Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమకు ఆత్మవిశ్వాసం తక్కువని.. ఎందులోనూ రాణించలేక పోతున్నామని చాలామంది మహిళలు భావిస్తుంటారు, కానీ.. ఏం చేస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపవు తుందనేది అందరూ తెలుసుకోలేకపోతున్నారు. మహిళలు తమ సామర్థ్యాలకు పదును పెట్టుకుంటూ విలువలను, ఆత్మగౌరవాన్ని కాపాడు కున్నప్పుడే నలుగురిలో తమ స్వరం వినిపిస్తుంది, నాయకత్వం దక్కుతుంది. మనలోని ప్రతికూల భావనలను తొలగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిం చేందుకు న్యూరోసైన్స్ ఉపయోగ పడుతుంది. మెదడులోని కీలక ప్రాంతాలను మనకు కావాల్సిన పనిలో నిమగం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇందుకు కొంత అధ్యయనం అవసరం. స్టేసీ గ్రాస్మన్ బ్లూమ్ న్యూయార్క్ విశ్వ విద్యాలయానికి చెందిన లేంగ్ఆన్ మెడికల్ సెంటర్లో ఓ న్యూరోసైంటిస్ట్. ఈమె ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో న్యూరోసైన్స్ పాత్రేమిటన్న విషయంపై అధ్యయనం చేశారు. చాలామంది మహిళలకు అవసరమైన ఈ అంశంపై ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.
ఆత్మవిశ్వాసం కూడా మిగతా అన్ని వ్యక్తిత్వ స్వభావాల వంటిదే. ఇది మెదడుకు సంబంధించిన అంశం. మన మెదడులో అత్యధిక భాగం పుట్టుకతో కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. జన్యుపరమైన, ఇతర కారణాల వల్ల ముందే అవన్నీ నిర్ణయమైపోతాయి. ఆ తరువాత జీవితంలో మన అనుభవాలు, చేసే పనులు, ఎంచుకునే మార్గాలు వ్యక్తిత్వానికి ఒక రూపునిస్తాయి.
నిమగం చేయడం ద్వారా
మెదడులోని కణాలు, నాడీవ్యవస్థ మధ్య ఉండే క్లిష్టమైన, సున్నితమైన సంబంధాలను మనకు అనుగుణంగా మలచుకుంటూ సామర్థ్యాలను, జ్ఞానాన్ని పెంచుకుంటుంటాం. ఇదంతా సాధనతోనే జరుగుతుంది. మనలోని ప్రతికూల భావనలను తొలగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు న్యూరోసైన్స్ కూడా ఉపయోగపడుతుంది. మెదడులోని కీలక ప్రాంతాలను మనకు కావాల్సిన పనిలో నిమగం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.
సానుకూల స్పందన
మన గురించి మనం సానుకూలంగా ఆలోచించినప్పడు ప్రేరణ, సంతోషం కలిగించే మెదడు భాగాలను ఉద్దీపన చేయొచ్చు. మనం ఆత్మవిశ్వాసంతో ఉన్న సందర్భాల్లో, తలెత్తుకుని తిరిగేటప్పుడు మనసు మంచి అనుభూతిని పొందుతుంది. ప్రతి ఒక్కరికీ ఇది ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే విషయమే. అదే ఉద్దీపన ప్రభావం. అలాంటి అనుభూతికి లోనైనప్పుడు మనలో కనిపించే ఆత్మవిశ్వాసం చుట్టూ ఉన్నవారిని ఆకర్షిస్తుంది. వారు మీతో సులభంగా కలిసిపోవడానికి ఇది తోడ్పడుతుంది. మీలోని ఆత్మవిశ్వాసానికి ప్రతిఫలంగా చుట్టూ ఉన్నవారి నుంచి వచ్చే ఈ సానుకూల స్పందన మెదడుకు చేరి మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది.
అవాంతరాలను అధిగమించండి
ఆత్మవిశ్వాసం పెంచుకునే క్రమంలో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని నిత్యం మీ మెదడును తొలిచేసే సమస్యలను, అవాంతరాలను అధిగమించేందుకు సిద్ధమవడమే. అక్కడి నుంచే మీ ఆత్మవిశ్వాసం పెరగడం మొదలవుతుంది.
అలాగే కొత్త విషయాలను నేర్చుకోండి. అయితే నైపుణ్యాలను నేర్చుకోవడం ఒక్క రోజులో సాధ్యం కాదు. అందుకు సమయం పడుతుంది. ఇలా నేర్చుకుంటున్నంత కాలం మెదడు మన కొత్త నైపుణ్యాలను, కొత్త జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకోవడానికి తనలోతాను సర్దుబాటు చేసుకుంటుంది.
శాస్త్రీయ కోణంలో చూస్తే
ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అంతే. పెంచుకోవాలని మనం నిర్ణయించుకోవడమే తరువాయి, ఆ దిశగా మెదడుకు శిక్షణ ఇవ్వాలి. మన దారికి తెచ్చుకోవాలి. శాస్త్రీయ కోణంలో చూస్తే.. మగవాళ్లతో పోల్చుకుంటే మహిళల్లో హార్మోన్ల విడుదల భిన్నంగా ఉంటుంది. సాధారణంగా సంఘర్షణలకు తావివ్వని, ఇతరులను సంతోషపెట్టాలనుకునే, అందరి ఆమోదం ఉండాలనుకునే మనస్తత్వం మహిళలది. ఒత్తిడికి లోనయ్యే సందర్భాల్లోనూ వారి స్పందన మగవారి కంటే భిన్నంగా ఉంటుంది. మగవారు రిస్క్ తీసుకోవడానికి సాహసిస్తారు. అందుకు భిన్నంగా మహిళలు, చేపట్టే పని కచ్చితంగా విజయవంతం కావాలని కోరుకుంటారు. జన్యుపరమైన తేడాలే కాకుండా సామాజికంగా సష్టించుకున్న తేడాలూ మహిళలపై ప్రభావం చూపుతున్నాయి.
అవరోధాలు
పిల్లల వయసు పెరుగుతున్నకొద్దీ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ యువతులు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ, మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో చురుగ్గా ఉంటే లేనిపోని విమర్శలు ఎదురవుతుంటాయి. సమాజం నుంచి ఎదురయ్యే ఇలాంటివన్నీ వారిలోని ఆత్మవిశ్వాసానికి అవరోధాలవుతున్నాయి.
అనుకూలంగా మార్చుకోవాలి
ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలను ఎంత ముమ్మరం చేస్తే అంత తొందరగా ఫలితం కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం చేయాల్సిన పనులు కొన్నుంటాయి. మనకు అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉంటాం. కాబట్టి మొదట పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తులకు, పరిస్థితులకు వీలైనంత దూరంగా ఉండాలి.
ఊహించుకోవడం వల్ల
కొన్ని ఊహలతోనూ మన మెదడుకు ప్రేరణ కలిగించవచ్చు. ఒక రేసులో గెలిచినట్లు, పబ్లిక్ మీటింగులో మాట్లాడినప్పుడు జనం నిలబడి ఆపకుండా చప్పట్లు కొట్టినట్లు, చేసే పనిలో మీకు తిరుగేలేనట్లు.. ఇలా చాలాచాలా సాధించినట్లు ఊహించుకోవడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏదైనా చేయగలమని మనకు మనం ధైర్యం చెప్పుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఇలాంటి ఎక్సర్సైజ్ల వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడి, కుంగుబాటు, నిస్తేజం వంటివన్నీ తగ్గుతాయి. ఇది మానసికంగా, శారీరకంగా మనం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.