Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి ఎన్నికల్లో ప్రతిఫలించేనా!
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలోని రైతులంతా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పర్వత ప్రాంతంలోని రైతులతో సహా, మైదాన ప్రాంతంలోని రైతులంతా డిమాండ్ల గురించి ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి సరైన సమాధానాలు రావడం లేదు. 'డబుల్ ఇంజన్' ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీనే కొలువుదీరినా, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. కనీసం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సభలు, ప్రచారాల్లో కూడా రైతుల గురించి బీజేపీ నేతలు ప్రస్తావించడం లేదు. కనీస మద్దతు ధర దక్కకపోవడం, మార్కెట్లు ఏర్పాటు చేయకపోవడం, సాగు వ్యయం భారీగా పెరగడం, కొండ ప్రాంతాల్లో వన్యప్రాణుల బెడద వంటి సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మైదాన ప్రాంత రైతుల దుస్థితి పర్వత ప్రాంత రైతుల కంటే భిన్నంగా ఉన్నప్పటికీ లోపభూయిష్ట ప్రభుత్వ విధానాలతో ఇద్దరూ తీవ్రంగా నష్టపోతున్నారు. పర్వత ప్రాంతాల్లో రైతులు తమ పొలాలకు సాగునీరు, ఇతర సౌకర్యాల కోసం ప్రకృతిపై ఆధారపడుతున్నారు. పైగా ఇటీవల కాలంలో అడవి జంతువులు రైతుల పంటలను నాశనం చేయడం మాత్రమే కాకుండా, రైతుల పశువులపై దాడి చేసి హతమారుస్తున్నాయి. వన్యప్రాణాల నియంత్రణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. అనేక నదుల జన్మస్థానమైన రాష్ట్రంలో నీటి కొరతను ఎదుర్కోవడం వింతగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న వలసలు
వ్యవసాయం వల్ల ఇండ్లు గడవకపోవడంతో మైదాన, పర్వత ప్రాంతాల్లో రైతులు వలస వెళ్తున్నారు. 2001లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇది ఉన్నా, గత ఐదేళ్లలో ఇది విపరీతంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ 7.70 లక్షల హెకార్టల్లో వ్యవసాయం జరుగుతుండగా, ఇప్పుడది 6.98 లక్షల హెకార్లకు దిగజారింది. 72 వేల హెక్టార్లు బంజరు భూమిగా మారింది. రైతులు వ్యవసాయానికి దూరం కావడంతోనే ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా మద్దతు ధర దక్కకపోవడం, మార్కెట్లు లేకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం అంతా సోమవారం జరిగే ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.