Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొలకలు (స్ప్రౌట్స్) తింటే మంచిది అంటారు. కానీ రోజూ అలాగే... పచ్చిగానే... చప్పిడిగానే అంటే... కొంచెం బోర్. అందుకు కాస్త మనసు పెడితే చాలు. మొలకలతోనూ పలు రకాల పదార్థాలు చేేసుకోవచ్చు. వాటిల్లో కొంచెం టమాటో తరుగు, కాసింత వెల్లుల్లి ముద్ద, జీలకర్ర, నిమ్మరసం...అన్నింటినీ జత చేస్తే... 'ఆహా ఏమి రుచి' అని అనాల్సిందే... ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు... వీటిల్లో లభ్యమయ్యే క్యాలరీల వల్ల బరువు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది. పైగా ఎన్నో పోషకాలు కూడా అందుతాయి.
మొలకల పులావ్
కావలసినవి: మాత్ బీన్స్: 1/2 కప్పు (మొలకెత్తినవి), ముడి పెసళ్ళు1/2 కప్పు (ఉడికించినవి), బ్రౌన్ రైస్: రెండు కప్పులు (అన్నం వండుకోవాలి), క్యాప్సికమ్:1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి) ఫ్రెంచ్ బీన్స్: 4, టమాటలు: 2, ఉల్లిపాయ:1, అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీస్పూన్, పసుపు: ఒక టీస్పూన్, జీలకర్ర పొడి: ఒక టీ స్పూన్, కారం: 1/2 టీస్పూన్, ధనియాలపొడి:1/2 టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాలు వేగించుకోవాలి. ఇప్పుడు అందులోనే.. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్, ఉప్పు వేసి వేగించాలి. తర్వాత టమాటలు, పసుపు, జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం వేసి మీడియం మంట మీద వేగిస్తూ, ఉడికించుకోవాలి. టమాట మెత్తబడ్డాక అందులో మొలకలు, ముడి పెసలు వేసి బాగా మిక్స్ చేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న బ్రౌన్ రైస్ అన్నాన్ని కూడా వేసి మిక్స్ చేయాలి. టేస్ట్‌కు సరిపడా ఉప్పు చేర్చాలి. తిరిగా బాగా మిక్స్ చేసి సర్వ్ చేయాలి.
దోశ
కావలసినవి:
మొలకలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, నూనె
తయారీ విధానం
ముందుగా మొలకలు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు చేర్చుకోవాలి. ఈ మిశ్రమం లూజ్‌గా ఉంటే.. అందులో కాస్త బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. ఆపైన పెనంపై దోశల్లా పోసుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని టొమాటో సాస్‌తో తింటే బాగుంటుంది.
టిక్కీ
కావలసినవి:
మెత్తగా ఉడికించిన మొలకలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి, కారం
తయారీ విధానం
ముందుగా మెత్తగా ఉడికించిన మొలకలను బాగా మెదుపుకోవాలి. లేదంటే కచ్చాపచ్చాగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఆ తర్వాత.. అందులో సన్నగా తురిమిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా శనగపిండి కూడా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల టిక్కీ నిలిచి ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గుండ్రని ఉండల్లా చేసుకొని కొద్దిగా వత్తాలి. ఇలా చేయడం వల్ల టిక్కీలు తయారవుతాయి. వీటిని పెనంపై ఉంచి కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకోవాలి. తక్కువ మంటపై ఉంచి కాల్చి.. బంగారు రంగు వచ్చేవరకూ అలాగే ఉంచాలి.
భేల్
కావలసినవి:
మొలకెత్తిన గింజలు, ఉడికించిన బంగాళాదుంపలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు, సోర్ సాస్, సేవ్
తయారీ విధానం
ముందుగా ఉడికించిన.. మొలకెత్తిన గింజలు తీసుకొని.. అందులో బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయలు, టొమాటోలు వేసుకోవాలి. దానిపైన సేవ్ వేసుకోవాలి. కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. కావాలంటే బొరుగులు కూడా కలుపుకోవచ్చు. కావాలంటే మీకు నచ్చిన కూరగాయలు, పాప్ డీ వంటివి కూడా చేర్చుకోవచ్చు.
పెసలతో సలాడ్
కావలసినవి:
మొలకెత్తిన పెసలు: ఒకటిన్నర కప్పు, టొమాటో తరుగు: కప్పు, కీరా తరుగు: కప్పు, కొత్తిమీర తరుగు: టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ / పచ్చిమిర్చి తరుగు: తగినంత
సలాడ్ డ్రెస్సింగ్ కోసం: మిరియాల పొడి: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, జీలకర్ర: టీ స్పూన్, నిమ్మరసం: టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్: టేబుల్ స్పూన్, పంచదార లేదా బెల్లం: టీ స్పూన్
తయారీ విధానం
సలాడ్ డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. గిన్నెలో పావు కప్పు కన్నా తక్కువ నీళ్లు పోసి, ఉప్పు కలిపి మరిగించాలి. అందులో మొలకెత్తిన గింజలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత గింజలను చల్లారనివ్వాలి. సలాడ్ డ్రెస్సింగ్ కోసం కలిపిన మిశ్రమాన్ని, చల్లారిన గింజలపై వేసి కలపాలి. సర్వ్ చేసే గిన్నెలో టొమాటో, కీరా తరుగు, ఆ పైన స్ప్రౌట్స్ ఉంచి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుతో గార్నిష్ చేయాలి.