Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశ్రామికోత్పత్తి డీలా
- సూక్ష్మ గణాంకాలు ఆందోళనకరం
- పెరిగిన ద్రవ్యోల్బణం..
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాలకు తోడు కరోనా సంక్షోభం అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదల, పారిశ్రామికోత్పత్తి పతనానికి దారి తీస్తున్నాయి. అధిక ధరలు ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా ఆహారోత్పత్తులు, ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదలతో 2021 డిసెంబర్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ)5.59 శాతానికి ఎగిసింది. దీంతో ఐదు మాసాల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. ఇంతక్రితం నవంబర్లో ఇది 4.91 శాతానికి, అక్టోబర్లో 4.48 శాతానికి ఉన్నది. 2020 డిసెంబర్లో 4.59 శాతానికి చేరుకున్నది. ఆ తర్వాత 2021 జులైలో గరిష్టంగా 5.59 శాతంగా నమోదైంది. ఈ స్థాయిలో తిరిగి డిసెంబర్లో చోటు చేసుకోవడం ఆందోళనకరం. గడిచిన మాసంలో ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఏడాదికే డాదితో పోల్చితే 10.95 శాతం పెరిగింది. ఆహారం, పానియాల ధరలు 4.47శాతానికి ఎగిశాయి. అంతకుముందు నవంబర్లో ఈ సూచీ 1.87 శాతంగా ఉంది. వస్త్రాలు, పాదరక్షలు, తృణధాన్యాలు, పాలు, చమురు తది తర ఉత్పత్తుల ధరలూ పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ ఆధారంగానే ఆర్బిఐ వడ్డీ రేట్లలో చేర్పులు, మార్పులు చేయనుంది. వరుసగా పెరుగుదలున్న ధరల నేపథ్యంలో వచ్చే ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హరించుకుపోతున్న కొనుగోలుశక్తి
అధిక ధరలు, ఉపాధి అవకాశాలు తగ్గడం మరోవైపు ఉన్న ఉద్యోగులకు వేతన పెంపుదల లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోతోంది. ఈ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తులపై పడింది. ఈ నేపథ్యంలోనే 2021 నవంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పెరుగుదల 1.4 శాతానికి పడిపోయింది. ఇంతక్రితం అక్టోబర్లో ఇది 3.2 శాతం వృద్థిని నమోదు చేసింది. గడిచిన నవంబర్లో తయారీ రంగం 0.9 శాతానికి పడిపోయింది. మైనింగ్ వృద్థి 5 శాతానికి పరిమితం కాగా.. విద్యుత్ ఉత్పత్తి 2.1 శాతం పెరిగింది. కరోనా సంక్షోభంతో 2020 మార్చి నుంచి పారిశ్రామిక ఉత్పత్తి తీవ్ర ప్రభావం చూపుతూనే ఉన్నది.