Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాసు స్నేహితులతో కలిసి పేకాడుతూ, మందు తాగుతూ డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నాడు. వీటి కోసమే సుమారు పది లక్షల వరకు అప్పులు చేశాడు. భర్త ఎప్పటికైనా మారతాడనుకున్న రాధకి ఇక అతనిపై నమ్మకం పోయింది. అత్తామామలకు చెబితే వాళ్ళూ అస్సలు పట్టించుకోరు. పైగా 'నీ వల్లనే నా కొడుకు ఇలా తయారయ్యాడు'' అంటది అత్త. ఇక ఇంట్లో ఎప్పుడూ గొడవలే. వాసూ తాగొచ్చి రాధని కొడతాడు. ఆమె కోపంతో అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా తన భర్తను మార్చుకోవాలని రాధ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి తన కష్టాన్ని చెప్పుకుంది. సభ్యులు వాసుకు లెటర్ పంపారు. తర్వాతి వారం వాసు, రాధను తీసుకుని లీగల్‌సెల్‌కు వచ్చి... ''మేడమ్, రాధ నన్ను చీటికి మాటికి తిడుతుంది. పిల్లల ముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఓ భర్తగా నన్ను అస్సలు గౌరవించదు. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే... వాళ్ళను మంచిగా చూసుకోదు. మా అమ్మతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకే నేను కొడతాను. పైగా నన్ను తాగుబోతు అంటుంది. నేను రోజూ తాగాను. ఎప్పుడైనా స్నేహితులతో కలిసి తాగుతాను. పగలంతా కంపెనీ మొత్తం ఊడ్చి, పనులన్నీ చేసుకుని సాయంత్రం పూట బయట పనికి వెళతాను. ఈమె పెట్టే టెన్షన్స్‌తో ఈ మధ్య ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నా. సగం ఈమె వల్లనే నాకు ప్రశాంతత లేకుండా పోయింది. అందుకే తాగుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.
''ఏమీ లేకపోతే నీ భార్య నిన్ను ఎందుకు అనుమానిస్తుంది. కంపెనీలో పని చేస్తున్నావు. అక్కడ ఎంతో మంది ఉద్యోగులు వుంటారు. నీ ప్రవర్తన ఇంత దారుణంగా ఉంటే ఎలా. పదేండ్ల నుంచి రాధ నువ్వు మారతావని ఎదురు చూస్తుంది. ఆ ఆశతోనే నీపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టకుండా మౌనంగా ఉంటుంది. కానీ మేము అలాకాదు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే నువ్వు పని చేసే కంపెనీ వాళ్ళకు నీ గురించి కంప్లెయింట్ ఇస్తాం. పోలీస్‌స్టేషన్‌లో కేసుపెడతాం. అప్పుడు ఉన్న పని ఊడిపోతుంది' అని సభ్యులు హెచ్చరించారు.
దాంతో ''మేడమ్ అంత పని చేయొద్దు. ప్రస్తుతం నా కుటుంబానికి ఇదే ఆధారం. ఈ మధ్యనే జీతం కూడా పెంచుతామని చెప్పారు. ఇప్పుడు మీరు ఇలా చేస్తే నా పని పోతుంది. మీరు ఎలా చెబితే ఆలా చేస్తా. అయితే రాధ నేను చెప్పినట్టు నడుచుకోవాలి. తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను'' అంటూ బతిమలాడుకున్నాడు.
''రాధ నన్ను బూతులు తిడుతుంది. ఇకపై తిట్టకూడదు. పిల్లల ముందు నన్ను ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అలాగే మా అమ్మానాన్న ఎప్పుడో ఒక్కసారి మా ఇంటికి వస్తారు. వాళ్ళను మంచిగా చూసుకోవాలి. ఇవి చేస్తే చాలు. నేను రాధతో మంచిగా ఉంటాను. నాకు వచ్చే ఆదాయం మొత్తం ఆమె చేతికే ఇస్తాను. తను కూడా ఇంట్లో ఖాళీగా ఏమీ వుండదు. ఎప్పుడూ మిషిన్ కుడుతూనే వుంటుంది. డబ్బులను చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తుంది' అన్నాడు.
