Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కో పండు.. ఒక్కో రుచి..
పోషకాలు పుష్కలం..
శీతాకాలంలోనే అందుబాటులోకి...
పట్టణాల్లోనూ రాసులకొద్దీ అమ్మకాలు
అందరికీ అందుబాటు ధరల్లో లభ్యంనవతెలంగాణ- సిద్దిపేట టౌన్
ఇది రేగుపండ్ల సీజన్. రేగిపండ్లను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఒక పండు తీసుకొని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడే పండ్లల్లో రేగుపండు ఒకటి. కాలానుగుణంగా దొరికే ప్రతీ పండు ఆరోగ్యానికి దివ్యఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి ఈ సీజన్లో లభించే రేగుపండ్లు తప్పక తినాలి మరి. రేగు పండ్లు వాటి పరిమాణం, రంగు, రుచిని బట్టి సుమారు తొంబై రకాలున్నాయి. సాధారణంగా మనకు కనుపించేవి రెండు రకాలు. ఒకరకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా వుంటాయి. వీటిలో గుజ్జు తక్కువగా వుండి గింజ పెద్దవిగా వుంటాయి. తినడానికి ఇవి కొంత పులుపుదనం, తియ్యదనం కలిసి బాగుంటాయి. రెండో రకం కోలగా వుండి పెద్దవిగా వుంటాయి. వీటి రంగు కూడా చిన్న వాటి లాగే వుంటుంది. కండ ఎక్కువగా వుండి కొరికి తినడానికి బాగా వుంటాయి. ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా ఉంటాయి. వీటినే పెద్ద రేగు లేదా గంగ రేగు అంటారు. రేగు పండు చూడ్డానికి చిన్నగా వుంటుంది. పచ్చిగా వున్నప్పుడు ఆకుపచ్చ రంగులో వున్నా, పక్వానికొచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆ పై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషధ గుణాలు చాలాఉన్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాలా మంచిది. గొంతు నొప్పిని, ఆస్తమాని కండరాల నొప్పిని తగ్గించే గుణం దీనిలో ఉంది. రేగు పండు గింజ చాలా గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్‌గా తాగితే నీళ్ల విరేచనాలకు భలేగా పనిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు కూడా పెట్టుకుంటారు.
ప్రయోజనాలివిగో...
రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు రేగు పండ్లలో చాలానే ఉన్నాయి. రేగు పండ్లలో ఉండే గుజ్జు ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరుకు టానిక్‌లా పనిచేస్తోంది. చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడ్తాయి. రక్త నాళాలను శుభ్రపరిచి గుండెకు సంబంధించిన వ్యాధులను నివారిస్తాయి. నరాల ఒత్తిడిని, మొలల వ్యాధిని తగ్గిస్తోందని చెప్పొచ్చు, కండరాల పటుత్వాన్ని పెంచడంలో తోడ్పడుతాయి. ఐరన్, ఫాస్పరస్‌లు ఉండే ఈ పండ్లు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. గొంతు మంటని, ఆకలి తగ్గించటంలో పాత్ర పోషిస్తాయి. తద్వారా బరువు తగ్గేందుకు రేగుపండ్లు ఎంతగానో సహకరిస్తాయి. గర్భీÛణుల్లో వికారం, వాంతులు తగ్గించేందుకు పుల్లని చిన్న రేగుపండ్లు ఉపయోగపడతాయి. మనుషుల్లో అవసరమయ్యే 24రకాల అమైనో ఆమాల్‌లో 18 రకాలు రేగుపండ్ల ద్వారానే లభిస్తాయని చెప్పుతారు. నీడలో ఆరబెట్టిన పండ్ల గింజలతో చేసిన అయింట్మెంట్ను కీళ్లకు రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి. పూలు, ఆకులు ఇంట్లో ఉంచుకుంటే క్రిమి కీటకాలు దరి చేరవంటారు. రేగు పండు చెట్టు బెరడును డయేరియాకు ఔషధంగా ఉపయోగిస్తారు. శరీరానికి ఎంతో లాభం చేకూర్చే క్లోరో జెనిక్ ఆమ్లం, నియోక్లోరోజెనిక్, న్యూట్రిషన్స్ ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కణం పొరలల్లో ఉండే కొవ్వు వలన కలిగే హానిని నిరోధిస్తోంది. కంటికి సంబంధించిన నాళాలు పడవాకుండా కాపాడుతోంది. క్యాన్సర్ కణాలను, కణుతులను ఆపేయడంలో సాయపడుతోంది. అదే పనిగా ఎక్కువగా తింటే మాత్రం డయేరియా వస్తుంది.
సంక్రాంతికి రేగు పండ్లు ఎంతో స్పెషల్...
సంక్రాంతి పండుగ సమమంలో రేగు పండ్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు జరిగే పండుగ ఆ రోజుల్లో ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ వాటిపై గొబ్బెమ్మలతో పాటు రేగు పండ్లను పోస్తారు. అదే విధంగా మన ఇంటి కడపలపై కూడా పోస్తుంటారు. ఇంకా మన ఇంట్లో చిన్నారులకు బోగి పండ్లు అంటూ రేగుపండ్లను పోస్తుంటారు.
వంద గ్రాముల రేగు పండ్ల నుంచి లభించే పోషకాలు
కొవ్వు : 0.2 గ్రాములు
కాల్షియం : 25.6 మి.గ్రాములు
క్యాలరీలు : 79
ప్రోటీన్లు : 1.2 గ్రాములు
సోడియం : 3.5 మి.గ్రాములు
ఫాస్ఫరస్ : 26.8 మి.గ్రాములు
విటమిన్ ఎ : 10 మై.యూనిట్లు
విటమిన్ సి : 70 మి.గ్రాములు
పిండిపదార్థాలు : 20.2 గ్రాములు