Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్ తీవ్రత పెరిగితే అంతే సంగతి: కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళలు అధికమవుతున్నాయి. పలు దేశాల్లో ఈ రకం కేసులు ఎక్కువగా నమోదవున్నాయి. ప్రస్తుతం భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ తీవ్రత పెరిగితే మన కరోనా టీకాలు పనిచేయకపోవచ్చునని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ''ప్రస్తుతం మన టీకాలు కరోనా కొత్త వేరియంట్లు ఉద్భవిస్తున్న పరిస్థితులలో అసమర్థంగా మారవచ్చు. అవసరాన్ని బట్టి టీకాలను సవరించడానికి సిద్ధం కావాల్సిన అవసరం చాలా ఉంది'' అని వీకే పాల్ అన్నారు. దేశంలో కరోనా స్థానిక వ్యాప్తి దిశలో ఉందనీ, ఇక్కడ తక్కువ లేదా మధ్యస్థ స్థాయిలో ప్రసారం జరుగుతుందని వెల్లడించారు. ''ఇప్పటికే భారత్ డెల్టా వేరియంట్ షాక్‌ను ఎదుర్కొంది. ఇప్పుడు ఒమిక్రాన్ షాక్‌ను ఎదుర్కోబోతున్నాం. గత మూడు వారాలుగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రస్తుత ప్రభావ పరిస్థితులు మారుతున్న క్రమంలో మన టీకాలు పనికిరాకుండా పోయే అవకాశం లేకపోలేదు'' అని వీకే పాల్ అన్నారు. ఒమిక్రాన్‌పై చాలా సందేహాలు ఉన్నాయని ఇంకా తమకు దీని పూర్తి సమాచారం తెలియలేదని అన్నారు. ఏదిఏమైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ, పెద్ద ఎత్తున ఈ వేరియంట్లను ఎదుర్కోవడానికి టీకాల అభివృద్ధి జరగాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. కరోనా వేరియంట్ల మార్పులకు అనుగుణంగా మార్పు చేయగల వ్యాక్సిన్ ప్లాట్‌ఫామ్‌లను కలిలి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ప్రస్తుతం మారుతున్న వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్‌ను మనం ఎంత త్వరగా తయారు చేయగలమన్నది నిర్ధారించుకోవాల్సిన అవసరముందన్నారు. కరోనా సహా వైరల్ వ్యాధులతో పోరాడటానికి సమర్థవంతమైన ఔషధం కోసం తాము ఇంకా బాధపడుతూనే ఉన్నామని పేర్కొన్నారు.