Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైరస్ ఆరు నెలల నుండి భూ మండలాన్ని పట్టుకుని పీడిస్తున్నది. వైరస్ వ్యాప్తి చెంది నెలలు దాటుతున్నా తగ్గే సూచనలు కనిపించట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకుంటే మంచిది. డయాగస్టిక్ సెంటర్ల దగ్గర బారులుదీరిన వందల మందిని చూస్తుంటే కోవిడ్ ప్రతాపం అర్ధం అవుతున్నది. పాజిటివ్ వచ్చిన రోగిని ఈసడించు కోకూడదు. జాగ్రత్తలు పాటించాలి. వ్యాధితోనే పోరాటం గాని రోగితో కాదు అని చెప్పే ఫోన్ కాలర్ట్యూన్లోని మాటలు యదార్ధం. రోగులు అంటే కోవిడ్ బారిన పడ్డ బాధితులు. వారికి సరియైన జాగ్రత్తలతో చికిత్స అందించండి. ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ ఎదురుగా నిలిచి పోరాటం చేసే డాక్టర్లకు నైతిక మద్ధతు ఇవ్వండి. సరే మనమయితే బయటకు వెళ్ళకుండా వృధాగా పారవేసే వాటితో మన ఇంటికి కొత్త వైభవం తీసుకువద్దాం.
కాలం చెల్లిన మందులతో
సాధారణంగా ఇంట్లో ప్రతిరోజూ అవసరమయ్యే టాబ్లెట్లను అందరూ ఇళ్ళలో ఉంచుకుంటున్నారు. అంతేకాక బి కాంప్లెక్స్, కాల్షియం వంటి టాబ్లెట్లనూ వారే సొంతంగా వాడుకుంటున్నారు. వాటి అవసరాలూ తెలుసుకుంటున్నారు. ఇలా ప్రతి ఇంట్లో ఒక టాబ్లెట్ల డబ్బా తయారౌతుంది. మా ఇంట్లో కూడా ఇలా చాలా చేరాయి. సరే వాటిలో కాలం చెల్లిన మందుల్ని తీసేసి సర్దుదామని కూర్చున్నాను. వాటిలో కొన్ని కాల్షియం టాబ్లెట్లు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. వాటిని స్ట్రిప్‌లో నుంచి విప్పగా ఏడు టాబ్లెట్లు ఉన్నాయి. అవి లేత పింక్ రంగు, తెలుగు రంగు కగలిపి దోసగింజ ఆకారంలో ముద్దుగా ఉన్నాయి. వెంటనే ఒక సెలైన్ వైపు ముక్కను తీసుకొని కొమ్మలాగా పెట్టి వీటిని పూవులుగా తయారు చేశాను. దాంతో ఓ చిన్న గ్రీటింగ్ కార్డు తయారయింది. బాగుంది కదా! నిలంలలతొ ఇలా చేయించవచ్చు.
టీ కప్పులతో
ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళినా డిస్పోజబుల్ టీ కప్పులనే వాడుతున్నాం. ప్లాస్టిక్‌వి, పేపర్వి రెండు రకాలుంటాయి. ప్రస్తుతం పేపర్ కప్పులు తీసుకున్నాను. ఒకటి పెద్దసైజు కప్పు, రెండవది చిన్న సైజు కప్పు. పెద్ద కప్పును గౌనుగా వాడాలి. దాని మీద 3డి అవుట్లైనర్ తీసుకుని డిజైన్ వేశాను. దాని మీద చిన్న కప్పు నుంచి అతికించాను. చిన్న కప్పు మీద కళ్ళు, ముక్కు, నోరు పెయింట్ చేసి జుట్టు దువ్వి జడలు కూడా వేశాను. ఇంకా నెత్తి మీద ఒక టోపీ కూడా పెట్టాను. ఇది పిల్లలకు పాలు పట్టే పాలపీక. పాడయిపోయన పాలపీకను తీసుకుని టోపీలాగా అమర్చాను. ఎలా ఉంది అమ్మాయి.
పనికిరాని సీడీలతో
ఈ కాలంలో కంప్యూటర్లు లేని ఇల్లే లేదు. మరి కంప్యూటర్లు ఉన్నాక ఎంతో వేస్ట్ తయారవుతుంది. పెన్‌డ్రైవ్‌లు, సీడీలు, మౌస్‌లు, కీ బోర్డులు వంటి ఎన్నో రకాల వేస్ట్ ఉంటున్నది. అలాంటి వాటిలో ప్రస్తుతం సీడీలు తీసుకొని వాటితో బొమ్మలు చేద్దాం. చాలా సులభంగా ఈ సీడీలను అందంగా తయారు చేయవచ్చు. గిఫ్ట్ ర్యాపర్‌ను తీసుకొని సన్నగా పీలికలుగా కత్తిరించాలి. రంగురంగుల ర్యాపర్లను కత్తిరించి ముక్కలుగా తీసు కోవాలి. సన్నని పీలి కల్ని సీడీ మీద చుట్టూతా గుండ్రంగా అతికించాలి. చాలా అందంగా తయా రైంది. శుభలేఖల మీద వినాయకుళ్ళను సీడీల మధ్యలో అతికించాను. ఇలా రెండు సీడీలు తయారే చేసి మా బెడ్రూం తలుపుకు అతికించాను. రోజ్‌వుడ్ పాలిషింగ్‌తో ఉన్న టేకు తలుపుపై ఈ రంగుల సీడీలు చాలా అందంగా అమిరాయి.
