Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకా అభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తామన్న మోడీ సర్కార్
- పీఎం కేర్స్ నుంచి ఒక్క పైసా విడుదల కాలేదు..
- నిధులు రాలేదని ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానం
- నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం : వైద్య నిపుణులు
న్యూఢిల్లీ : కోవిడ్ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడేందుకు మోడీ సర్కార్ చిత్తశుద్ధితో ప్రయత్నిం చిందా? అంటే అవునని చెప్పటం కష్టం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో మోడీ సర్కార్ చెప్పేది ఒకటి..చేసేది మరోటి..అనే ఆరోపణలు ఉన్నాయి. కోవిడ్‌పై పోరాటం కోసం వేల కోట్లు విడుదల చేస్తున్నామని, కరోనా టీకా అభివృద్ధి నిమి త్తం పీఎం కేర్స్ నుంచి రూ.100కోట్లు అందజేస్తా మని మే 13, 2020లో ప్రధాని ప్రకటించారు. అయితే టీకా అభివృద్ధి, పరిశోధన కోసం పీఎం కేర్స్ నుంచి ఎలాంటి నిధులూ రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖే స్వయంగా తెలిపింది. సామాజిక కార్యకర్త లోకేశ్ బాత్రా ఆర్టీఐ దరఖాస్తులో అడిగిన పలు ప్రశ్నలకు మోడీ సర్కార్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది. అయితే లోకేశ్ బాత్రా పట్టువదలని విక్రమార్కుడిలా నిధుల విడుదలకు సంబంధించిన సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారుల చుట్టూ అనేకమార్లు తిరిగారు. చివరికి కేంద్ర ప్రభుత్వంలోని ఆరోగ్యం, ప్రభుత్వ విద్య విభాగం నుంచి ఆర్టీఐ దరఖాస్తుకు సమాచారం విడుదలైంది. కరోనాపై టీకా అభివృద్ధి, పరిశోధనకు పీఎం కేర్స్ నుంచి ఎలాంటి నిధులూ రాలేదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.
మోడీ సర్కార్ నిర్లక్ష్యం
కరోనా టీకా అభివృద్ధి, పరిశోధనకు సకాలంలో కేంద్రం నుంచి నిధులు విడుదలై ఉంటే ఎన్నో వేలమంది ప్రాణాలు దక్కేవి అని నిపుణులు భావిస్తున్నారు. మనదేశంలో రెండో వేవ్ ఎంత ఉధృతంగా వచ్చిందో అందరికీ తెలిసిందే. సరైన ఔషధాలు, ఆక్సీజన్ అందుబాటులో లేక మనుషుల ప్రాణాలు టపాటపా రాలిపోయాయి. వేల కోట్లు అయినా ఖర్చు చేస్తాం, ఔషధాలు, అన్ని వసతులూ అందుబాటులో తెస్తాం..అని కేంద్రం చెప్పిన మాటలు అంతా బూటకమేనని రెండో వేవ్ సమయంలో ప్రజలందరికీ అనుభవంలోకి వచ్చింది.
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి నిధుల విడుదల సకాలంలో జరిగిందా? లేదా? అన్నది తెలుసుకొనేందుకు సామాజిక కార్యకర్త లోకేశ్ బాత్రా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ప్రయత్నించారు. జులై 16, 2021న కేంద్ర ఆరోగ్య శాఖలో కేంద్ర సమాచార అధికారి వద్ద ఆర్టీఐ ద్వారా సంబంధిత సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు. వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధి నిమిత్తం పీఎం కేర్స్ నుంచి నిధుల విడుదల వివరాలు ఇవ్వాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే పీఎం కేర్స్ నుంచి నిధులేమీ విడుదల కాలేదని సమాధానం వచ్చింది.
ప్రభుత్వ ఫండ్ కాదు : పీఎంఓ
ఆర్టీఐ దరఖాస్తును పీఎంఓ, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కు పంపుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ లోకేశ్ బాత్రాకు తెలిపింది. పీఎం కేర్స్ నుంచి ఎలాంటి నిధులూ రాలేదని ఐసీఎంఆర్ కూడా సమాధానమిచ్చింది. పీఎం కేర్స్ ప్రభుత్వ ఫండ్ కాదు, వీటి వివరాలు తాము ఇవ్వలేమని పీఎంఓ దరఖాస్తును తోసిపుచ్చింది. ఆర్టీఐ దరఖాస్తు నిటి ఆయోగ్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)కు బదిలీ అయ్యింది. నిధుల విడుదల, బడ్జెట్‌తో తమకు సంబంధం లేదని సీడీఎస్సీఓ తెలిపింది.