Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల త్యాగం వృథా కాదు : జేఏసీ బహిరంగసభలో వక్తల ఉద్ఘాటన
తిరుపతి: 'ఆంధ్రుల రాజధాని అమరావతే.. ఇది ఐదు కోట్ల ప్రజానీకం అభిమతం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకు అంగీకరించేది లేదు.. మాటతప్పను.. మడమతిప్పను అన్న జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఒకలా, అధికారం వచ్చాక మరోలా ప్రవర్తించడం సరికాదు.. రైతుల త్యాగం వృథా కాదు..' అంటూ వివిధ రాజకీయ పక్షాల అధినేతలు ఉద్ఘాటించారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి రూరల్ దామినేడు సమీపంలో జేఏసీ నేత వెంకటరెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ' పాదయాత్ర చేపట్టిన మహిళలకు, రైతులకు పాదాభివందనం తెలిపారు. అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి 180 మంది చనిపోయారని, వేల సంఖ్యలో కేసులు పెట్టారన్నారు. పాదయాత్రను అడ్డుకునేందుకే 2,500 మందిపైన కేసులు మోపారన్నారు. రాజధాని అమరావతిలో ఉండాలని ఆందోళన చేసిన దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. అమరావతి రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల మద్దతు ఉందని, ఇక్కడికి రాకపోయినా సిపిఎం తన మద్దతును తెలియజేసిందని చెప్పారు. కొన్ని రాజకీయ విబేధాలు ఉండటం వల్ల రాలేకపోయారని తెలిపారు. అమరావతి ఉద్యమం ఒక సామాజికవర్గ పోరాటమని కుల ముద్ర వేశారని, ఈ నేల మంచిది కాదని ఎన్నో అబద్దాలు చెప్పి ప్రజలు పక్కదారి పట్టే ప్రయత్నం చేశారన్నారు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలని, రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. 1952 నుంచి బెజవాడే రాజధాని కావాలని సీపీఐ చెబుతూనే ఉందని, ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. పాదయాత్ర నిర్వహించిన అమరావతి రైతులు బహిరంగ సభ నిర్వహించి అగ్నిగుండం తొక్కారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతా అభివృద్ధి చేయొచ్చని, రాజధానిగా మాత్రం అమరావతే ఉండాలన్నారు. జనసేన రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తమ అధినేత పవన్‌కల్యాణ్ అప్పటికీ, ఎప్పటికీ రైతుల పక్షానే ఉన్నారని, అమరావతే తమ రాజధాని అని అన్నారు. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తమకు సిద్ధాంతపరంగా కొన్ని రాజకీయ పార్టీలతో విబేధాలున్నా అమరావతి కోసం అందరం ఏకమయ్యామన్నారు. సినీనటుడు శివాజీ మాట్లాడుతూ.. ఒక్క వైసీపీ తప్ప వేదికపైన రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అమరావతి రథాన్ని నడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు యర్రమనేని శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతుల పక్షాన నిలిచిన న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో 13 జిల్లాలున్నా.. అందరి రాజధాని అమరావతే' అని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జనసేన రాయలసీమ ఇన్‌ఛార్జి రాందాస్ చౌదరి, బిజెపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, టీడీపీ మాజీ మంత్రి అమరనాథరెడ్డి, సాధు పరిరక్షణ కమిటీ శివానంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతో వేదిక పంచుకోలేం
- జేఏసీకి సీపీఐ(ఎం)ఏపీ లేఖ
- అమరావతిలోనే శాసన, పరిపాలన రాజధాని ఉండాలి
రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో కలిసి వేదికను పంచుకోలేమని, అందువల్లే తిరుపతిలో జరుగుతున్న సభకు హాజరుకావడం లేదని అమరావతి జేఏసీకి సీపీఐ(ఎం)ఏపీ తెలిపింది. ఈ మేరకు అమరావతి పరిరక్షణ కమిటీ నాయకులు, జేఏసీ కన్వీనర్ ఎ. శివారెడ్డికి సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు శుక్రవారం లేఖ రాశారు. సభకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన అమరావతి రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా ఉన్న బీజేపీతో వేదిక పంచుకోవడానికి తాము సిద్దంగా లేమని, అందువల్లే సభకు రాలేకపోతున్నామని లేఖలో తెలిపారు. రాజధానిని ముక్కలు చేయాలన్నరాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నష్టదాయకమని, అమరావతి రైతుకూలీలు, ప్రజలకు ఇచ్చిన చట్టబద్ధమైన హామీని నీరుగార్చిందని పేర్కొన్నారు. ' పరిపాలన, శాసనరాజధాని అమరావతిలోనే కొనసాగాలని సీపీఐ ఎం) నిశ్చితాభిప్రాయం. రైతు ఉద్యమానికి గతంలో మద్దతు తెలిపాం, భవిష్యత్‌లోనూ మా మద్దతు కొనసాగుతుంది.' అని తెలిపారు. ఈ సందర్బంగా అమరావతికి, రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాలను ఆయన ప్రస్తావించారు. ' రాజధాని నిర్ణయంతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పలుమార్లు పార్లమెంటులో అమరావతిని గుర్తించడానికి నిరాకరించింది. అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుతో పాటు, పలు విషయాల్లో బీజేపీ దగా చేసింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని అమరావతి ఉద్యమ సభలకు, కార్యక్రమాలకు పిలవాలనే జేఏసీ వైఖరి దురదృష్టకరం.' అని పేర్కొన్నారు.