Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అంటే భగ్గుమంటున్న ఓటర్లు
- జారుకుంటున్న యోగి మంత్రులు, ఎమ్మెల్యేలు
పశ్చిమ యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా దళితులంతా ఏకమవుతున్నారు. వీరు ఒక్కటవ్వటంతో.. రాజకీయ సమీకరణలు మారబోతున్నాయని సంకేతాలొస్తున్నాయి. మరోవైపు బీజేపీకి అండగా నిలిచిన కీలకవర్గాలు దూరమవుతుంటే... యోగి దళితుల ఇండ్లలో.. సమకూర్చిన సహపంక్తి భోజనాలకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ యూపీలో దళితుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితేంటీ..?
'గత అసెంబ్లీ ఎన్నికల్లో మేం (దళితులు) బీజేపీకి పెద్ద సంఖ్యలో ఓట్లేశాం. కానీ గత ఐదేండ్లలో దళితుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మాకు ఉద్యోగం రాలేదు. జీతంలో ఎలాంటి మెరుగుదల లేదు... '
లక్నో : ఇక్కడి దళితుల్లో ఎక్కువ మంది ఇటుక బట్టీల్లో లేదా అగ్రవర్ణ రైతుల పొలాల్లో పని చేస్తున్నారు. ఏండ్ల నుంచి వారి జీతాల్లో ఎలాంటి మార్పూ లేదు. దీంతో పాటు.. కుల వివక్షనూ ఎదుర్కొంటున్నారు. దీనిపై పోలీసులను, అధికారులను కలిసినా వారికి ఎవరూ అండగా నిలవటంలేదు. దీంతో ఈ సారి ఎస్పీ-లోక్‌దళ్ కూటమికి ఓటు వేయాలని దళితవర్గం ఆలోచిస్తోంది.
యూపీలో ప్రధానకారణాలు ఇవే..
బీజేపీకి కష్టకాలం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ప్రజల బాగోగులను పట్టించుకోలేదు. యూపీలో బలహీనవర్గాలపై అంతులేని అరాచకాలు జరిగినట్టు కేంద్రం ప్రకటించిన గణాంకాలే ధ్రువీకరిస్తున్నాయి.
వీటికి తోడు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి :
- ఒకటి.. అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ కార్మికులు, రైతుల దుస్థితి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం.
- ఇక రెండవది... బీజేపీలో చీలిక. చాలా మంది సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఇప్పుడు ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ కూటమి మధ్యే ఉండబోతోందని తెలుస్తోంది.
అయితే బీజేపీ, ఎస్పీలోనూ దళితులు ఏ కూటమి వైపు మొగ్గు చూపుతారు? ఇప్పటి వరకు యూపీలో దళితుల ఓట్లు బహుజన్ సమాజ్‌పార్టీకి పడ్డాయి.
2017లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ కంటే బీఎస్పీకి కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి 36.7శాతం ఓట్లు రాగా, ఎస్పీకి 21.8శాతం, బీఎస్పీకి 22.2శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కూడా దళిత సామాజికవర్గంలోని పెద్ద భాగం బీజేపీకి ఓటు వేసిన మాట కూడా నిజం.
బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న తరుణంలో ఇప్పుడు దళితులు బీఎస్పీ వైపు మొగ్గు చూపుతారా లేక ఎస్పీ కూటమికి ఓటేస్తారా.? అనేటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మూడు ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దళిత ఓటర్లను ఓ జాతీయ మీడియా సంస్థ పలకరించింది. బరౌత్, షామ్లీ, బుధానా, బాగ్పత్, షామ్లీ ప్రాంతాలు ముజఫర్‌నగర్ జిల్లాలోకి వస్తాయి. దళితుల జనాభా బాగ్పత్, షామ్లీలో 12శాతం. కాగా ముజఫర్‌నగర్‌లో దాదాపు 13.55శాతం. సోనూ గ్రామం బావోలి బరౌత్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బరౌత్ పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. సాపేక్షంగా పెద్ద ఈ గ్రామంలో సుమారు 10,000 జనాభా ఉంది. ఇది ప్రధానంగా జాట్ల ఆధిపత్య ప్రాంతం.
