Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జారీ అయ్యే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై ప్రధాని మోడీ ఫొటో కనిపించకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ఇందుకోసం కోవిన్ పోర్టల్‌లో ఆమేరకు మార్పులు చేయనుంది. ఎన్నికల కమిషన్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలకు ఈసీ శనివారం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఫొటో లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం కోవిన్ పోర్టల్‌లో అవసరమైన ఫిల్టర్లను కేంద్ర ఆరోగ్యశాఖ వినియోగించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈసీ సూచనల మేరకు ఇదే తరహాలో మోడీ ఫొటో లేకుండా సర్టిఫికెట్ జారీ చేశారు.