వాలెంటైన్స్ డే .. అద్భుతమైన మీ ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి మీకోసం ఉన్న మరో ముఖ్యమైన రోజు. ఆ రోజుని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రేమలో ఉన్నవారు.. కొత్తగా పెళ్లైన జంటలు భావించడం సహజం. అయితే దీనికోసం ప్రత్యేకంగా డబ్బు ఖర్చు చేసి టూర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. రెస్టారెంట్లకు, రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కాస్త ఓపిక చేసుకుని మీ ఇద్దరికీ ఇష్టమైన వంటకాలు చేసుకుంటే సరి.. ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదా? అయితే ఈ రెసిపీలను ఓసారి ప్రయత్నించి చూడండి.
హార్ట్ షేప్‌డ్ రెడ్ వెల్వెట్ కేక్ కావలసిన పదార్థాలు: వెన్న - అర కప్పు, చక్కెర - ఒకటిన్నర కప్పులు, గుడ్లు - రెండు, నూనె - పావు కప్పు, కొకొవా పౌడర్ - టేబుల్ స్పూన్, డస్టింగ్ కోసం కొద్దిగా, రెడ్ ఫుడ్ కలర్ - రెండున్నర టీస్పూన్లు, వెనిలా ఎస్సెన్స్ - రెండు టీస్పూన్లు, వైట్ వెనిగర్ - టేబుల్ స్పూన్లు, మైదా - రెండున్నర కప్పులు, బేకింగ్ సోడా - టీస్పూన్, ఉప్పు- కొద్దిగా, పెరుగు - పావు లీటర్, ఫ్రాస్టింగ్ కోసం క్రీమ్ ఛీజ్ - 400గ్రా., వెన్న - అర కప్పు, వెనిలా ఎస్సెన్స్ - రెండు టీస్పూన్లు, ఐసింగ్ షుగర్ - నాలుగు కప్పులు, నిమ్మరసం - టీస్పూన్ తయారీ విధానం ముందుగా ఒవెన్‌ని 350 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద ప్రిహీట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత హార్ట్ షేప్‌లో ఉన్న రెండు కేక్ టిన్స్‌కి వెన్న రుద్ది పెట్టుకోవాలి. కొకొవా పౌడర్ జల్లించుకొని ఆపై వెన్న, చక్కెర వేసి బీట్ చేసుకోవాలి. ఇందులో ఒక్కొక్కటిగా గుడ్లు వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇంకో బౌల్‌లో నూనె, కొకొవా పౌడర్, రెడ్ ఫుడ్ కలర్, వెనిలా ఎస్సెన్స్ కలుపుకోవాలి. ఆ తర్వాత మైదా, బేకింగ్ సోడా, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూడు మిశ్రమాలను కలుపుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని రెండు ప్యాన్స్‌లోకి తీసుకొని అరగంట పాటు బేక్ చేసుకోవాలి. ఒవెన్ నుంచి బయటకు తీసి చల్లార్చుకోవాలి. ఫ్రోస్టింగ్ కోసం క్రీమ్ ఛీజ్, వెన్న, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ కలుపుకోవాలి. ఇందులో ఐసింగ్ షుగర్ వేసి తెల్లగా నురగలా మారేవరకూ విప్ చేసుకోవాలి. ఇందులో నిమ్మరసం, రెడ్‌ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కేక్‌లను తీసుకొని చుట్టూ ఉన్న అంచులను కట్ చేసుకోవాలి. దీనిపై ఇందాక తయారుచేసిన విప్‌డ్ క్రీమ్ వేసి మరో లేయర్ పెట్టాలి. ఆ తర్వాత పైన కూడా ఈ క్రీమ్‌ని పూసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి సర్వ్ చేసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్ జ్యూస్ కావలసిన పదార్థాలు: కిస్ మిస్, బాదం పప్పు, జీడిపప్పు - ఒక్కోటి అర కప్పు చొప్పున, పాలు- అర లీటరు, చక్కెర - కప్పు , తేనె- 2 చెంచాలు తయారీ విధానం ముందు రోజు రాత్రి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 2 కప్పుల నీటిలో నానబెట్టాలి. ఉదయాన వాటిని మిక్సీ జ్యూస్ జార్లో వేసి బాగా తిప్పి అందులో పాలు, చక్కెర వేసి మరోమారు మిక్సీ పట్టాలి. దీన్ని గ్లాసుల్లో పోసి చెంచా తేనె, అరచెంచా నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి ఎంచక్కా ఆస్వాదించాలి.