ఇది రాజకీయంగా ప్రభావం చూపుతుంది. గత ఎన్నికల్లో జాట్లు బీజేపీకి పెద్దఎత్తున ఓటు వేశారు. ఫలితంగా బీజేపీ ప్రతినిధి గెలిచాడు. కానీ ఇపుడు మారిన స్థానిక పరిస్థితులు ఇక్కడి ఎన్నికల సమీకరణాన్నే మార్చేయనున్నాయి. ఇప్పుడు జాట్ కమ్యూనిటీ ఎక్కువగా ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతు ఇస్తోంది. ఈ కూటమి బీజేపీని ఓడించడానికి సన్నద్ధమవుతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో దళితులు 16.81 శాతం ఉన్నారు. ఇవి రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో దళితుల దుస్థితిని చూస్తుంటే ఏ పార్టీగానీ, కూటమిగానీ వారి అభ్యున్నతి కోసం కృషి చేశాయని చెప్పలేం.
షామ్లీ, బుధానా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా జాట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు. ఈ రెండు ప్రాంతాల్లో దళితుల జనాభా సగటున 12.5శాతం. షామ్లీ అసెంబ్లీ పరిధిలోని సిసౌలీ, భోరా ఖుర్ద్ దళిత ఓటర్లు ఈసారి 90శాతం మంది ఎస్పీ-లోక్ దళ్కే ఓటేస్తామని చెబుతున్నారు.
బీజేపీ చూపిన (అచ్ఛేదిన్) ''అభివృద్ధి కలలు'' నెరవేరకపోవడంతో గ్రామ ప్రజలు కాషాయపార్టీని వ్యతిరేకిస్తున్నారని స్థానికుడు తెలిపాడు. ''దళితుల దుస్థితి గతంలో కంటే దారుణంగా మారింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అణగారిన వర్గాలను పీడించాయి. సిసౌలి పట్టణానికి చెందిన సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ''గత ఎన్నికల్లో ఈ ప్రాంతమంతా బీజేపీకి ఓటు వేసింది. ఈసారి పరిస్థితి మారింది. 90శాతం మంది ఓటర్లు ఎస్పీ-లోక్‌దళ్ కూటమికి ఓటు వేస్తారు'' అని చెప్పారు. బుధానా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సుమారు 2,400 జనాభా కలిగిన చందేధి గ్రామంలో దళిత ఓటర్లు ఎస్పీ-లోక్‌దళ్ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు.
దళితులను ఆకట్టుకోవటానికి యోగి తంటాలు..
అధికారంలో ఉన్నపుడు దళితులపై ఎన్నో అకృత్యాలు.. అఘాయిత్యాలు.. ఇపుడు ఎన్నికలు సమీపిస్తుంటే.. దళితుల ఇండ్లల్లో సమకూర్చిన సహపంక్తి భోజనాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బిజీ అయ్యారు. మోడీ-యోగిల డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ప్రజలు విడిచిపెడుతున్నారనే భయం.. యోగిని దళితుల ఇండ్లవైపునకు వెళ్లేలా చేస్తోంది. వెనుకబడిన-దళితులకు అధికారంలో భాగస్వామ్యం కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగి.. సంక్రాంతికి కిచిడీ తినటానికి కాషాయ పార్టీకి చెందిన దళిత కార్యకర్త ఇంటికి చేరుకున్నారు. ఇంకోవైపు అసెంబ్లీ అభ్యర్థులను మార్చకుండా ... ఓబీసీ ఓటర్లను మూకుమ్ముడిగా తనపై తిరుగుబాటు చేసేలా యోగి వ్యవహరించారన్న చర్చ నడుస్తున్నది. అయితే బీజేపీ జారీ చేసిన జాబితాలో యోగి ప్రమేయం లేకుండా పేర్లు మారిపోయాయన్న వాదన హై కమాండ్‌లో వినిపిస్తోంది.