Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాదితో పోలిస్తే 14 శాతం కోత
- టీకా బడ్జెట్లో ఏకంగా 86 శాతం
- ఇప్పటి వరకు 50 శాతం మందికే రెండు డోసుల వ్యాక్సిన్
న్యూఢిల్లీ : దేశంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించే విషయంలో మోడీ సర్కారు ఇప్పటికే అనేక ప్రచారాలు చేసుకున్నది. దానిని రాజకీయంగానూ అనుకూలంగా మలుచుకున్నది. అయితే, ఇప్పుడు దేశ ప్రజలకు టీకా అందించే విషయాన్ని మోడీ సర్కారు లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇటీవలి బడ్జెట్లో ఆరోగ్య రంగానికి జరిపిన కేటాయింపులే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి హెల్త్ బడ్జెట్ అంచనా 14 శాతం తగ్గింది. అలాగే, కరోనా టీకా బడ్జెట్ అంచనా కూడా 86 శాతం తగ్గింది. దేశంలో ఇప్పటి వరకు 50 శాతం మందికే టీకా అందింది. ఇంకా కోట్లాది మందికి బూస్టర్ డోసురూ అందించాల్సి ఉన్నది. అయినప్పటికీ, మోడీ సర్కారు బడ్జెట్లో కోత విధించడం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ. 1.07 లక్షల కోట్ల ను కేటాయించారు. ఆరోగ్య, ఆయుష్ మంత్రిత్వ శాఖలకు 2022-23లో రూ. 89.3 వేల కోట్లు కేటాయిచింది. కిందటేడాది ఆరోగ్య బడ్జెట్ మాత్రం రూ. 1.40 లక్షలకు పైగా ఉన్నది. అంటే బడ్జెట్లో కోతం 14 శాతంగా ఉన్నది. ఇక 2021-22లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌కు రూ. 35 వేల కోట్ల కేటాయింపులు (2021-22కి సవరించిన అంచనాల్లో రూ. 39 వేల కోట్లు) చేశారు. ప్రస్తుతం అది రూ. 5000 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టీకా బడ్జెట్ అంచనా 86 శాతం తగ్గింది. భారత్‌లోని మొత్తం జనాభాల్లో ఇప్పటి వరకు దాదాపు 50 శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకాను పొందారు. ముఖ్యంగా, బూస్టర్ డోస్‌తో సహా పూర్తి టీకా పొందినవారు రెండు శాతం మంది మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్లో టీకా కు కోత పెట్టడం గమనార్హం. ఇది దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రభావం చూపెట్టే అవకాశం ఉన్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, మహమ్మారి సంబంధిత కార్యక్రమాలు, ప్యాకేజీల కేటాయింపుల్లోనూ కోతలున్నాయి. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ)కి నిధుల కేటాయింపు జరగలేదు. మహమ్మారి కోసం బడ్జెట్ కేటాయింపుల తాత్కాలిక ఏర్పాటును కేంద్రం ఉపసంహరించుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) బడ్జెట్ 2021-22లో రూ. 6,400 కోట్ల నుంచి రూ. 6,412 కోట్లకు మాత్రమే పెంచారు. పెరుగుదల కేవలం 0.2 శాతం కావడం గమనార్హం.
అయితే, దేశంలో కరోనా మహమ్మారి ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ.. కేంద్రం మాత్రం ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కోతలు విధించడంపై ఆరోగ్య నిపుణులు తప్పుబడుతున్నారు. ఆరోగ్య బడ్జెట్‌ను కేంద్రం 14 శాతం తగ్గించడం ఆందోళనకరమన్నారు. అంతేకాకుండా, ఆరోగ్యంపై దేశ జీడీపీలో 2.5 శాతం ఖర్చు చేయాలనే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి బడ్జెట్‌ను విస్తరించాలని సూచించారు.