Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నపిల్లలకు అన్నం తినిపించడం ఒక పెద్ద పని. ఇంట్లో పనులన్నీ చేసుకోవటం ఒక ఎత్తైతే పిల్లలకి అన్నం తినిపించడం ఒక ఎత్తు. ఏదో సమయానికి ఇంత తినిపించాలి కాబట్టి బలవంతంగా నోట్లో పెట్టేస్తారు చాలా మంది తల్లులు. కానీ ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు నిపుణులు. అయితే పిల్లలు ఎలాంటి ఆహారం ఇష్టంగా తింటారు? వాటి ద్వారా ఎలాంటి పోషకాలు అందుతాయి? ఆహారాన్ని ఎలా తినిపించాలో తెలుసుకోవాలి. పిల్లల వయస్సుకు తగినట్లుగా వారి శారీరక ఎదుగుదల ఉండాలంటే వారు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. సన్నగా ఉన్నారనో, సరిగ్గా తినడం లేదనో, వారికి ఆకలి లేకపోయినా ఆహారాన్ని అధికంగా తినిపించాలనుకోవడం పెద్దలు చేసే పొరపాటు.
చాలామంది పిల్లలు ఆహారం తినడానికి పేచీ పెడుతుంటారు. ఆహారం నోట్లో పెట్టటానికి నోరు తెరవకపోవడం, నోట్లో పెడుతుంటే తల పక్కకు తిప్పేయడం లాంటివి చేస్తుంటారు. అలా చేస్తున్నారని పిల్లలకు బలవంతాన ఆహారం తినిపించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే, వారు ఆహారం పట్ల విముఖతను పెంచుకుంటారు. దీని వలన ఇతర ఆహార సమస్యలు రావొచ్చు.
భోజనానికి ఒక సమయాన్ని నిర్ణయించండి. ప్రతిరోజు ఒకే సమయానికి తినడం వలన పిల్లలకు ఆహారంపై ధ్యాస ఉంటుంది. అలాగే పిల్లలు తినడానికి వారికి కావల్సినంత సమయాన్ని ఇవ్వండి. వారిని తొందరపెట్టడం వలన తిండిపై ఆసక్తి కోల్పోవచ్చు. కొంత సమయం విరామంతో కొత్త ఆహార పదార్థాలు, పండ్లను తినడానికి ఇవ్వండి. మీ పిల్లలకు కొత్త వాటిని ప్రయత్నించడానికి కొంత సమయం అవసరమవుతుంది.
ఎప్పుడూ పెట్టే అన్నం, కూరలు, టిఫిన్లు పెడితే పిల్లలకు విసుగొస్తుంది. రకరకాల వంటకాలను మార్చిమార్చి చేస్తూ, పెడుతూ ఉండాలి. ఒకసారి ఒకరకం చొప్పున కొత్త వాటిని పరిచయం చేయండి. ఒకేసారి అనేక కొత్త ఆహార పదార్థాలను రుచి చూపవద్దు. వారి కోసం కొత్త ఆకతుల్లో, ఆకర్షణీయమైన రంగులతో ఆహారాన్ని సిద్ధం చేయండి. పిల్లలకంటూ ఇష్టమయిన పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటితో రకరకాలయిన ఆహార పదార్థాలు చేసి పెడితే, ఆ రుచి వారికి నచ్చి ఆహారాన్ని ఇష్టంగా తింటారు.
పిల్లలకు పండ్లు, పండ్ల ముక్కలు తినడం బాల్యం నుంచే అలవాటు చేయాలి. ఆహార పదార్థాల మీద జీడిపప్పు, బాదం ముక్కలు, వేరుశనగ పప్పులు వంటి రుచికరమైన పదార్థాలను చేర్చితే ఆ పదార్థాన్ని వారు ఇష్టంగా తింటారు. అంతేకాకుండా వాటి ద్వారా పిల్లలకు మంచి పోషకాలు అందే అవకాశం ఉంటుంది.
అన్నం తినేముందు పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్స్ లాంటి తీపి పదార్థాలు, చిరుతిళ్ళు ఇవ్వకూడదు. అవి తినడం వల్ల ఆకలి మందగించి, వారు ఆహారం తినలేరు. పిల్లలకు రోజుకు మూడుసార్లు ఆహారాన్ని తినిపించాలి. అన్నం తినలేదని చిరుతిళ్ళు తినిపించకూడదు. ఒకసారి తినకపోయినా, మరోసారయినా తప్పకుండా తింటారు. పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు తినిపించాలి. పిల్లలకు తినిపించే ఆహార పదార్థాల్లో పోషక విలువలు పుష్కలంగా లభించాలి.
పిల్లలకు మూడేళ్ళు వచ్చేసరికి వారంతట వారే ఆహారం తినే అలవాటు చేయాలి. తల్లి పిల్లల ఆకలిని తెలుసుసుకోగలగాలి. పిల్లలు సులభంగా అందుకునే విధంగా పండ్లు, ఆరోగ్యకరమైన గింజలను అందుబాటులో ఉంచాలి. పిల్లలు ఆకలి లేదంటున్నప్పుడు తమ పని అయిపోవాలని బలవంతాన తినిపించ కూడదు. ఆకలిగా ఉన్నప్పుడు వారే పెచీ పెట్టకుండా తింటారు. ఆహారం తినిపించేటప్పుడు తల్లి నేర్పుగా, ఓర్పుగా కబుర్లు చెప్తుండాలి. వారు ఆ మాటలు వింటూ అన్నం తినేస్తారు.
పిల్లలకు అందరితో కలిపి అన్నం పెట్టాలి. తోటివారు, పెద్దలు ఏవిధంగా తింటున్నదీ పరిశీలిస్తూ అదేవిధంగా తింటారు. పెద్దల ఆహారపు అలవాట్లే పిల్లలకూ వస్తాయి. అదీకాక పిల్లలు ఎప్పుడూ పెద్దలనే అనుసరిస్తారు కాబట్టి అందరి మధ్య ఉన్నపుడు వాళ్ళు తినే ఆహారాన్ని తినటానికి ఇష్టపడతారు. దీనితో స్వయంగా వాళ్ళే మంచి పోషకాలున్న ఆహారాన్ని తినగలుగుతారు.
ఎల్లప్పుడూ తక్కువ మోతాదుల్లో ఆహారాన్ని ఇవ్వండి. వారు వారి భోజనాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రశంసించండి. తినడానికి ఎలాంటి అంశాలను ఆశ చూపవద్దు. ఇది మంచి పని కాదు. పిల్లలకు ఇష్టం లేని పదార్థాలను తినమని ఒత్తిడి చేయకూడదు. స్వల్పంగా ఆ పదార్థాలు చూపిస్తూ, క్రమక్రమంగా వారు ఆ పదార్థాలను తినే అలవాటు చేయాలి.
ఇది సహించదనీ, అది వద్దనీ చాలా పదార్థాలను పిల్లలు తినడానికి ఇష్టపడరు. అయితే అన్ని రకాల ఆహార పదార్థాలను తినకపోతే కలిగే నష్టమేంటో వివరించి చెప్పాలి. వాటిని తింటే ఎంతో బలమొస్తుందనీ, ఆరోగ్యంగా ఉంటారనీ, వారి మనస్సును దష్టిలో పెట్టుకుని బోధించాలి. వారికి నచ్చచెప్తూ తినిపించాలే కానీ బలవంత పెట్టకూడదు.