Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది ఎనిమిది మంది పదవీ విరమణ
న్యూఢిల్లీ : భారత సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ కేసులు ఇప్పటికే మూడు కోట్లకు పైగా ఉన్నాయి. ఇందులో పలు కేసులు ఏండ్లుగా నడుస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టులో జడ్జిల పదవీ విరమణలతో ఖాళీలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావంతో దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది.ఈ ఏడాదిలో మొత్తం ఎనిమిది మంది న్యాయమూర్తులు రిటైర్ కానున్నారు. వీరిలో ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు. ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ గతేడాది ఏప్రిల్లో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈయన ఈ ఏడాది ఆగష్టులో రిటైర్ అవుతారు. రమణ అనంతరం జస్టిస్ యూ.యూ. లలిత్ సీజేఐగా నవంబర్ వరకు పదవిలో ఉంటారు. అటు తర్వాత జస్టిస్ డీ.వై చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు స్వీకరించి 2024 వరకు పదవిలో ఉంటారు.2024లో చంద్రచూడ్ రిటైర్ అయ్యేనాటికి సుప్రీంకోర్టులోని పలువురు జడ్జిలు పదవి విరమణ పొందుతారు. ఈయన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యవహరించనున్నారు. 2025, మే 13 వరకు ఆయన సీజేఐగా ఉంటారు. సంజీవ్ ఖన్నా తర్వాత జస్టిస్ బీ.ఆర్ గవారు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆరు నెలలకు పైగా ఆయన ఆ పదవిలో ఉంటారు. కాగా, షెడ్యూల్డ్ కులం నుంచి సీజేఐగా జస్టిస్ (రిటైర్డ్) కే.జీ బాలకృష్ణన్ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్న రెండో వ్యక్తి బీ.ఆర్ గవారు కానుండటం గమనార్హం. గవారు తర్వాత జస్టిస్ సూర్య కాంత్ 2025, నవంబర్ వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఉంటారు.అయితే, సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జిల తక్కువ పదవీకాల వ్యవధి కారణంగా పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇటు వ్యవస్థలో ఏవైనా మార్పుల అమలుకు, విధానాలను తీసుకురావడంలోనూ ఇది సమస్యగా పరిణమించిందని నిపుణులు తెలిపారు.కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జస్టిస్ ఆర్ సుభాశ్ రెడ్డి రిటైరయ్యారు. జస్టిస్ వినీత్ సరన్ మేలో, జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు జూన్ 7న, జస్టిస్ ఏ.ఎం. ఖాన్విల్కర్ జులై 29న, జస్టిస్ ఇందిరా బెనర్జీ సెప్టెంబర్ 23న, జస్టిస్ హేమంత్ గుప్తా అక్టోబర్ 16న పదవీ విరమణ చేయనున్నారు. న్యాయమూర్తుల వరుస రిటైర్మెంట్లతో భారత సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జిల సంఖ్య 34 నుంచి 25కు తగ్గనున్నది.