Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా మహిళలు నానా హైరాపడిపోతారు. వారికి అన్ని రకాల సపర్యలు చేస్తారు. తిరిగి వారు కోలుకునే వరకు నిద్రాహారాలు మాని సేవలు చేస్తారు. రెప్ప వాల్చకుండా కాపాడుకుంటారు. ఆ రోజుల్లో కంటిపై కునికే మర్చిపోతారు. ఇలా తమ వారి కోసం అన్నీ చేస్తూ తమ గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు. తలనొప్పో, నడుము నొప్పో వస్తే ఏ జండూబోమో, మెడికల్ షాపులో దొరికే మందు బిళ్ళో వేసుకుని మళ్ళీ పనుల్లో మునిగిపోతారు.
సమస్య ఎంత కాలం వున్నా ఆస్పత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుందామనే ధ్వాసే వుండదు. ఇంట్లో వారు కూడా ఆమె ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఎవరు మీ గురించి పట్టించుకోపోయినా మీరు మాత్రం మీ గురించి పట్టించుకోని తీరాల్సిందే. అలాగే కుటుంబం కూడా ఆమె ఆరోగ్యం విషయంలో బాధ్యత తీసుకోవాలి. తనెందుకు నీరసంగా కనిపిస్తుంది అనే స్పృహ భర్తకు వుండాలి. అమ్మ ఎందుకు డల్‌గా కనిపిస్తుంది అని పిల్లలు ఆలోచించాలి.
ప్రాణాలను లెక్కచేయకుండా
ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. మన దేశంలో కూడా దాని ప్రభావం కాస్త తీవ్రంగానే ఉంది. రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే మరింత జాగ్రత్తగా వుండాలని అధికారులు చెబుతున్నారు. ఎవ్వరినీ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఇండ్లలో పని చేసేవారు, పారిశుద్ధ కార్మికులు, ఆస్పత్రుల్లో రోగులకు సేవలు చేసే నర్సుల్లో ఎక్కువమంది మహిళలే. వారికి పరిశుభ్రతపై సరైన అవగాహన లేదు. తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఆర్థిక స్థోమత కూడా లేదు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు, నర్సులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఆ మహిళలకు ప్రభుత్వం నుండి అందాల్సిన నాణ్యమైన మాస్కులు, రక్షణ దుస్తులు అందుతున్నాయా లేదా అనేది పెద్ద ప్రశ్న.
ఆమెకు తప్పదు
ఇంట్లో భర్తకూ, పిల్లలకు తప్పినా కొన్ని పనులు చేసుకోవడం మహిళలకు మాత్రం తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ కుటుంబానికి మీరు మిగలరని మహిళలు గుర్తుపెట్టుకోవాలి. నిత్యవసర వస్తులు తెచ్చుకునేందుకు కుటుంబానికి ఒకరికి అనుమతి ఇచ్చారు. ఆ పని కచ్చితంగా మహిళపైనే పడుతుంది. కాబట్టి మహిళలూ.. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కచ్చితంగా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మ, నారింజ, బొప్పాయి, టమాటా వంటి ఆహార పదార్థాలను తీసుకోండి. ఎప్పుడూ మీ కుటుంబం గురించే ఆలోచించే మీరు... ఇప్పుడైనా కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోండి. మీ ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వస్తే గతంలో మాదిరిగా కంగారు పడి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సపర్యలు చేయకండి. నా వాళ్ళే కదా ఏమీ కాదులే అని అశ్రద్ద చేశారా ఆ వైరస్ మిమ్మల్ని కూడా వదలదు. మీకే అలాంటి లక్షణాలు కనిపిస్తే భయపడకుండా వెంటనే పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.