Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంబరాల మధ్య సొంత గూటికి రైతులు
- సరిహద్దుల్లో 'విక్టరీ మార్చ్'
- విజయోత్సవాలు...సంబురాలు
- ఘనంగా విజయ దివస్
న్యూఢిల్లీ: చారిత్రాత్మక విజయం తరువాత రైతులు పోరు బాట నుంచి ఊరు బాటపట్టారు. విజయోత్సవాలు, సంబురాలు, డప్పు వాయిద్యాల నడుమ ఇండ్లకు బయలుదేరారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలకు రైతులు వీడ్కోలు పలికారు. తమ ఇండ్లకు బయలుదేరిని రైతులకు దారిపొడువునా రైతులు, కార్మికులు, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు పూలతో స్వాగతం పలికారు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద విక్టరీ మార్చ్‌లు నిర్వహించారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన ''విజయ దివస్'' పిలుపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగింది. అన్ని రాష్ట్రాల్లో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. శనివారం ఉదయం 8.30 గంటలకు సింఘూ సరిహద్దు వద్ద కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో రైతు నేతలు సమావేశమయ్యారు. అక్కడ విజయోత్సవాలు నిర్వహించి, పంజాబ్ వైపు రైతులు కవాతు ప్రారంభించారు. ట్రాక్టర్లు, ట్రాలీలతో రైతులు ముందుకు కదిలారు. కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే వద్ద రైతులకు ఏఐకేఎస్ కోశాధికారి కృష్ణ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విపి సానూ, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, ఐద్వా ఢిల్లీ అధ్యక్షురాలు మెమునా మొల్లా తదితరులు అభివాదం చేశారు. ఉదయం 9 గంటలకు టిక్రీ సరిహద్దులో రైతు నాయకులు బహదూర్‌ఘర్‌లోని కిసాన్ చౌక్‌లో సమావేశమయ్యారు. అక్కడ విజయోత్సవాలు నిర్వహించి ఇండ్లకు బయలుదేరారు. ఇక్కడ రైతులకు ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అభివాదం చేశారు. ఉదయం 10 గంటలకు ఘాజీపూర్ సరిహద్దు వద్ద రైతు నేతలు సమావేశమై విజయోత్సవాలు నిర్వహించారు. అక్కడ నుంచి ఇండ్లకు వెళ్లే మొదటి బృందానికి రాకేష్ టికాయిత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్కు వెళ్తుంది. సింఘూ, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఇండ్లకు వెళ్లే ముందు రైతులు భజన చేశారు. అలాగే చివరి సారిగా సరిహద్దుల్లో శనివారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు.
ఢిల్లీ సరిహద్దుల వద్ద విజయవంతమైన చారిత్రాత్మక ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకుని రైతులు తిరిగి వెళ్తున్నారు. విజయవంతమైన ఉద్యమం తర్వాత పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలో రైతులు ఇండ్లకు బయలుదేరినప్పుడు భావోద్వేగాలకు గురయ్యారు. వృద్ధులు తమ రంగురంగుల తలపాగాలు ధరించి యువకులతో కలిసి నృత్యాలు చేయగా, రంగురంగుల లైట్లతో అలంకరించబడిన ట్రాక్టర్లు నిరసన వేదికల నుంచి విజయ గీతాలను మోగించాయి. హర్యానా-పంజాబ్‌లోని శంభు సరిహద్దు వద్ద రైతులపై చాపర్‌తో పూల వర్షం కురిపించారు. మరోవైపు హర్యానాలోని హిసార్‌లో ఢిల్లీలోని టిక్రీ సరిహద్దు దగ్గర నిరసన ప్రాంగణం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా రైతులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢకొీనడంతో పంజాబ్‌కు చెందిన ఇద్దరు రైతులు మరణించారు.
తమ వస్తువులు పేదలకు విరాళం
సింఘూ వద్ద రైతులు చాలా మంది స్వస్థలాలకు బయలుదేరడంతో తాత్కాలిక పట్టణాన్ని కూల్చివేశారు. నిచ్చెనలు, టార్పాలిన్, స్తంభాలు, తాడులు ఒకప్పుడు సందడి చేసిన నిరసన ప్రదేశం రైతులు వెళ్లిపోవడంతో మూగబోయింది. దుప్పట్లు, దిండ్లు, పరుపులు, కుర్చీలు రోడ్డు పక్కన చక్కగా పేర్చబడి ఉన్నాయి. కొంతమంది రైతులు సమీపంలోని గ్రామాల్లోని పేదలకు తమ వస్తువులను కూడా విరాళంగా ఇచ్చారు. రైతులు ఉద్యమ శిబిరాల నుండి బయలుదేరే ముందు ఆ ప్రాంతాలను శుభ్రం చేశారు. మరోవైపు సింఘూ సరిహద్దులో రైతులకు ఏడాది పాటు లంగర్ అందించిన రెస్టారెంట్ యజమాని, నిరసనల కారణంగా మూతపడిన రెస్టారెంట్‌ను ఇప్పుడు మళ్లీ తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ''రైతులే నా కుటుంబం. ఒక్క రైతు ఇక్కడ ఉన్నంత వరకు లంగర్ కొనసాగుతుంది'' అని గోల్డెన్ హట్ యజమాని రాంపాల్ సింగ్ చెప్పారు.
హామీలను నెరవేర్చకపోతే.. తిరిగొస్తాం : రాకేష్ టికాయిత్
ప్రభుత్వ హామీలను నెరవేర్చకపోతే, తాము తిరిగి వస్తామని రైతు నేత రాకేష్ టికాయిత్ స్పష్టం చేశారు. ''యూపీ ఎన్నికలకు సంబంధించి నా నిర్ణయాన్ని నా మద్దతుదారులకు తెలియజేస్తాను. నేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో తిరుగుతాను. నన్ను ఎవరూ ఆపలేరు'' అన్నారు. ''మాకు సహాయం చేసిన వ్యక్తులను కలుస్తాం. ప్రజలు ఇప్పటికే ఖాళీ చేయడం ప్రారంభించారు. దీనికి 4-5 రోజులు పడుతుంది. పూర్తి అయిన తరువాత నేను డిసెంబరు 15న బయలుదేరుతాను'' అని రాకేష్ టికాయిత్ చెప్పారు. రాబోయే 48 గంటల్లో ఇక్కడ చాలా ప్రాంతం ఖాళీ అవుతుందని చెప్పారు. అయితే ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించేందుకు కనీసం వారం రోజులు పడుతుందని ఆయన తెలిపారు. దీంతో పాటు రైతులు తమ పొలాలపై శ్రద్ధ వహించి ప్రశాంతంగా జీవించాలని కోరారు.