Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్ల వెంట తిరుగుతూ ఎవరు మాస్క్ లేకుండా బయటికి వస్తారా మింగేద్దాం అని కరోనా మహమ్మారి కాచుక్కూచుంది. ఒక వైపు రోహిణీ కార్తె ఎండలు మండిపోతున్నాయి. రోహిణి ఎండలకు రోళ్ళు పగుల్తాయి అంటారు కదా! కేవలం ఒక ప్రోటీన్ పోగు అయినటువంటి కరోనా ఎంత? ఎండలకు అంగలార్చుతూ వీధి వీధి తిరుగుతూ కాటువేయడానికి ప్రయత్నిస్తుంది. మరి మనమేమైనా తెలివితక్కువ వాళ్ళమా! ఇంత పెద్ద అభివృద్ధి చెందిన మెదడును పెట్టుకుని కరోనాకి ఆహారమవుతాయా! చక్కగా లాక్డౌన్ సమయమంతా ఇంట్లోనే కూర్చుని రకరకాల ఆటలు ఆడుకుంటూ, పిల్లల్ని ఆడిస్తూ కాలక్షేపం చేసేస్తాం. పైగా పూర్వకాలంలోని ఆటలన్నింటిని ఇప్పటి పిల్లలకు నేర్పించవచ్చు. పిల్లలకూ సరదాగా ఉంటుంది. తల్లులకూ తమ బాల్యం గుర్తొస్తుంది.
జానపద సాహిత్యాన్ని గమనిస్తే తెలుగునాట ఎక్కువగా ఆడపిల్లల ఆటలే కనిపిస్తాయి. మగపిల్లలకు చాలా తక్కువ రకాల ఆటలు ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఆడపిల్లలను కేవలం ఇంటికే పరిమితం చేసే వారు కాబట్టి బహుశా ఇలా జరిగివుంటుంది. సరే ఇక ఆటల్లోకి వచ్చేద్దాం...
పాము పటం
దీనినే 'వైకుఠపాళీ' అనీ 'పరమపద పోపాన పటం' అనీ అంటారు. దీనిలో పాములు, నిచ్చెనలు ఉంటాయి. నలుగురైదుగురైనా ఆడుకోవచ్చు. ఎవరి కాయలు వాళ్ళు పెట్టుకొని గవ్వలు వేస్తూ, కాయలు కదుపుతూ ఉండాలి. దారిలో సంతోషంగా ఎక్కి పైకి పోవడానికి నిచ్చెనలు ఉంటాయి. అదే దారిలో పామునోట పడి చచ్చి మళ్ళీ మొదలుకు రావటమూ ఉంటుంది. ఎవరు మొదటగా పరమపదసోపానాన్ని చేరితే వారు పండినట్లు. జీవితంలోని ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, సుఖ సంతోషాన్ని తెలియజేసేందుకే ఈ ఆటను రూపొందించి ఉంటారు. నిచ్చెన ఎక్కినపుడు సంతోషపడి పాము నోట్లో పడగానే డీలాపడిపోతే జీవితం దెబ్బతింటుందని చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశమనుకుంటాను. ఈ ఆటను ఎంతసేపు ఆడినా విసుగురాదు. ఇప్పటి పిల్లలకు తెలియని ఆట. కచ్చితంగా పిల్లలకు పరిచయం చేయాల్సిందే.
తొక్కుడు బిళ్ళ
తొక్కుడు బిళ్ళ ఆడని తెలుగు ఆడపిల్ల ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంటి బయట నేలమీద గీతలు గీసుకొని, అవి కనిపించటానికి ఆ గీతల్లో ముగ్గు పోస్తారు. ఇది ఒకరు ఆడేటపుడు మరొకరు ఆడటానికి ఉండదు. ఒకరి తర్వాత ఒకరు ఆడుతుండాలి. కుండపెంకును ఆ గడుల్లో విసిరేసి కుంటుతూ వెళ్ళాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని గెంతుతూ గీత మీద కాలు వేయకుండా ''రైటా, రాంగా'' అని అడుగుతూ ఆడుతుంటారు. తర్వాత ఆ పెంకును కాలి వేళ్ళ మధ్య ఇరికించుకొని అది కిందపడకుండా దూకుతూ గీతలు తొక్కుకుండా వెళ్ళాలి.
కుంటాట
ఇది చాలా అద్భుతమైన ఆట. మేము పదోతరగతికి వచ్చేదాకా ఆడుకున్నాము. ఇది శారీరక దారుఢ్యాన్ని పెంచే ఆట. ఒక్కకాలు మాత్రమే నేల మీద ఆన్చి, మరో కాలును పైకి మడత పెట్టుకొని గెంతుతూ వెళ్ళాలి. మిగతా వాళ్ళంతా పరిగెడుతూ ఉంటారు. ఒక కాలితో కుంటుతూ వాళ్ళను అంటుకోవాలి. అంటుకున్న వాళ్ళు అవుట్ అయినట్లు. అలా పదిమందినీ అవుట్ చేస్తే గెలిచినట్లు. మొదట అవుట్ అయినవాళ్ళు మరల కుంటుకుంటూ రావాలి. దీంట్లో కాళ్ళు జరా పటడం, అంటుకోబోయేటప్పుడు ఎదుటి వారు సడన్గా కిందికి వంగడంతో బ్యాలెన్స్ తప్పి పడిపోవటం జరుగుతుంది. మాస్కూల్లో ఎక్కువ మైదానం లేకపోవటం వలన క్లాస్ రూంలోనే ఆడుకునే వాళ్ళం.
