Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణకార్మిక సంక్షేమనిధిపై నిర్లక్ష్యం..
- లోక్‌సభలో కేంద్రం లిఖితపూర్వక సమాధానం..
సంక్షేమ పథకాలకు కోతపెడుతున్న మోడీ సర్కార్..భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గురించి ఎంతగానో నిర్లక్ష్యం వహిస్తోంది. ఆయా నిర్మాణ ప్రాజెక్టులపై సెస్ రూపంలో వసూలు చేసిన మొత్తంలో సగానికిపైగా ఇప్పటి వరకు వినియోగించలేదు. ఈ విషయాన్ని లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది.రూ.78,521.24 కోట్ల నుంచి 35,399.40 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఆ లేఖలో ప్రస్తావించారు.
న్యూఢిల్లీ : దేశ నిర్మాణంలోనూ,ప్రగతిపథంలోకి దూసుకెళ్లటానికి భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకమైంది. తమను ఆదుకోవటానికి నిధులు ఇవ్వమని అడగటంలేదు. సెస్సు రూపంలో వసూలు చేసిన నిధుల్ని పూర్తిగా విడుదలచేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ రాజస్థాన్,ఉత్తరప్రదేశ్, కర్నాటక సహ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్,బీజేపీ కార్యకర్తలకు సెస్సునిధుల్లో నుంచి 75 శాతం మళ్లించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెస్ కింద వసూలు చేసిన నిధులెంత..ఖర్చుపెట్టిందెంత..?
బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం( 1996) కింద వసూలు చేసిన సెస్, నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రాంతాల సంక్షేమ బోర్డులచే ఉపయోగించబడాలి. చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 78,521.24 కోట్లు వసూలయ్యాయనీ, అందులో 35,399.40 కోట్లు ఖర్చు చేశామని బిజూ జనతాదళ్ ఎంపీ అమర్ పట్నాయక్‌కు కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
''చట్టం నిర్దేశించిన.. మార్గదర్శకాల ప్రకారం.. సెస్ నిధులను సక్రమంగా ఉపయోగించుకునేలా చూసుకోవడానికి రాష్ట్ర/యూటీ ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది'' అని సమాధానమిచ్చింది. 2020లో కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో...కార్మికుల సంక్షేమ పథకాల కోసం సెస్సును ఉపయోగించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకూ సగానికిపైగా సెస్సు నిధులు ఖర్చుకాలేదని మోడీ ప్రభుత్వం చెబుతోంది. ఆ నిధులు విడుదల చేయాలని భవన నిర్మాణ కార్మికసంఘాలు , ఆయా రాష్ట్రాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే నిధులు ఖర్చుకాకపోవటానికి ఎవరు బాధ్యులు అన్న దానిపై ప్రభుత్వాలు మాత్రం గమ్మునుంటున్నాయి. అయితే ఆ నిధులను కూడా బీజేపీ ప్రచారాలకు వినియోగించుకుంటుందని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాణలోనూ భారీగానే నిధులు...
తెలంగాణలో 2900 కోట్ల సెస్సు నిధులున్నా..వాటిలో 25 శాతం కూడా వాడుకోలేదని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెల్ఫేర్‌బోర్డు ద్వారా అందించాల్సిన సంక్షేమ పథకాలను విస్మరించిందనీ,పైగా 1005 కోట్లు పౌరసరఫరాలశాఖకు రాష్ట్రప్రభుత్వం మళ్లించింది. ఇలా చేయటం కార్మికుల పొట్టగొట్టడమే. ఆ సెస్సు నిధులతో ప్రమాదరీత్యా చనిపోయినా,వికలాంగులైనా కార్మికులను ఆదుకోవాలి. అడ్డా ప్రదేశాల్లో కార్మికులకు కనీససౌకర్యాలు కల్పించాలి,..ఆర్.కోటం రాజు
తెలంగాణ భవన,ఇతర నిర్మాణరంగకార్మికుల సంఘం..సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి