Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అత్యుత్తమ పైలట్‌గా దీపక్ సాథేకు గుర్తింపు
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పైలట్, కెప్టెన్ దీపక్ వి సాథె కనీసం రెండు సార్లు ప్రయత్నించినట్లు అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకర్ వెబసైట్లో ఉంచిన మ్యాప్ వెల్లడిస్తోంది. స్వీడన్‌కు చెందిన ఫ్లైట్ ట్రాకర్ 24 సంస్థ కమర్షియల్ విమానాలకు సంబంధించి ట్రాకింగ్ సమాచారాన్ని మ్యాప్ రూపంలో అందిస్తుంది. శుక్రవారం దుబారు నుంచి కొలికోడ్ వరకూ బోయింగ్ 737 ఎన్జి విమాన ప్రయాణం బాగానే సాగింది. కోజికోడ్ విమానాశ్రయంలోని టేబుల్‌టాప్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత రన్‌వే మీద నుంచి జారి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదానికి ముందు విమానాన్ని సురక్షితంగా దింపడానికి పైలట్ రెండుసార్లు ప్రయత్నించినట్టు మ్యాప్ వెల్లడిస్తోంది. పైలట్ అంతగా ప్రయత్నించినా ప్రమాదం తప్పలేదు. అయినప్పటికీ ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారని వైమాని వర్గాలు తెలిపాయి.
అత్యుత్తమ పైలట్
విమానాన్ని సురక్షితంగా దించేందుకు ప్రయ త్నించిన పైలట్, కెప్టెన్ దీపక్ వి సాథె దేశంలోని అత్యుత్తమ పైలట్లలో ఒకరు. 1961లో ముంబైలో జన్మించిన ఆయన డెహ్రాడూన్‌లోని కాంబ్రియన్ హాల్లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. తండ్రి సైన్యంలో చేరడంతో అదే ప్రేరణతో ఆయన భారత వాయుసేనలో చేరారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ముంబైలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్సు అకాడమీలో 1981లో ఆయన శిక్షణ పొందారు. 127వ పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 'స్వార్డ్ ఆఫ్ ఆనర్' అందుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్‌వస్లాలో 58వ బ్యాచ్‌లో శిక్షణ పొంది స్వర్ణ పతకం సాధించారు. ఎయిర్‌ఫోర్సులో టెస్టు పైలట్‌గా పనిచేశారు. 1981లో వాయుసేనలో చేరి 2003లో వీడ్కోలు తీసుకున్నారు. అనంతరం ఎయిర్ ఇండియాలో చేరారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 17వ స్క్వాడ్రన్, గోల్డెన్ యూరోస్లోనూ సేవలందించారు. బోయింగ్ 737-800 విమానాలను నడపడంలో ఆయనకు ఎంతో అనుభవముంది. ఎయిర్‌బస్ ఎ-310 నడిపిన అనుభవం ఉంది. కోజికోడ్ విమానాశ్రయం గురించి ఎంతో అవగాహన కూడా ఉంది. ఈ ప్రమాద జరగడం దురదృష్టకరమని, అత్యుత్తమ పైలట్ కావడం వల్లే ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారని వైమానిక వర్గాలు చెబుతున్నాయి.