Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి, పటిష్ట పిడిఎస్ కోసం మార్చిలో ఆందోళనలు
- ఏప్రిల్‌లో భూపోరాటాలు : కార్యాచరణ ప్రకటించిన ఎఐఎడబ్ల్యుయు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులు పోరు శంఖారావం ప్రకటించారు. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే మార్చిలో దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టాలని భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) పిలుపునిచ్చింది. భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలనే డిమాండ్‌తో వచ్చే ఏప్రిల్ నెలలో భూపోరాటాలు కూడా చేపట్టాలని కోరింది. కర్నాటకలోని బాగేపల్లిలో బుధవారం జరిగిన వ్యకాస రాష్ట్ర సదస్సులో ఏఐఏడబ్ల్యూయూ ప్రధానకార్యదర్శి బి వెంకట్ ఉద్యమ కార్యాచరణను తెలిపారు. కేంద్ర బడ్జెట్ కష్టజీవులను, బహుజనులను బలి చేసి కార్పొరేట్లుకు, బహుళజాతి సంస్థలకు కాసుల వర్షం కురిపించేలా ఉందని ఆయన విమర్శించారు. ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్ర కార్మిక సంఘాలు మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను గ్రామీణ ప్రాంతాల్లో కూడా జయప్రదం చేసేందుకు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఆహార భద్రత చట్టం సమగ్ర అమలు కోసం ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ గోడౌన్ల ముట్టడి చేయనున్నట్టు తెలిపారు. పేదలకు సాగు భూముల సాధన కోసం ఏప్రిల్ నెలలో ఆందోళన చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ చట్టం పటిష్ట అమలుకోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశ వ్యాప్త ఉద్యమాలకు సిద్ధం కావాలని సంఘం పిలుపు ఇచ్చిదన్నారు.
రూ.39,44,900 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 35 శాతంగా ఉన్న దళితులు, గిరిజనులకు కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తప్పుబట్టారు. ఉపాధి హామీకి గతేడాది కంటే రూ.65 వేల కోట్ల కేటాయింపులు తగ్గించారన్నారు. గతేడాది కంటే ఆహార భద్రత నిధులను 28 శాతం తగ్గించారని, అంటే 85 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతను నిర్లక్ష్యం చేసి మోడీ ప్రభుత్వం ఆకలి చావులను కోరుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోడౌన్లలో ముక్కి పోతున్నా పేదలకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసొప్పడం లేదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనపరచడమంటే ఎఫ్‌సీఐ కొనుగోళ్లు తగ్గించటం, రైతులకు కనీస మద్దతు ధర దక్కనీయకుండా చేయడమేనన్నారు. మోడీ సర్కార్ అవలంబిస్తున్న ఈ వినాశకర చర్యల వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు గమనిస్తే ప్రజల చేతుల్లో ఉన్న సాగు భూములను అభివద్ధి పేరుతో బలవంతంగా గుంజుకునే ప్రమాదం కనిపిస్తోందన్నారు. ఇప్పటికే దళిత, ఆదివాసీల నుంచి అభివద్ధి పేరుతో బలవంతపు భూ సేకరణ చేస్తున్నదని విమర్శించారు.