Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో ఆహార సబ్సిడీకి భారీగా నిధుల తగ్గింపు
- గ్రామీణ ఉపాధి హామీలోనూ అంతే..
- రూ.1267కోట్లు తగ్గిన మధ్యాహ్న భోజన పథకం
- బేటి బచావో..పడావో పథకంలో కేవలం 25శాతం నిధులు వ్యయం
మిషన్ శక్తి, సంభాల్, సామర్థ్య పథకాల్ని కలిపేసి..'బేటి బచావో..పడావో' కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే ఐసీడీఎస్ను 'పోషణ్ 2.0' అంటున్నారు. బేటీ బచావో..పడావో..కార్యక్రమానికి గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కేవలం 25శాతం (రూ.622కోట్లు) ఖర్చు అయ్యాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇదంతా కూడా దేశంలో బాల కార్మికుల సంఖ్యను పెంచుతుందని, బాలల అక్రమ రవాణాకు దారితీస్తుందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రాంకు నిధులు రూ.120 కోట్ల నుంచి రూ.30కోట్లకు తగ్గాయి.
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్లో సంక్షేమరంగానికి పెద్ద ఎత్తున కోతలు విధించింది. మహిళా, శిశుసంక్షేమం, పేదలు, అణగారిన వర్గాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. గత రెండేండ్లుగా కోవిడ్ దెబ్బ, లాక్డౌన్ ప్రభావం పేదలు, మధ్య తరగతే కాదు..ఎగువ మధ్య తరగతిపైనా తీవ్రంగా ఉందని అనేక సర్వేలు తెలిపాయి. ప్రయివేటురంగంలో కోట్లాది మంది ఉపాధి గల్లంతైంది. దాంతో ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి కుటుంబాలు పేదరికంలోకి కూరుకుపోగా, పేదరికంలో ఉన్నవారు మరింతగా దెబ్బతిన్నారు. ప్రస్తుతం 'ఒమిక్రాన్' రూపంలో వచ్చిన మూడో వేవ్ అనేక రాష్ట్రాల్ని వణికిస్తోంది. ఈనేపథ్యంలో ఆహార సబ్సిడీ, మహిళా, శిశు సంక్షేమం, విద్య, ఉపాధి, ఆరోగ్యానికి కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందేమోనని అందరూ ఆశించారు. దానికి విరుద్ధంగా సంక్షేమానికి భారీ మొత్తంలో నిధులు కేటాయింపు తగ్గింది. నరేగా, పోషకాహారం, మధ్యాహ్న భోజనం..వంటి ముఖ్యమైన పథకాలకు భారీగా కోతలు పడ్డాయి. దీనివల్ల కోట్లాది మంది ప్రజల జీవన పరిస్థితులు మరింతగా దిగజారుతాయని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నరేగాకు రూ.21వేల కోట్లు కోత
కోవిడ్ సమయంలో గ్రామీణ పేదల్ని ఆదుకున్న మంచి పథకం 'నరేగా'(జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం). ఎన్నో కోట్లమంది వలస కార్మికులు, కూలీలు నగరాల్ని వదిలి గ్రామాలకు తరలివెళ్లగా..అక్కడ నరేగా ద్వారా దొరికిన పనే వారికి ఆధారమైంది. గత బడ్జెట్లో నరేగాకు రూ.1,11,170కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.21వేల కోట్లు కోతపెట్టారు. రూ.73వేల కోట్లు కేటాయించారు. ప్రస్తుతం నరేగా కింద పనులు దొరికిన కుటుంబాలకు 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలంటే బడ్జెట్లో రూ.2,64,000 కోట్లు అవసరమని సామాజిక కార్యకర్త నిఖిల్ డే (మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్) తెలిపారు. కేవలం 28శాతం నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా ఆరోగ్యంలోనూ అంతే..: ప్రజా ఆరోగ్యంలో కేంద్రం మళ్లీ కొత్త కొత్త పదాలతో పథకాలు ప్రారంభించింది. 'నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్'కు రూ.15,163కోట్లు కేటాయించింది. గతంలో ప్రకటించిన 1.5లక్షల హెల్త్, వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో కేంద్రం చెప్పటం లేదు. ప్రైమరీ, సెకండరీ స్థాయిలో ఆరోగ్య సేవలను ఇది ఎంతవరకు భర్తీ చేస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆరోగ్య నిపుణుడు డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ''దేశవ్యాప్తంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థలో ఆరోగ్య సిబ్బంది కొరత తీవ్ర స్థాయిలో ఉంది. దీనిని పరిష్కరించకుండా 'డిజిటల్ హెల్త్ మిషన్' లక్ష్యం నెరవేరదు. ప్రాథమిక ఆరోగ్య రంగం అత్యంత కీలకమైంది. నాణ్యమైన ఆరోగ్య సేవలు, అందరికీ సమానంగా అందజేయాలంటే 'ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే' కీలకం. అయితే బడ్జెట్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు'' అని చెప్పారు.
పోషకాహారం: మనదేశంలో మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్రస్థాయిలో ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కేంద్రం చెబు తున్న లెక్క ప్రకారమే, మార్చి 2016-మార్చి 2021 మధ్యకాలంలో అంగన్ వాడీల ద్వారా పోషకాహారం అందుకుంటున్న లబ్దిదారుల సంఖ్య 8.29 కోట్ల నుంచి 6.75కోట్లకు తగ్గింది. పాఠశాల విద్య పొందుతున్న మూడు నుంచి ఆరేండ్ల వయస్సున్న చిన్నారుల సంఖ్య 3.4కోట్ల నుంచి 2.3కోట్లకు తగ్గింది. పరిస్థితి ఓ వైపు ఇలా ఉంటే, మధ్యాహ్న భోజనం పథకానికి బడ్జెట్లో రూ.1267కోట్లు కోత పెట్టారు. పోషకాహారం, శిశుసంక్షేమానికి సంబంధించి పథకాల పేర్లన్నీ మార్చేస్తోంది. మళ్లీ పాతవాటినే కలగలిపి కొత్త పథకాలు తీసుకొస్తోంది. దాంతో ప్రభుత్వ వ్యయం ఏమేరకు ఉందన్నది తెలుసుకోకుండా పాలకులు జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శలున్నాయి.