Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్గీకరణ చేయకపోతే కమలం పార్టీ నేతల్ని తిరగనివ్వం
- జంతర్ మంతర్ వద్ద ఎంఆర్పీఎస్ ధర్నా
న్యూఢిల్లీ : మోడీ మెడలు వంచేది మాదిగలేననీ, ఎస్సీ వర్గీకరణ చేయకయకపోతే తెలంగాణ, ఏపీలో బీజేపీ నేతలను తిరగనివ్వమని ఎంఆర్పీఎస్ నేతలు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ సోమవారం నాడిక్కడ స్థానిక జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. ''ప్రాణాలైనా అర్పిస్తాం-ఏబీసీడీ సాధిస్తాం'' అంటూ నినాదాలను హౌరెత్తించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి మాట్లాడుతూ దేశాన్ని ఏలుతున్న మోడీ ప్రభుత్వానికి ఎస్సీ కులాల పట్ల ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన బీజేపీ, ఇప్పటివరకు ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు కర్నాటక లాంటి అనేక రాష్ట్రాల్లో ఎస్సీలపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.
మాదిగలకు 12 శాతం రిజర్వేవషన్లు కల్పించాలి: మాదిగా జేఏసీ మహా ధర్నా
పార్లమెంట్లో చట్టం ద్వారానే మాదిగలకు న్యాయం జరుగుతుందని మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజుల ఆందోళన చేపట్టారు. సోమవారం మహాధర్నా చేపట్టగా, మంగళవారం దీక్ష చేపడతామని జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి అన్నారు. శీతాకాల సమావేశాల్లో ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్లను విభజించే హక్కు రాష్ట్రాలకు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలకు 12 శతం రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, టిఎంఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయొద్దని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కోరారు. ఈ మేరకు సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మెన్ విజరు షాంప్లను మాల మహానాడు బృందం కలిసి వినతి అందజేసింది.