Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో వైద్య సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ : నీట్-పీజీ 2021 కౌన్సిలింగ్లో జాప్యాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్ వైద్యులు నిర్వహిస్తున్న సమ్మె బుధవారంతో 13వ రోజుకు చేరుకుంది. రెండు రోజుల నుంచి సమ్మె తీవ్రతరం అవ్వడంతో ఢిల్లీలో అనేక ప్రధాన ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బుధవారం నుంచి మరిన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ (ఆర్డిఎలు) కూడా ఆందోళనల్లో భాగమయ్యాయి. 'సమ్మె ఇంకా కొనసాగుతోంది' అని ఫేడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) అధ్యక్షులు డాక్టర్ మనీష్ తెలిపారు. వైద్యులపై సోమవారం పోలీసుల దారుణ చర్యలకు నిరసనగా 'సేవలను ఉపసంహరించుకుంటున్నాం' అని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ హస్పటల్(ఆర్‌జిఎస్‌ఎస్‌హెచ్) చెందిన ఆర్డిఎ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే నీట్ పిజి కౌన్సిలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. తూర్పు ఢిల్లీలో ఉన్న ఆర్‌జిఎస్‌ఎస్‌హెచ్ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. కోవిడ్ చికిత్సకు కీలక సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. 'సీనియర్ రెసిడెంట్ వైద్యులు, జూనియర్ రెసిడెంట్ వైద్యులు విధులను బహిష్కరిస్తున్నారు' అని ఆసుపత్రికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే చాచా నెహ్రు బాల్ చికిత్సాలయ, ఉత్తర రైల్వే సెంట్రల్ హస్పటల్‌కు చెందిన రెసిడెంట్ వైద్యులు కూడా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. వైద్యులపై పోలీసుల జులుంను 'వైద్య సోదరులకు చీకిటి దినం'గా వీరు విమర్శించారు. 'మా న్యాయం జరగాలి' వంటి నినాదాలు చేశారు. అలాగే సఫ్డర్‌జంగ్, ఆర్ఎంఎల్, లేడీ హర్డింగే ఆసుపత్రుల్లోనూ వైద్యుల సమ్మె కొనసాగింది. ఈ ఆందోళనలకు సఫ్డర్‌జంగ్ ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ఈ ఆసుపత్రి ప్రాంగణంలో ఢిల్లీలోని రెసిడెంట్ వైద్యులు సమావేశమయ్యారు.