంటే మందుల్ని వాడొచ్చు. కాని సాధారణంగా ఏంటీబయాటిక్ని మొదలుపెట్టాక రెండు, మూడు రోజుల్లోనే బాధలు తగ్గొచ్చు. కాని ఏంటీబయాటిక్ని వారం, అవసరమైతే అంతకంటే ఎక్కువ రోజులపాటు వాడాలి. ప
- డాక్టర్ ఆలూరి విజయాలక్ష్మి
గైనకాలజిస్ట్, శ్రీ శ్రీ హౌలిస్టిక్ హాస్పిటల్స్
నిజాంపేట్ రోడ్, కుకట్పల్లి,
హైదరాబాద్ -500072
సెల్ 9849022441