- కల్తీ సారా కేసులో బీహార్‌లో కోర్టు సంచలన తీర్పు పాట్నా: బీహార్‌లోని ప్రత్యేక ఎక్సైజ్ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో కల్తీసారా తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనకు సంబంధించిన కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధించింది. మరో నలుగురు మహిళలకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2016 ఆగస్టులో గోపాల్‌గంజ్ జిల్లా ఖర్జుర్‌బని ప్రాంతంలో చోటుచేసుకున్న కల్తీ సారా ఘటనలో 21 మంది మరణించగా.. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం గత నెల 26న 13 మందిని దోషులుగా నిర్ధారించింది. తాజాగా వారికి శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ప్రభుత్వం గతేడాది జూన్‌లో ముగ్గురు ఎస్సైలు సహా 21 మంది పోలీసులను తొలగించింది.