చిక్కుచిక్కు పుల్ల
ఈ ఆటను ఎక్కువగా ఇసుకలో ఆడతారు. మేమూ మా చిన్నప్పుడు బాగా ఆడుకున్నాం. మా ఊరు సముద్రం తీర ప్రాంతం కాబట్టి ఇసుక ఉండేది. ఆ ఇసుకలో చక్కగా ఆడుకునే వాళ్ళం. ఇసుకను పొడుగ్గా కొద్ది ఎత్తుగా కోలగా చేస్తూ దాంట్లో ఒక పుల్లను దాచిపెడతారు. అప్పుడు మట్టిలోని పుల్లను కనుక్కోవడం ఎదుటి వారి వంతు. ఎదుటమ్మాయి పుల్ల ఉందని భావించిన చోట రెండు చేతులతో బోర్లాగా కప్పేస్తుంది. అప్పుడు మిగతా ఇసుకలో పుల్ల దొరికితే మొదటి అమ్మాయి గెలిచినట్లుగా చెపుతారు. ఒక వేళ పుల్ల దొరక్కపోతే రెండో అమ్మాయి పట్టుకున్న ఇసుకను దోసిట్లో పోసి కళ్ళకు గంతలు కట్టి అటూ ఇటూ తిప్పి ఒక చోట పారబోయిస్తారు. తరువాత మపొదటి స్థానానికి తీసుకువచ్చి కళ్ళు తెరుస్తారు. ఇప్పుడు పుల్ల ఉన్న ఇసుక కుప్ప ఎక్కడుందో కనుక్కోవాలి. ఇదీ ఆట. ఈ ఆట ఆడుతూ పాట కూడా పాడుతుంటారు.
చిక్కు చిక్కు పుల్లా - చికురాకు పుల్లా
దోపిడీకి దొంగలొస్తే - దొక్కోవే పుల్లా
ఇంకా పుల్లను మట్టిలో కనపడకుండా దాచేటపుడు ఇలా కూడా అంటారు.
దూదూ పుల్ల - దూదారు పుల్ల
చూడకుండా - జాడా తీరు
ఊడకుండా - పుల్లా తీరు
ఆడపిల్లలు ఆడుకునే ఆటల్లో చెమ్మచెక్క ఆట కూడా చాలా ప్రముఖమైంది. ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలు చేతులు కలుపుకుంటూ చెమ్మచెక్క - చేరడేసి మొగ్గ, అట్లుపోయంగ - ఆరగించంగ అంటూ ఉత్సాహంగా పాడుకుంటారు.
అవ్వా అప్పచ్చి
ఈ ఆట కూడా పల్లెటూళ్ళలో బాగా ఆడుకుంటారు. ఒక్కొక్క జట్టుకు ముగ్గురు కావాలి. ఇద్దరు ఎదురెదురుగా ఉండి అవ్వా అప్పచ్చి అంటూ ఒకరి చేయి మరొకరు నిచ్చెనలాగా పట్టుకోవాలి. నోటి మీద చెయ్యి పెట్టుకొని అవ్వా అప్పచ్చి అని మొదట తన మోచేయిని పట్టుకోవాలి. తర్వాత ఎండం చేత్తో ఎదుటి వారి చేయి పట్టుకోవాలి. అప్పుడు మూడు కన్నాలుగా కనిపిస్తుంది. మూడో అమ్మాయిని ఆ ఖాళీల్లో రెండు కాళ్ళు పెట్టి ఎక్కించుకొని మోసుకెళతారు. పైన ఎక్కిన అమ్మాయి సింహాసనం ఎక్కిన రాణిలా ఫీలవుతుంది. చాలా సరదాగా ఉంటుంది.
లోన బయట
ఇది కూడా సరదా ఆట. ఎంతసేపైనా ఆడేఆట. ఒక తాడును నేలమీద కొద్ది ఎత్తులో కట్టాలి. లేదంటే నేలమీదే పరిచినా చాలు. ఆడేవాళ్ళందరూ తాడుకు ఒకవైపు నిలబడతారు. ఆట ఆడించటానికి ఒక మాస్టర్ ఉండాలి. వాళ్ళు లోన, బయట అని అంటున్నపుడు దానికి అనుగుణంగా గెంతాలి. లోన అన్నప్పుడు తాడుకు లోపలే ఉండాలి. బయట అన్నపుడు తాడు దాటి రావాలి. ఆడేవాళ్ళని కాస్త తికమక పెట్టటానికి మాస్టర్ లోనలోన, బయట బయట అంటూ ఆడిస్తాడు. తప్పుగా నిలబడిన వాళ్ళు ఓడిపోయినట్టు. పెద్దవాళ్ళు కూడా ఆడే ఆట ఇది.
ఉప్పాట
ఏడాది రెండేళ్ళ పిల్లలను భుజానికెత్తుకుని ఉప్పాట ఆడతారు. వీపు మీద బస్తాలాగా ఎత్తుకొని ''ఉప్పండీ! ఉప్పు'' అని అరుస్తూ నడుస్తుంటారు. మరొకరు వచ్చి 'ఈ ఉప్పు బస్తా ఎంత?' అని అడిగితే 'రూపాయి' అంటారు. 'ఇదిగో రూపాయి, మాకిచ్చెయ్యమ్మా' అని అనగానే ''అమ్మో! ఇది వజ్రాల మూట, మేము అమ్మం'' అంటూ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు. మరి కొన్ని ఆటలు వచ్చేవారం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్