అప్పుడు రాధ ''మేడమ్ అయితే నాకూ కొన్ని కండీషన్స్ వున్నాయి. ఆయన కూడా అలా నడుచుకుంటూ తను చెప్పినట్టు వుండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ''ఆయన స్నేహితులతో తిరగడం, తాగడం, పేకాడడం మానుకోవాలి. పిల్లలతో ప్రేమగా వుండాలి. వీటికి ఆయన ఒప్పుకుంటే నేనూ ఆయన చెప్పినట్టు చేస్తా'' అంది.
''భార్యా భర్తలన్న తర్వాత ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవాలి. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని బాధ్యతగా నడుపుకోవాలి. అప్పుడే ఆ సంసారం హాయిగా, ప్రశాంతంగా వుంటుంది. డబ్బు పిచ్చితో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. సంపాదించిన డబ్బు మొత్తం తాగుడుకు, పేకాటకు పెడుతున్నావు. దీని వల్ల ఉపయోగం ఏముంది. నీ కుటుంబంతో ఏమైనా సంతోషంగా వుంటున్నావా? అలాంటప్పుడు నీ సంపాదన ఎందుకు. ఆలోచించుకొని ఇకనైనా భార్యా, పిల్లలతో మంచిగా వుండు. పిల్లల కోసం రాధ ఎంత కష్టపడుతుందో నువ్వు చూస్తూనే వున్నావు. అనవసరంగా లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నావు'' అన్నారు లీగల్‌సెల్ సభ్యులు వాసుతో.
అంతా విన్న వాసు భార్య చెప్పినట్టు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాసి ఇచ్చాడు. ఇద్దరూ ఒకరి కండీషన్స్‌కు ఒకరు ఒప్పుకున్నారు. ఇకపై ఒకరితో ఒకరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా లీగల్‌సెల్‌కు వస్తామన్నారు. వాసు మాత్రం తన ప్రవర్తన మార్చుకోకపోతే లీగల్‌సెల్ సభ్యులు అతను పని చేస్తున్న చోట కంప్లెయింట్ ఇస్తామని గట్టిగా చెప్పి పంపించారు.
మళ్ళీ వారం తర్వాత రాధ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ''మేడమ్ ప్రస్తుతం మా ఆయన కొద్దిగా మారాడు. గతంలో మాదిరిగా ఫోన్లో మాట్లాడడం లేదు. ఇంట్లో కూడా కాస్త బాధ్యతగానే వుంటున్నాడు. సరుకులు ఏమైనా కావలంటే అడిగి మరీ తెచ్చిస్తున్నాడు. కానీ ఒకటే బాధ. స్నేహితులను మాత్రం కలుస్తూనే ఉన్నాడు'' అని చెప్పింది.
''అతనే మారతాడు. మెల్లమెల్లగా అన్నీ అతనే తెలుసుకుంటాడు. మేము కూడా వారం వారం అతనికి ఫోన్ చేస్తుంటాం. అతను పని చేసే దగ్గరకు ఓసారి వెళ్ళి వస్తాం. అప్పుడే అతనికి భయం వుంటుంది'' అని రాధకు ధైర్యం చెప్పి పంపించారు.
అన్న ప్రకారమే లీగల్‌సెల్ సభ్యులు వాసు పని చేసే చోటకు వెళ్ళారు. దాంతో లీగల్‌సెల్ సభ్యులు అనుకున్నంత పనిచేస్తారని వాసూకి భయం పట్టుకుంది. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఉంటు న్నాడు. రాధతో మంచిగా నడుచుకుంటున్నారు.
-సలీమా