Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న పోస్టులకూ వేలాది సంఖ్యలో దరఖాస్తులు
- లాక్డౌన్ అనంతరం తీవ్రమైన ఉపాధి సమస్య
గాంధీనగర్ : ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో నిరుద్యోగం ఆందోళనకరంగా మారింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇక్కడి నిరుద్యోగులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాన్ని దాదాపు 20 ఏండ్లకు పైగా బీజేపీ పాలించింది. ఇక్కడ మాత్రం యువతకు ఉద్యోగాలు అందని ద్రాక్షగా మిగిలాయి. ఇక కరోనా తెచ్చిన కష్టాలు మరొక ఎత్తు. మహమ్మారి కారణంగానూ ఇక్కడి యువత ఉపాధి దెబ్బను ఎదుర్కొన్నది. దీంతో ఇక్కడి యువత ఉద్యోగాలు లేకపోవడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చదువుకున్న చదువుతో సంబంధం లేకుండా.. ఏ ఒక్క చిన్న ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడినా ఇక్కడి యువత నుంచి దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చి పడుతున్నాయి.
'గ్రామ రక్షక దళ్ (జీఆర్డీ)' అనే వాలంటీర్ల పోస్టుల కోసం ప్రభుత్వం దరఖాస్తులకు ఆహ్వానించింది. మొత్తం 9902 పోస్టులకు అక్టోబర్‌లో ప్రకటన చేయగా మొత్తం 50 వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. ఒక గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసుకు సహాయపడటమే గ్రామ రక్షక దళ్ విధి. అయితే, ఈ జీఆర్డీ కి రోజులో ఎనిమిది గంటలు విధులు నిర్వహిస్తే దక్కేది రూ. 230 మాత్రమే. ఇది ఉపాధి హామీ చెల్లింపు కంటే రూ. 69 తక్కువ. అలాగే, ఇది కనీస వేతనం కిందకూ రాదు. అయినప్పటికీ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం గమనార్హం.
అలాగే, నవంబర్‌లో బానాకాంతా జిల్లాలో 650 జీఆర్డీ పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించగా 6500 మందికి పైగా అభ్యర్థులు వచ్చారు. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలి వస్తారని పోలీసులూ ఊహించలేదు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''మా కుటుంబం కోసం 17 ఏండ్ల నుంచే నేను రోజువారీ కూలీగా పనిచేసేవాడిని. అయితే, లాక్డౌన్ తర్వాత నుంచి నేను ఖాళీగా ఉంటున్నాను. ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయడం ఇది నాకు మొదటిసారి'' అని ఒక వ్యక్తి వివరించాడు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే'
ఇక 10వేల లోక్ రక్షక్ దళ్ (ఎల్ఆర్డీ) పోస్టులకు గానూ 8.86 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చి చేరాయి. అలాగే, 6,700 హౌంగార్డు జవాన్స్ ఖాళీలకు గానూ 36వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా,రాష్ట్రంలో,ముఖ్యంగా బనాస్కాంతా జిల్లాలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నదనీ,జీఆర్డీ రిక్రూట్మె ంట్ డ్రైవ్‌లో కనిపిస్తున్న పరిస్థితులే ఇందుకు నిదర్శనమని వాద్గం ఎమ్మెల్యే జిగేశ్ మేవానీ అన్నారు. తామంతా ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ, డిగ్రీలు, పీజీలు పూర్తైనా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి బతకాల్సి వస్తున్నదని ఇక్కడి యువత ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సామాజిక కార్యకర్తలు, పౌర సంఘాల నాయకులు ఆరోపించారు.