చాక్లెట్ కేక్ కావలసిన పదార్థాలు: చిక్కని పాలు - 400 మి.లీ, బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు, వెన్న - 120 గ్రాములు, వెనీలా ఎసెన్స్ - 1 చెంచా, మైదాపిండి - 2 కప్పులు, సోడా ఉప్పు - అర చెంచా, నీళ్లు - 1 కప్పు, కోకో పౌడర్ - 50 గ్రాములు, ఉప్పు- రుచికి తగినంత తయారీ విధానం ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, కోకోపౌడర్, సోడా ఉప్పు వేసి కలిపి పక్కన బెట్టుకోవాలి. మరో గిన్నెలో కరిగించిన వెన్న, వెనీలా ఎసెన్స్, పాలు, సరిపడా నీళ్లు పోసి బాగా కలిసేలా గిలకొట్టి దీన్ని ముందు కలిపిన మైదా మిశ్రమంలో పోసి గంటె జారుడుగా కలుపుకోవాలి. అప్పుడు ఓ మోస్తరు కేక్ టిన్ తీసుకొని అడుగున కొద్దిగా పొడి మైదా చల్లి ముందు కలిపిన మిశ్రమాన్ని సమంగా పోసుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ ను 350 డిగ్రీ ఫారిన్ హీట్ వద్ద అరగంట నుంచి 40 నిమిషాలు వేడిచేయాలి. చివరగా ఓవెన్ నుంచి కేక్ ను బయటకు తీసి చల్లారనిచ్చి కేకు మొత్తాన్ని అడ్డంగా కోసి ఆ మధ్యలో చాక్లెట్ క్రీమును పొరగా వేసుకొని మిగిలిన సగాన్ని దానిపై అమర్చుకోవాలి. ఈ కేక్ ను మీ అభిరుచిని బట్టి గార్నిష్ చేసుకుంటే చాక్లెట్ కేక్ తయారైనట్టే.
గ్రిల్డ్ పనీర్ విత్ చిల్లీ ప్లమ్ సాస్ కావలసిన పదార్థాలు: పనీర్ - 200 గ్రా., ప్లమ్స్ - కేజీ, చిల్లీ ఫ్లేక్స్ - టీస్పూన్, కారం - టీస్పూన్, అల్లం పేస్ట్ - టీస్పూన్, ఆమ్‌చూర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్, నూనె - రెండు టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత, గరం మసాలా - పావు టీస్పూన్, తేనె - రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా ప్లమ్స్‌ని మిక్సీ పట్టి మిశ్రమంగా చేసుకొని అందులో కారం, చిల్లీ ఫ్లేక్స్, ఆమ్‌చూర్, అల్లం పేస్ట్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈలోపు పనీర్‌ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి వేయించుకోవాలి. ఇందులో ఉప్పు, గరం మసాలా వేసి చిక్కబడేవరకూ ఉంచాలి. ఇప్పుడు మరో పెద్ద ప్యాన్ తీసుకొని చుట్టూ ఈ మిశ్రమంలో పోసి మధ్యలో పనీర్ ముక్కలు వేసి కొద్దికొద్దిగా నూనె వేస్తూ వేయించుకోవాలి. కాస్త ఎరుపు రంగులోకి మారేవరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని మొత్తం కలిపి కాసేపు మూతపెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గ్రేవీ వదిలేసి పనీర్ మాత్రమే తీసి పక్కన పెట్టి సర్వ్ చేసుకోవాలి.
కశ్మీరీ పులావ్ కావలసిన పదార్థాలు: బాస్మతీ బియ్యం - అరకేజీ, చికెన్ లెగ్స్ - ఆరు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, యాలకులు - నాలుగు, దాల్చిన చెక్క- నాలుగు, జాపత్రి - రెండు, మిరియాలు - కొన్ని, లవంగాలు - ఐదారు, వెల్లుల్లి - ఐదారు, కిస్‌మిస్‌లు - ఐదారు, పెరుగు - కప్పు, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - కప్పు, కారం - టీస్పూన్, అల్లం - ఒక ముక్క, నూనె - కొద్దిగా, ఉప్పు - కొద్దిగా, పచ్చిమిర్చి - నాలుగైదు తయారీ విధానం ముందుగా బియ్యాన్ని కడిగి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను కట్ చేసి ఆ తర్వాత కడగాలి. పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. దీన్ని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ తీసుకుని అదులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, జాపత్రి ఇతర వస్తువులు వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇందులో పెరుగు వేసి కాస్త వేడెక్కి చివర్లు నూనె వదులుతుంటే చికెన్ ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా రెండు నిమిషాలు వేగనిచ్చి ఆ తర్వాత అందులో రెండు కప్పుల నీళ్లు పోసి కాస్త ఉడికిన తర్వాత బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.