Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్డౌన్ మొదలై మూడు నెలలు దాటింది. కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గలేదు. కరోనా ఏ రకంగానూ అలసిపోలేదు. మానవుల జీవితమే అస్తవ్యస్తమౌతున్నది. వలస కూలీలు పొట్ట చేతబట్టుకొని, మాడిపోయే ఎండల్లో నడుచుకుంటూ మరీ సొంత గ్రామాలకు చేరారు. తమ సొంత వాళ్ళను చూశామున్న ఆనందం, తృప్తి ఎంతో కాలం నిలవట్లేదు. పనిలేదు, తిండిలేదు, కడుపులో పేగులు నకనకలాడు తున్నాయి. వాళ్ళకే కాదు మధ్యతరగతి వాళ్ళకూ తిప్పలు తప్పట్లేదు. వ్యాపారాలు నడవటం లేదు. ఉద్యోగస్తులకు జీతాల్లో కోత విధించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు మానసిక భయం జనాన్ని ఎక్కువగా కుంగదీస్తోంది. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక సంతోషంగా చాలా ముఖ్యం. మనసు సంతోషంగా ఉండాలంటే మనసుకు నచ్చిన ఆహ్లాదకరమైన పనులు చేస్తుండాలి. కళాసృజన కాలక్షేపానికి అనుకుంటారు కానీ మానసిక ఉల్లాసానికి చాలా దోహదపడుతుంది. ఈరోజు కొన్ని కొత్త బొమ్మల సృష్టిని చూద్దాం!
ఆనపకాయ బుర్రతో
ఎండిపోయిన కాయలు, విత్తనాలతో చాలా అలంకారాలు చేశాను. అయితే ఇంత పెద్దకాయలతో ఎప్పుడూ ప్రయోగాలు చేయలేదు. మా కాంపౌడరు వాళ్ళ పొలంలో చాలా పొడవైన ఆనపకాయలు పండాయి. దాదాపు మూడున్నర, నాలుగు అడుగుల పొడవు ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దాన్ని కొయ్యకుండా చెట్టుమీదే ఎంబబెట్టి తీసుకొచ్చాము. అసలు తంతు ఇప్పుడు మొదలయింది. దానికి మొదట రంగులు వేశాను. దానిపైన చెట్లు, పువ్వులు, పక్షులు చిత్రించాను. మా పిల్లల ఆసుపత్రిలో వచ్చే పిల్లలకు కనువిందు చేయడానికి ప్రదర్శనలో పెట్టాను. పిల్లలకు నచ్చేవి పువ్వులు, పక్షులే కదా. అందుకే వాటిని వేశాను. మామూలుగా చెట్ల మీద పక్షులు వాలతాయి. కానీ ఇక్కడ కాయమీద వాలాయి. మామూలుగా పూలు వూసి తర్వాత కాయలవుతాయి. ఇక్కడ కాయ అయ్యాక పూలుగా మారాయి బాగుంది కదా! ఆనపకాయల్లో ఇంకా రకరకాల ఆకారాలవి సేకరించాయి. మళ్ళీ వాటి గురించి మరోసారి చెప్తాను.
ప్రమిదలు
దీపావళి ప్రమిదలు ఎక్కువగా వెలిగిస్తాం కదా! మరి దీపావళికే అలంకారం చేస్తాం అంటారా ఏంటి? రోజూ దేవుడి దగ్గర దీపారాధనలో పెట్టుకుంటాం కదా! మట్టి ప్రమిదలు బోలెడు ఆకారాల్లో సృష్టిస్తున్నారు. వాళ్ళ సృజన అద్భుతం. వాటిని తెచ్చి మనం రంగులు అద్దుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. రంగులు దిద్దినవీ దొరుకుతాయి. కానీ మన చేతులతో స్వయంగా వేసుకుంటే ఆ తృప్తే కదా! మంచి ఆకారాల్లోని ప్రమిదలు కొనిక్కొచ్చి వాటిని చక్కని రంగులు వేశాను. రెండు ప్రమిదలకు ఒకే రకమైన రంగుల కాంబినేషన్ వేశాను. వాటికి కుందన్లు కూడా అతికించాను. భలే ముచ్చటగా తయారయ్యాయి. ద్వారానికి అటొకటి ఇటొకటి పెట్టేటప్పుడు రెండూ ఒకేటా ఉంటాయని చేశాను. చాలా బాగున్నాయి. ఈసారి మీరూ బయట కొనకుండా ఇంట్లోనే తయారుచేసుకునేందుకు ప్రయత్నించండి.