వాడేసిన సెలైన్ బాటిల్‌తో
ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా భూమ్మీద పడేస్తే పేరుకుపోవటం తప్ప అవి భూమిలో కలిసిపోవు. మనం వేసే ప్లాస్టిక్ వేస్ట్ నేలతల్లికి ఊపిరాడకుండా చేస్తున్నది. నేల లోపల ఉండే ఎన్నో జీవులు ఊపిరాడక చనిపోతున్నాయి. వీటిని మరల రీసైకిల్ చేయటం వలన ఈ ఆపద తప్పుతుంది. మనం మన వంతు కృషిగా ప్లాస్టిక్ వస్తువులను మనమే రీసైకిల్ చేద్దాం. అవకాశం వుంటే మీకు దగ్గర్లో ఉన్న ఏదో ఒక ఆసుపత్రి నుంచి ఐదారు సెలైన్ బాటిల్స్‌ను సేకరించండి. ఒక బాటిల్‌ను అట్టిపెట్టి మిగతా బాటిల్స్‌కు రెండు చివర్లు కోసేయాలి. మధ్యలో గాటు పెట్టి చివర్లు మాత్రం అతుక్కునే ఉండేలా చూడాలి. ఇలా ఐదారు షీట్లను తయారుచేసుకోవాలి. వీటిని మధ్యకు వంచితే రింగుల్లాగా వస్తాయి. అలా ఒక్కొక్క షీటును వంపి మొదట పక్కకు పెట్టిన సెలైన్ బాటిల్‌కు కట్టాలి. అప్పుడు అదొక డిజైన్లా కనిపిస్తుంది. ఇలా ఐదారు షీట్లు కలిపి ఆ సెలైన్ బాటిల్ చుట్టూ దూరిస్తే అందమైన బుట్టుబొమ్మలా తయారవుతుంది. దీన్ని ఫ్లవర్ వేజ్లాగా వాడుకోవచ్చు. ఇంకా కావాలంటే వీటికి రంగులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుటుంది. ఇలా సెలైన్ బాటిళ్ళతో రకరకాల అలంకారాలు చేసుకోవచ్చు. వాటి గురించి తర్వాతి వారంలో తెలుసు కుందాం.
కుక్కర్ గాస్కెట్లతో
చిన్నతనంలో కుక్కర్ గాస్కెట్లతో ఎన్నో రకాల అల్లకాలు అల్లేవాళ్ళం మేము. దాని కోసం కుక్కర్ గాస్కెట్ ఎప్పుడు చెడిపోతుందా అని చూసి అమ్మతో తిట్లు తినేవాళ్ళం. చుట్టాలింటికి, స్నేహితల ఇంటికి ఎవరింటికి వెళ్ళినా మీ ఇంట్లో చెడిపోయిన గాస్కెట్లు ఉన్నాయా అని అడిగి తీసుకునేవాళ్ళం. ఎంతో కష్టపడి వాటిని సేకరించి ఊలుతో అల్లికలు అల్లి అందంగా గోడకు తగిలించే వాళ్ళం. ఊలు పువ్వులు తయారు చేసి అల్లకాల మధ్యలో కుట్టి చక్కగా తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు అంత తీరిక లేదు. వేగవంతమై పోయింది జీవితం. ఏదైనా మనకు ఇన్స్టెంట్గానే కావాలి. ఇన్స్టెంట్ కాపీలు, ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి, దోశపిండి అన్ని అవే దొరుకుతున్నాయి. సరే మనం ఇప్పుడు గాస్కెట్లను ఎలా అలంకరించాలో చూద్దాం. గిఫ్ట్ ప్యాకింగ్ రేపర్లను తీసుకొని సన్నని పీలికలుగా కత్తిరించాలి. నేను ఏ గిఫ్ట్ వచ్చినా రేపర్‌ను దాచిపెడతాను. ఇంటి నిండా చెత్త పేరుస్తున్నావని ఇంట్లో వాళ్ళ చేత మాటలూ పడతాను. సరే ఇలా కత్తిరించిన పీలికల్ని ఫెవికాల్తో గాస్కెట్ చుట్టూతా చుట్టాలి. ఒక్కొక్క దానికి సింగిల్ కలరైనా బాగుంటుంది. మల్టీ కలరైనా తీసుకోవచ్చు. నేను మూడు గాస్కెట్లను తీసుకొని మూడు రంగులతో చుట్టాను. మూడింటిని కలిపి గోడమీద చక్కగా అలంకరించాను.
ప్లాస్టిక్ వైరుతో కర్టెన్
మా చిన్నప్పుడు ప్లాస్టిక్ వైరుతో వందల రకాలు సృష్టించాం. అలాంటి వాటితో ఈ కర్టెన్ కూడా ఒకటి. ప్లాస్టిక్ వైరుతో రింగులుగా అల్లాలి ఒక రంగుతో. తర్వాత రెండవ రంగు వైరుతో మొదటి రంగు రింగులను కలుపుతూ అల్లుకుపోవాలి. ఇలా పొడుగ్గా చైన్ లాగా అల్లాలి. వరసగా పది చైన్లను అల్లాలి. పొడవాటి చైన్లను కర్టెన్ రాడ్‌కు తగిలించి డోర్‌కు పెట్టాలి. పూసల కర్టెన్ లాగా ఇది కూడా రింగుల కర్టెన్. అయితే ఇది నా చిన్నతనానిది కాబట్టి ఈ కర్టెన్ అక్కడక్కడా తెగిపోయింది. అందుకని వీటిని విడివిడిగా కత్తిరించేసి రింగులు రింగులుగా ఒక వెడల్పాటి వెదురు బుట్టలో వేశాను. అదొక ఫ్లవర్ బొకేలా అందంగా అమిరింది.
- డా|| కందేపి రాణీ ప్రసాద్