Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట కొనుగోళ్లు, మద్దతు ధర నుంచి తప్పుకునేందుకు మార్గాన్వేషణ
- మెల్లగా మార్కెట్ సరళీకరణ
- వ్యవసాయ మార్కెట్లకు సమాంతరంగా మరో వ్యవస్థ !
- ప్రజా ఉద్యమాలు రాకుండా సంస్కరణలు చేపట్టాలనే ఆలోచన
అత్యంత వివాదాస్పదమైన 'మూడు సాగు చట్టాల్ని' మోడీ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని మరో రూపంలో..మరో నమూనాలో తీసుకురావాలనే ఆలోచన కేంద్రం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే భయంతోనే బీజేపీ అధినాయకత్వం వెనుకడుగు వేసిందని అన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వ పాత్రను తగ్గించి, ప్రయివేటు, కార్పొరేట్ పాత్రను పెంచే విధంగా విధాన రూపకల్పనకు కసరత్తు జరుగుతోందని సమాచారం.
న్యూఢిల్లీ : వివాదాస్పద 'సాగు చట్టాల్ని' మరో రూపంలో మోడీ సర్కార్ తీసుకొస్తుందేమోననే భయాలు ఉన్నాయి. ఎందుకంటే సంస్కరణలు వేగవంతం చేయాలన్న పట్టుదలతో కేంద్రం ఉన్నట్టు సమాచారం. రాజకీయంగా దెబ్బతినకుండా చూసుకోవాలని, మరోవైపు మార్కెట్ సరళీకరణ కొనసాగించాలనే వ్యూహంతో కేంద్రం సమాలోచనలు చేస్తోందని తెలిసింది. చట్టాల్ని సవరించకుండా చేయొచ్చా? మండీల వ్యవస్థకు సమాంతరంగా మరో వ్యవస్థ వస్తే ఎలా ఉంటుంది? పంట కొనుగోళ్లలోకి బడా వ్యాపారులు, కార్పొరేట్లను ఎలా తీసుకురావొచ్చు?..ఇలా అనేక మార్గాల్లో మేథోమధనం సాగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరో ఉద్యమం రాకుండా..
సంస్కరణల పేరుతో వ్యవసాయ మార్కెట్ స్వరూప స్వభావాలు మార్చాలనుకోవటం, ఆ మార్పులు పెట్టుబడు దారులు, కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేట్టు చేయటం రైతు ఉద్యమానికి దారితీసింది. రైతు తన పంటను దేశంలో ఎక్కడికైనా తరలించి..తనకు నచ్చినచోట అమ్ముకోవచ్చునని సాగు చట్టాల గురించి కేంద్రం గొప్పగా ప్రచారం చేసింది. దీనిని రైతు సంఘాలు గట్టిగా తిప్పికొట్టాయి. ఉదాహరణకు..80 బస్తాల ధాన్యం పండించిన రైతు వందల కిలోమీటర్లు తన సరుకుతో ప్రయాణించి వ్యవసాయ మార్కెట్‌ను వెతుక్కుంటాడా? ఒకవేళ ఉన్నా..మండలాలు, జిల్లా, రాష్ట్ర సరిహద్దు దాటి తన 80 బస్తాల ధాన్యం అమ్ముకుంటే గిట్టుబాటు ధర వస్తుందా? ఇది హాస్యాస్పదమైన అంశమని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి పంట ఉత్పత్తిని అమ్ముకొనే నిబంధన పెద్ద పెద్ద వ్యాపారులకు, కార్పొరేట్లకు అనుకూలిస్తుంది తప్ప, సాధారణ రైతుకు కాదనేది స్పష్టంగా కనపడుతోంది. సంస్కరణల పేరుతో వ్యవసాయరంగాన్ని మార్కెట్ శక్తులకు అప్పజెప్పేందుకు ఈ చట్టాలు తెచ్చారనేది అందరికీ అర్థమైంది. అందుకే దేశ రైతాంగమంతా ఒక్కటై సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఉద్యమంబాట పట్టింది. ఇప్పటివరకూ ఉన్న 'మండీ వ్యవస్థ' (వ్యవసాయ మార్కెట్లు)ను సమూలంగా మార్చడానికి కేంద్ర రకరకాలుగా ప్రయత్నిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణ కు మూడు సాగు చట్టాల్లో ఒకటైన 'ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్, కామర్స్ బిల్, 2020'పై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అత్యంత ప్రమాదకరమైన అంశాలు ఇందులో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి.
బాధ్యత నుంచి తప్పించుకోవాలి
రైతు తన పంటను అమ్ముకోవాలన్నా, దానికి ఒక ధర రావాలన్నా..ప్రధాన ఆధారం 'మండీ'. ఇక్కడ పంటకు మద్దతు ధర రాకపోతే..దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి వస్తుంది. మార్కెట్ మాయాజాలం, మోసాలకు అడ్డుకట్ట వేయటం తలకుమించిన భారంగా పాలకులు భావిస్తున్నారు. దాంతో ఈ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే 'ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్, కామర్స్ బిల్, 2020' చట్టాన్ని తెచ్చారు. మండీ మనుగడను నామమాత్రం చేయాలన్నది కేంద్రం ఎత్తుగడ. మండీలకు సమాంతర వ్యవస్థ తీసుకొచ్చి, అందులో ప్రయివేటు వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలకు స్థానం కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ మార్కెట్లలో ప్రయివేటు కొనుగోలుదార్లు, వ్యాపారులు అప్పుడూ..ఇప్పుడూ ఉన్నారు. వీరి ఆగడాలకు అంతం పలకాలని, తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే రైతులు కోరుతున్నారు. మార్కెట్లో ఏజెంట్లు, బడా వ్యాపారుల ఆగడాలకు అంతం పలకకుండా..చట్టాలు తేవటమేంటని ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల అసమర్థత చర్చనీయాంశమవుతోంది. రైతుల ఆగ్రహానికి మండీలు కేంద్రంగా నిలుస్తున్నాయని మోడీ సర్కార్ భావిస్తోంది. ముందు ముందు రైతుల ఎజెండా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది, కాబట్టి దీనిని చెల్లా చెదురు చేయాలనే వ్యూహంతో కేంద్రం ఉంది.
అలాంటి పరిస్థితి రాకుండా..
దేశంలో అత్యధికమందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయం. ఎంతోమంది భూమిలేని పేదలు రైతుకూలీలుగా బతుకుతున్నారు. సాగు చట్టాల ప్రభావం వీరందరిపైనా పడుతుంది..కాబట్టే దేశం యావత్తు ఒక్కటైంది. పర్యావసానంగా దేశ ప్రధాని మోడీ టీవీల ముందుకు వచ్చి రైతాంగానికి క్షమాపణలు చెప్పి, సాగు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాలన్న వ్యూహంతో కేంద్రంలో పాలకులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయరంగంలో ప్రభుత్వ ప్రమేయాన్ని, బాధ్యతను తగ్గించేందుకు ఉన్న మార్గాల్ని కేంద్రం వెతుకుతోంది. సంస్కరణలు, సాగు చట్టాలు..అనే పద్ధతిలో కాకుండా..వేరే మార్గంలో వెళ్లాలని భావిస్తోంది.