Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడవాళ్ళూ మగవాళ్ళతో సమానంగా ఎదిగారని పోలుస్తుంటారు, కానీ నిజానికి ఆ పోలిక ఇటునుంచి అటు చేయాలి. ఎందుకంటే, ఎన్నో విషయాలలో ఆడవారు మగవారికన్నా ఎంతో మెరుగని గట్టిగా చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు. అవేంటో తెలుసా?
ఒత్తిడిని తట్టు కునే శక్తి ఎక్కువ నిర్మాణాత్మకంగా ఆలోచించే శక్తి స్త్రీలకే ఎక్కువట. ఒక సమస్యకి చిగురుటాకులా వణికినా, కన్నీరు ఆగగానే ఆలోచనలకి పదునుపెట్టగలరు. ఆ సమస్యకి దారులు వెతకగలరు. ఒత్తిడి సమయాలలో కూడా చురుకుగా అలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. దీనివెనక వున్న సైన్సు తెలిస్తే మీరు కూడా ఒప్పుకుంటారు ఈ విషయాన్నీ. మనలో వుండే మూడు హార్మోన్లు ఆడ, మగ ఒత్తిడికి ప్రతిస్పందించే తీరుని నిర్ణయిస్తాయి. అవే కార్టిసాల్, ఎపినెఫ్రిన్, ఆక్సిటోసిన్. ఒత్తిడి కలగగానే మొదటి రెండు హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ సమయంలో మూడో హార్మోన్ మెదడు సందేశాలను గమనించి ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ హార్మోను ఆడవారిలో కన్నా మగవారిలో తక్కువ. అందుకే ఒత్తిడిని మగవారికన్నా ఆడవారు సమర్థవంతంగా ఎదుర్కోగలరని చెబుతున్నారు నిపుణులు. ఆడవారికి ప్రకతి ప్రసాదించిన మరో వరం ఈస్ట్రోజెన్ హార్మోన్. ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషించే హార్మోన్ అది. ఇలా ఎలా చూసినా ఒత్తిడిని తిప్పికొట్టటంలో ఆడవారే బెటర్.
బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్: ఇంటికి సంబంధించి ఆడవారే బెస్ట్ ఫైనాన్సు మేనేజర్స్ అంటున్నారు అధ్యయనకర్తలు. మామూలు పరిస్థితులలో పెద్దగా పట్టించుకోకపోయినా, ఒక బాధ్యతగా అప్పగిస్తే మాత్రం అద్భుతంగా ఆర్థిక నిర్వహణ చేయగలరు ఆడవారు. అందుకు చదువు, ఉద్యోగం లాంటివి కూడా అక్కరలేదట. వారి పరిధిలో వారు డబ్బును పొదుపు చేయటం, ఖర్చులు అదుపులో వుంచటం వంటివి సమర్థవంతంగా చేస్తారని చెబుతున్నారు వారు. గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసి స్టడీలో తెల్సిన కొన్ని అంశాలు ఎప్పటినుంచో ఆడవారికి ఆర్థికనిర్వహణ చేతకాదని వున్న అపవాదుని తొలగించాయి.
మల్టీటాస్కింగ్‌లో టాప్: అటు పిల్లలు, ఇటు ఇల్లు, ఇంకో పక్క ఆఫీస్, తోడు పెట్టాల్సిన పాలు, కట్టాల్సిన బిల్స్, బ్యాంకులో వేయాల్సిన చెక్, ఆఫీస్‌లో అటెండ్ అవాల్సిన మీటింగ్, ఇలా ప్రతిరోజూ ఆడవారు చేసే పనులెన్నో. మగవారు ఒకపని నుంచి ఇంకో పనికి వెళ్ళటానికి సమయం తీసుకుంటే, ఆడవారు అవే పనులని ఒకేసారి చేయగలరని ఎన్నో అధ్యయనాల్లో తెలిసింది. ఆడవారిలోని ఈ శక్తే వారిని విజేతలుగా నిల బెడుతుందని కూడా అంటున్నారు వీరు. అలాగే అమ్మ అయ్యాక ఆ శక్తి ఇంకా పెరగటాన్ని కూడా గుర్తించారు.
తెలివితేటల్లోనూ ఫస్ట్: యూనివర్సిటీ ఆఫ్ పెన్సి ల్వేనియా వారి ప్రకారం మగవారికన్నా ఆడవారి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ. ఆడవారి మెదడులోని మార్పులే అందుకు కారణం అట. ఒకప్పటి కంటే ఇప్పుడు ఆడవారి ఐక్యు లెవెల్స్ పెరిగాయా లేక ఒకప్పుడు వున్నా గుర్తించలేదా అన్న విషయం మీద పరిశోధనలు చేస్తున్నారు ఇంకా.