Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ ఎదుట ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
- సమస్యల్ని పరిష్కరిస్తాం :జేడీ హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేసే డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులకు మే 2020 నుంచి సెప్టెంబర్ 2021 వరకు లాక్డౌన్సాకుతో నిలిపేసిన వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ ఎదుట తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్, డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో పెండింగ్ వేతనాల కోసం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పేద గిరిజన కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా పస్తులుంచటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పెంచిన 30 శాతం వేతనాలనూ ఆ కార్మికులకూ వర్తింపజేయాలనీ, అందుకవసరమైన బడ్జెట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల సంక్షేమం, చదువు కోసం 25 నుంచి 30 ఏండ్లు పనిచేసి మరణించిన కార్మికుల కుటుంబాలు నేడు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాయనీ, ఆయా కుటుంబాల్లో ఒకరికి అదే పోస్టు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో కలిపిన మండలాల కార్మికులకు ఆయా ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల సర్క్యులర్ ప్రకారమే వేతనాలివ్వాలని కోరారు. పార్ట్‌టైం పేరుతో ఫుల్‌టైమ్ పనిచేయిస్తూ తక్కువ వేతనం చెల్లిస్తున్నారని వాపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న వేతన దోపిడీని అరికట్టి ఫుల్ టైమ్ వేతనాలు ఇచ్చే విధంగా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ డైరెక్టర్ సైదులుకి అందజేశారు.
సమస్యలు పరిష్కారిస్తాం : జేడీ
పెరిగిన 30 శాతం పీఆర్సీతో కలిపి వేతనాలిచ్చేందుకు ఔట్సోర్సింగ్ వర్కర్స్ వేతనాల బడ్జెట్ విడుదల చేశామనీ, రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తామని జాయింట్ డైరెక్టర్ సైదులు యూనియన్ నాయకులకు హామీనిచ్చారు. జిల్లా కలెక్టర్ సర్క్యూలర్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డీటీడీఓ, డీడీలకు ఐటీడీఏపీఓలందరికీ సర్క్యులర్ పంపిస్తామనీ, ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుండి విడిపోయిన మండలాల కార్మికులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ సర్క్యులర్ ప్రకారం వేతనాలు చెల్లించే విధంగా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల వారికి ఉద్యోగం ఇచ్చే విషయం, లాక్డౌన్ వేతనాల చెల్లింపు సమస్యలపై కమీషనర్‌తో చర్చించి పరిష్కరిస్తామని జాయింట్ డైరెక్టర్ హామీనిచ్చారు. పార్ట్‌టైమ్ విధానం రద్దు, ఇతర అంశాలపై కమిషనర్‌తో చర్చించి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటి యు రాష్ట్ర కార్యదర్శి ఆర్.త్రివేణి, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల,హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్, సురేందర్, రాష్ట్ర కార్యదర్శి కె. బ్రహ్మచారి, నాయకులు రాజేందర్, అనంతరాములు, అజిత, దివ్య, సులోచన తదితరులు పాల్గొన్నారు.