Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గండికోటలో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటిని నింపాలి : సిఎం వైఎస్ జగన్
అమరావతి: పోలవరం ప్రాజెక్టులోని పునరావాస పనుల నాణ్యతపై దృష్టి సారించి వేగం పెంచాలని ఇరిగేషన్ అధికారులకు వైఎస్ జగన్ ఆదేశించారు. అలాగే ఈ ఏడాదే గండికోట రిజర్వాయరులో పూర్తిస్థాయిలో 26.85 టిఎంసిల నీటిని నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఇంజినీర్లు ప్రాజెక్టుల వారిగా జరుగుతున్న పనుల వివరాలను సిఎంకు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై కోవిడ్ ప్రభావం పడిందన్నారు. ఇప్పుడిప్పుడే పనులు వేగం పుంజుకుంటున్నాయని వివరించారు. వరద సమయంలోనూ పోలవరం పనులు చేసుకునేందుకు ప్రణాళికను తయారు చేశామని చెప్పారు. ఇటీవల వర్షాలకు అవుకు సొరంగ మార్గంలో మట్టి జారిందని, దాన్ని అరికట్టేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి తగిన చర్యలు చేపడతామని చెప్పారు. విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. తోటపల్లిలో మిగిలిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు ఖర్చుపెడితే ప్రాజెక్టుల పనులు పూర్తవుతాయని వివరించారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నుంచి డిసెంబరులో నీటి విడుదలకు సిద్ధం చేస్తున్నామని, ఈ ఏడాదిలోనే 2.2 కిలోమీటర్లు తవ్వగలిగామన్నారు. నెల్లూరు బ్యారేజీలో సివిల్ పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయని, సంగం బ్యారేజీ కూడా నవంబరు నాటికి, వంశధార నాగావళి లింకు పనులు డిసెంబరు చివరి నాటికి పూర్తవుతాయన్నారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిఎం సూచించారు. జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలన్నారు. పోలవరం స్పిల్వే పిల్లర్స్ ఈ ప్రభుత్వం వచ్చేనాటికి సగటు ఎత్తు 28 మీటర్లు కాగా, ఇప్పుడు 51 మీటర్లుగా ఉందన్నారు. గండికోటలో నీటిని నింపడంతోపాటు చిత్రావతిలో 10 టిఎంసిల నీటిని నిల్వ చేయాలన్నారు. గండికోట-పైడిపాలెం లిఫ్ట్ అప్గ్రెడేషన్ పనులు త్వరగా మొదలుపెట్టాలని సూచించారు. రాజోలి, జొలదరాశి ప్రాజెక్టుల పనులు త్వరితగతిన మొదలుపెట్టాలని కోరారు. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ చేసే లిఫ్ట్ పనులు, పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.