Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు ఉపగ్రహాలను కక్ష్యల్లోకి..
- అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నాణ్యత, స్పష్టత కలిగిన చిత్రాలు పంపే రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం
చెన్నై : కొత్త సంవత్స రంలో మొదటిసారిగా, నూతన చైర్మెన్ ఎస్.సోమనాథ్ హయాంలో ఇస్రో సోమవారం మూడు ఉపగ్ర హాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సోమవారం తెల్లవారు జామున నింగిని, సమీపంలోని పులికాట్ సరస్సును ప్రకాశవంతం చేసేలా నారింజ రంగులో మంటలు విరజిమ్ముతూ పీఎస్‌ఎస్‌వీ సి-52 రాకెట్ మూడు ఉపగ్రహాలను తీసుకుని నింగిలోకి దూసుకెళ్ళింది. ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు లేకుండా నిర్దేశిత కక్ష్యలో ఈ మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 54వది. పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ కాన్ఫిగరేషన్ ఉపయోగించి జరిపిన 23వ మిషన్. 2020లో కేవలం రెండు ప్రయోగాలే నిర్వహించినా, అందులో ఒకటి జీఎస్ఎల్వీ-ఎప్10 విఫలం కావడంతో ఇస్రోకి ఈ ప్రయోగం విజయవంతమవడం చాలా కీలకంగా మారింది.
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయిన ఇఓఎస్-04, ఇస్రోకి చెందిన టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ ఐఎన్ఎస్-2టిడి, విద్యార్ధి ఉపగ్రహమైన ఇన్స్పైర్ శాట్-1లను తీసుకుని పీఎస్ఎల్వీ సి-52 రాకెట్ రోదసీలోకి వెళ్ళింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మొదటి లాంచ్ పాడ్ నుంచి సోమవారం ఉదయం 5.59గంటలకు నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి ఎగిసింది. దాదాపు 18 నిముషాల ముగిసిన తర్వాత, మూడు ఉపగ్రహాలు వేటికవి విడిపోయిన అనంతరం వాటిని వాటి కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయాన్ని సోమనాథ్ ప్రకటిస్తూ, త్వరలోనే మరో పీఎస్ఎల్వీ ప్రయోగం వుంటుందని చెప్పారు. కాగా శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోడీ వారికి అభినందనలు తెలియచేశారు.
పదేండ్ల పాటు పనిచేసే ఇఓఎస్-4 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యంత నాణ్యత కలిగిన, స్పష్టమైన చిత్రాలను అందించేందుకు ఉద్దేశించబడింది. వ్యవసాయం, అటవీ పెంపకం, మొక్కల పెంపకం, వరదలు, భూమిలో తేమ, హైడ్రాలజీ వంటి అంశాలకు సంబంధించిన చిత్రాలను భూమికి పంపుతుంది. సి-బ్యాండ్‌లో భూమికి సంబంధించిన పరిశీలనా డేటాను ఈ ఉపగ్రహం సేకరిస్తుంది. రీసోర్స్ శాట్, కార్టోశాట్ సిరీస్, రిశాట్-2బి సిరీస్‌ల నుండి అందే డేటాను కూడా కలిపి పంపుతుందని ఇస్రో ప్రకటించింది.
భారత్, భూటాన్ సంయుక్తంగా ప్రయోగించబోయే ఉపగ్రహం (ఐఎన్ఎస్ 2-బి)కి ముందుగా ఐఎన్ఎస్-2టిడిని ప్రయోగించారు. ఇది భూ, జల ఉపరితల ఉష్ణోగ్రతలను అంచనా వేస్తుంది, పంటల గురించి తెలియచేస్తుంది, అడవులు, థర్మల్ ఇనర్షియా సమాచారం పంపిస్తుంది.
ఇన్స్పైర్ శాట్-1 అనేది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొలరాడో యూనివర్సిటీతో కలిసి రూపొందించిన విద్యార్ధి ఉపగ్రహం. ఐనోస్పియర్ డైనమిక్స్‌ను అర్ధం చేసుకోవడాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇది ఉద్దేశించబడింది. అలాగే సూర్యుని కరోనా వలయంలో ఉష్ణోగ్రతల క్రమాన్ని కూడా అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.