Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనిక ఆ ఇంటికి పెద్ద కూతురు. ఈమె తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు. తండ్రి ఇల్లు పట్టించుకోడు. ఫుల్లుగా తాగి ఇంటికొస్తాడు. లోక జ్ఞానం తెలియని తల్లి. భర్త హింసిస్తున్నా ప్రశ్నించాలని తెలియనంత అమాయకత్వం ఆమెది. ప్రస్తుతం మౌనికనే ఆ ఇంటికి పెద్ద దిక్కు. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూ ఇద్దరు చెల్లెళ్ళను చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.
సరిగ్గా ఏడాది కిందట తను పని చేసే చోటనే కృష్ణను చూసింది. తొలి చూపులోనే అతను బాగా నచ్చేశాడు. చూపు తిప్పుకోలేని అందం మౌనికది. అందుకే కృష్ణ ఆమెను కలవడానికి రోజూ అక్కడకు వచ్చేవాడు. ఓ రోజు కృష్ణ ధైర్యం చేసి మౌనికను పలకరించాడు. అతని పలకరింపు కోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే స్పందించింది. ఆ పలకరింపే వారి పరిచయానికి నాంది పలికింది. మెల్లమెల్లగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కృష్ణ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అప్పటి వరకు వయసుకు మించి కుటుంబ భారాన్ని మోసిన మౌనికకు అతని పలకరింపులో ఓదార్పు కనిపించింది. కష్టాల్లో పాలుపంచుకుంటానని ధైర్యం చెప్పాడు. అతని మాటలు పూర్తిగా నమ్మింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఆరు నెలలు ఇద్దరూ ఇలా హాయిగా గడిపారు.
ఓ రోజు మౌనిక పెండ్లి చేసుకుందామని అడిగింది. కృష్ణ విషయం ఇంట్లో చెప్పాడు. కానీ ఒప్పుకోలేదు. వేరే కులం అమ్మాయిని పెండ్లి చేసుకుంటే చచ్చిపోతానని బెదిరించారు. భయపడ్డ కృష్ణ అప్పటి నుంచి మౌనికకు ముఖం చాటేశాడు. అతన్ని కలవడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి మౌనిక చాలా ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన కృష్ణ ఆమెకు దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది. పోలీసులు కృష్ణను, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులకు భయపడి మౌనికను పెండ్లి చేసుకున్నాడు. అయితే అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులే మాట్లాడి వేరు కాపురం కూడా పెట్టించారు.
పెండ్లి తర్వాత మౌనిక ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంది. దాంతో చెల్లెళ్ళ పరిస్థితి దారుణంగా తయారయింది. తల్లి బాధ చూడలేక మౌనిక మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటే కృష్ణ ఒప్పుకోలేదు. తల్లినీ, చెల్లెళ్ళను ఆదుకోవడం కోసం ఆమె కృష్ణకు చెప్పకుండా ఉద్యోగంలో చేరిపోయింది. దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది. అసలే అవకాశం కోసం ఎదురుచూస్తున్న కృష్ణ తల్లిదండ్రులకు ఇదొక సాకుగా దొరికింది.
'ఇలాంటి పిల్ల మనకు వద్దు. దాన్ని ఎలాగైనా వదిలించుకో, నీకు మంచి సంబంధం చూసి మళ్ళీ పెండ్లి చేస్తాం' అనేవారు. అటు కన్న వాళ్లకు ఎదురు చెప్పలేక, ఇటు పెండ్లి చేసుకున్న మౌనికను వదులుకోలేక ఎవరికీ చెప్పకుండా కృష్ణ ఎటో వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన కొద్ది రోజులకే మౌనిక తల్లి కాబోతుందని తెలిసింది. ఈ విషయం కృష్ణకు చెప్పడానికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది. కానీ ఫోన్ పని చేయలేదు. చివరకు మళ్ళీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళింది. పోలీసులు కృష్ణ తండ్రిని పిలిపించి మాట్లాడితే 'ఆమెకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం, మావాడిని వదిలి వెళ్ళమనండీ' అన్నాడు.
మౌనిక మాత్రం 'నాకు డబ్బు వద్దు, నా కడుపులో బిడ్డకు తండ్రి కావాలి, నేను నా భర్తతోనే కలిసి బతుకుతా' అంది. కానీ కృష్ణ తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనిక పుట్టింటికి చేరింది. అప్పుడు ఆమె మూడు నెలల గర్భవతి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎలాగైనా కృష్ణను, తననీ కలపమంటూ పెద్ద చెల్లెల్ని తోడు తీసుకుని తెలిసిన వారు చెబితే ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది మౌనిక.
ఆమె పరిస్థితి తెలుసుకున్న లీగల్‌సెల్ సభ్యులు కృష్ణ తండ్రిని రమ్మని లెటర్ పంపారు. కానీ అతను రాలేదు. దాంతో సభ్యులు అతనికి ఫోన్ చేసి ''మీరు పొరపాటు చేస్తున్నారు. ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె తల్లికాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను చాలా కష్టపెడుతున్నారు. కేవలం ఆస్తికోసం ఇలా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ముందు వారిద్దనీ కలపండి. అప్పుడే వాళ్ళకూ, మీకూ ఇద్దరికీ మంచిది'' అన్నారు. ''మా వాడు ఆ అమ్మాయిని ప్రేమించలేదు, ఆ పిల్లే మావాడి వెంటబడింది. అసలు ఆ పిల్ల కడుపులో పెరుగుతుంది నా కొడుకు బిడ్డనే అని నమ్మకం ఏంటి'' అన్నాడు.
''నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. అనవసరంగా మౌనికపై ఇలాంటి నిందలు వేయొద్దు. ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతుకుతున్న అమ్మాయి జీవితంలోకి వచ్చింది నీ కొడుకు. పెండ్లి చేసుకుంటానని, తన కుటుంబానికి అండగా నిలబడతానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. ఇప్పుడు మీకు భయపడి ఎటో పారిపోయాడు. వాళ్ళిద్దరి పెండ్లి పోలీసుల సమక్షంలో జరిగింది. ఇప్పుడు ఆమె కోర్టుకు వెళితే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. పైగా మౌనిక ఇప్పుడు తల్లికాబోతుంది. మీ కొడుకుపై ఆమెకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఆమెకు తోడుగా మేం ఉన్నాం. అనవసరంగా గొడవలు పెంచుకోకుండా సమస్యను పరిష్కరించుకోండి'' అన్నారు.
''ఆ పిల్లతో మావాడు కాపురం చేయడం మాకు ఇష్టం లేదు. ఇక మా వాడి ఇష్టం'' అని ఫోన్ పెట్టేశాడు. కృష్ణ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తానని చెప్పి మౌనిక కూడా వెళ్ళిపోయింది.
రోజులు గడుస్తున్నా కృష్ణ రాలేదు. కనీసం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. మౌనికకు నెలలు నిండాయి. పాప పుట్టింది. కానీ అతను రాలేదు. పాపను తీసుకుని లీగల్‌సెల్‌కు వచ్చి ''మేడమ్ ఇన్ని రోజులు కృష్ణ వస్తాడనుకున్నాను. కానీ అతను రాలేదు. ఎదురు చూపులే మిగిలాయి. ఇన్ని రోజుల్లో నేను నెల తప్పానని అతని తెలియకుండా ఉండదు. తెలిసి కూడా అతను నన్ను కలవడానికి రాలేదు. అతను నన్ను మోసం చేశాడు. అలాంటి వాడిని గుడ్డిగా నమ్మాను. నేను చేసిన ఈ పొరపాటు వల్ల నా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నన్ను లెక్కచేయడం లేదు. ఇదంతా కృష్ణ వల్లనే. ఇక నేను బతడకం అనవసరం. చచ్చిపోతాను'' అంటూ ఏడ్చేసింది.
''ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కడుపున పుట్టిన నీ బిడ్డ గురించి. నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళ గురించి. నిన్ను మోసం చేసి పారిపోయిన వాడిని తలచుకుంటూ చచ్చిపోతే నీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళను నువ్వు మోసం చేస్తావా? అతను లేకపోతే నువ్వు బతకలేవా? అతను ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఏం సుఖపడ్డావు. పిచ్చి ఆలోచనలతో ప్రాణాలు తీసుకోకు. ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు ధైర్యంగా బతకాలి. ఉద్యోగం చేసుకోవాలి. నీ బిడ్డను, చెల్లెళ్ళను చూసుకోవాలి. నువ్వు లేకపోతే వాళ్ళు అన్యాయమై పోతారు. అప్పుడు నువ్వే గొడవలు ఎందుకని అతను వచ్చే వరకు ఎదురు చూస్తానన్నావు. కృష్ణ తండ్రిని పోలీస్ స్టేషన్లో పెడితే ఎక్కడున్నా వెదుక్కుంటూ వస్తాడు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే మనం ఈ పని చేయాల్సింది. ఇప్పటికైనా మించి పోయింది లేదు. నువ్వ సరే అంటే అలా చేద్దాం'' అన్నారు లీగల్ సెల్ సభ్యులు.
వారి మాటలకు కాస్త తేరుకున్న మౌనిక ''మీరు చెప్పేంది బాగానే వుంది. కానీ అప్పుడు పెండ్లి కూడా పోలీసులకు భయపడే చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ పోలీసులకు భయపడే నాతో ఉంటాడా. ఇక ఎప్పటికీ ఇలా భయపడే నాతో కాపురం చేస్తాడా? నన్ను ప్రేమించానన్నాడు. మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. అందుకే ఇక అతని కోసం ఎదురు చూడను. నా జీవితంలో అతనికి స్థానం లేదు. నా వాళ్ళ కోసం నేను బతుకుతాను. ఉద్యోగం చేసుకుంటూ నా బిడ్డను బతికించుకుంటాను. నా తల్లినీ, చెల్లెళ్ళను కూడా చూసుకుంటాను. కానీ అతను ఎప్పుడు వచ్చినా వదిలిపెట్టను. నాలా మరో ఆడపిల్ల మోస పోకుండా చూస్తా. వాడి జీవితంలోకి మరో అమ్మాయి రాకుండా చూస్తా'' అంటూ ధైర్యంగా చెప్పి వెళ్ళి పోయింది.