Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరు జల్లులు పడుతున్న వేళ వేడివేడి సూప్ తాగుతుంటే ఆ మజానే వేరు. పైగా ఇప్పుడు కరోనా భయపెట్టేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే తప్ప ఆవైరస్ నుండి కాపాడుకోలేము. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. కానీ రోజూ ఒకేలాంటి కూరలు తినాలంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే తాజా కూరగాయలతో సూప్ చేసుకుని తాగితే నోటికి కాస్త రుచిగా కూడా వుంటుంది. అలాంటి కొన్ని సూప్‌లు మీకోసం...
క్యారెట్ సూప్
కావల్సిన పదార్థాలు : క్యారెట్స్ - ఐదారు, టమాటా గుజ్జు - రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, గరం మసాలా - కొద్దిగా, అల్లం పేస్ట్ - పావు టీ స్పూను, బట్టర్ - టీస్పూను, కొత్తిమీర - చిన్న కట్ట.
తయారుచేయు విధానం: ముందుగా క్యారెట్ పొట్టు తొలగించి తురిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో క్యారెట్ తురుము, టమాటాలను వేసి కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓ పాన్‌లో బటర్ వేసి కరిగిన తర్వాత అందులో అల్లం పేస్ట్, టమాటా, క్యారెట్ పేస్ట్ వేసి ఒక నిమిషం వేగనివ్వాలి. తర్వాత అందులో ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఒక నిమిషం ఉడికించి, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత దీన్ని సూప్ బౌల్లోకి తీసుకుని, మిరియాల, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే క్యారెట్ సూప్ రెడీ...
వెజ్‌టేబుల్ సూప్
కావల్సిన పదార్థాలు : క్యారెట్ ముక్కలు- ఒక కప్పు, ఉల్లిగడ్డ ముక్కలు- ఒక కప్పు, క్యాప్సికమ్ ముక్కలు- ఒక కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ - ఒక కప్పు, క్యాబేజీ - ఒక కప్పు, వెల్లులి - పావు టీ స్పూను, అల్లం - పావు టీ స్పూను, కార్న్‌ఫ్లోర్ - మూడు టీ స్పూన్లు, మిరియాలపొడి - అర టీ స్పూను, నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు, కూరగాయలు ఉడికించిన నీరు - రెండు కప్పులు, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి నిముషం వేగించుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి 10 నిమిషాలు వేగించుకోవాలి. కూరగాయలు వేగిన తర్వాత అందులో ముందుగా కూరగాయలు ఉడికించి పెట్టుకున్న నీటిని పోయాలి . అందులోనే మిరియాల పొడి, ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. మీడియం మంట మీద ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడు అందులో కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో వేసి మిక్స్ చేసి ఉడికే మిశ్రమంలో పోయాలి. తర్వాత నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి. చివరగా కొత్తమీర తరుగు చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ సూప్ రెడీ...
స్వీట్ కార్న్ సూప్
కావల్సిన పదార్థాలు : స్వీట్ కార్న్ - కప్పు, ఉల్లికాడలు - అరకప్పు, కూరగాయలు ఉడికించిన నీళ్లు - మూడు కప్పులు, టమాటా సాస్ - ఐదు చెంచాలు, దాల్చిన చెక్క - కొద్దిగా, జీలకర్ర - చెంచా, మిరియాలు - చెంచా, ఉల్లిగడ్డ తరుగు - అరకప్పు, టమాటా - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు, పంచదార - తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. అలానే శుభ్రంగా ఉన్న వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి. ఉల్లిగడ్డ ముద్ద, సుగంధద్రవ్యాల మూట, మొక్కజొన్నలను కూరగాయలు ఉడికించిన నీళ్లలో వేసి పొయ్యిమీద పెట్టాలి. కొద్ది సేపటికి ఉప్పు, ఉల్లికాడలు, టమాటాసాస్ వేసి బాగా మరిగించాలి. సూప్ చిక్కగా అవుతుంది. అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి వేడివేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
టమాటా, ఓట్స్ మసాలా సూప్
కావల్సిన పదార్థాలు : టమాటాలు - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి, ఓట్స్ - నాలుగు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, కారంపొడి - పావు టీస్పూను, అల్లం వెల్లులి ముద్ద - కొంచెం, నూనె - టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా.
తయారుచేయు విధానం: ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్దవేసి మరికొద్ది సేపు వేపాలి. ఇందులో చిన్నగా తరిగిన టమాటాలు (లేదా గ్రైండ్ చేసి) తగినంత ఉప్పు వేసి కలపాలి. మొత్తం ఉడికిన తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అవి మరుగుతుండగా ఓట్స్ వేయాలి. ఓట్స్ కూడా ఉడికి చిక్క బడ్డాక కొత్తిమీర కలిపి వేడిగా సర్వ్ చేయాలి.