టాబ్లెట్ కవర్లతో
ఈ మధ్య మా అమ్మకు వంట్లో బాగుండలేదు. వారం రోజులు ఆస్పత్రిలో ఉన్న తర్వాత బలానికి చాలా మందులు రాసిచ్చారు. ఆ టాబ్లెట్లు వాడాక కవర్లు అన్నీ ఒక చోట దాచాను. ఆ కవర్లు బంగారు రంగులో మెరిసిపోతూ అందాలొలుకుతూ ఉన్నాయి. నిన్న ఆకవర్లన్నీ ముందు పెట్టుకొని ఆలోచించాను. ఏం చేద్దామా అని. వాటిని కత్తిరించకుండా మొత్తంగా వాడేలా ఏం చేయొచ్చు అని ఆలోచించగా ఈ ఐడియా వచ్చింది.
టాబ్లెట్ కవర్‌ను గుండ్రంగా మడిచి స్టేప్లర్‌తో పిన్ కొట్టాను. గుండ్రంగానూ, మధ్యలో ఖాళీగానూ వచ్చింది. చక్కగా అందులో ఒక ప్లాస్టిక్ పువ్వును పెట్టాను. పువ్వు కూడా మనమే చేసుకోవచ్చు. క్రేప్ కాగితాలతో, పలుచటి కాగితాలతో రకరకాల పువ్వుల్ని చేయవచ్చు. మీకు మరోసారి వాటి గురించి చెబుతాను. నేను ఇలా మూడు ఫ్లవర్వేజ్లుగా చేశాను. ఒకటి పెద్దదిగా వచ్చింది. రెండు చిన్నవి తయారయాయి. రెండు కవర్లు విడదీయకుండా ఉండటం వల్ల పెద్దది వచ్చింది. దానికి రెండు వైపులా చిన్నవి పెట్టాను. ముచ్చటగా సెట్ తయారయింది. ఇక నుండీ టాబ్లెట్లు వేసుకున్నాక వాటి కవర్లు పారేయండి. వాటితో చాలా రకాలు చేసుకోవచ్చు. మీకు చెప్తాను వరసలో.
కొబ్బరి పిందెలతో
కొబ్బరి చెట్లున్న ఇళ్ళలో రాలిపడే కొబ్బరి పిందెలకేం కొదవలేదు. ఆ పిందెల్ని సేకరించి బాగా ఎంబెట్టాలి. ఎండిన పిందెలు కొద్దిగా చివర్లు తెరుచుకుంటాయి. వాటిని బంగారు రంగుతో పెయింట్ చేయాలి. సన్నని ఇనుపతీగలను తీసుకొని వాటి చివర కొబ్బరి పిందెల్ని గుచ్చాలి. అది పువ్వులా అమరింది. మరి ఆకులు కావాలి కదా! ఆకుల కోసం నేను చెక్కపని చేసేవారి దగ్గర నుంచి చెత్త తెచ్చాను. పెద్ద కొయ్యల్ని వారి కనుగుణంగా వస్తువులు తయారుచేయటానికి తోపుడు పడతారు. అలా చిత్రిక పట్టినపుడు వంకులు తిరిగిన పలుచటి బద్దల్లాంటివి వస్తాయి. వాటిని తెచ్చి ఆకుపచ్చ రంగును వేసి ఆకులుగా మలిచి పువ్వు కింద ఆకులుగా పెట్టాలి. ఈ ఆకుల్ని కూడా తీగకు చుట్టాలి. ఇలా చక్కని పూలకొమ్మలు తయారయ్యాయి. వీటిని మొత్తంగా కలిపి ఆకుపచ్చని ఊలుతో చుట్టి పూల బొకే తయారుచేశాను.
టీవీ యాంటిన్నా విడి భాగంతో
మనింట్లో టీవీ పెట్టుకున్నప్పుడు ఇంటి మీద యాంటిన్నా పెడతారు కదా! టీవీ రిపేరు వచ్చి నపుడు మెకానిక్ యాంటాన్న దగ్గర ఒక విడిభాగం పాడైందని చేతికిచ్చాడు. దాన్ని పారేయకుండా దాచి ఉంచాను. అది తీసుకొని ఒక మనిషి బొమ్మ తయారు చేశాను. కళ్ళు కోసం పిల్లలకు కట్టే దిష్టి పూసల్ని తీసుకొని అతికించాను. ముక్కు కోసం సెలైన్ ట్యూబ్ ముక్కను అతికించాను. నోరుకు కాగితం ముక్కను అతికించాను. తలకు జుట్టును అతికించాను. సాధారణంగా నల్లరంగు వాడ తాము. కానీ ఇప్పటి ట్రెండుకు తగినట్టుగా పింక్ కలర్ ఊలును వాడాను. డ్రెస్ కోసం మెరుపుల టేపుల్ని ఉపయోగించాను. ఇంకా కొద్దిగా డిజైన్‌గా పెన్నుతో వేశాను. బాగా తయారయింది. ఇలా ఏవైనా విడిభాగాలు దొరికినప్పుడు ఏదో ఒక బొమ చేయండి. మరిన్ని ఐడియాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం.
- కందేపి రాణీప్రసాద్