Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్దవ్ థాకరేను త్వరలో కలుస్తానన్న కెసిఆర్
- కేసీఆర్, స్టాలిన్‌కు మమత ఫోన్
- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కార్ గత రెండున్నరేండ్లుగా రాష్ట్రాల హక్కుల మీద, వనరుల మీద ఎడాపెడా సాగిస్తున్న దాడిని నిలువరించడానికి బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా పావులు కదుపుతున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో మూడు వారాల సమయం ఉన్నా అంతకుముందుగానే ఈ కదలికలు జోరందుకున్నాయి. తాజాగా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేను కలిసేందుకు త్వరలో ముంబయి వెళ్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తమిళనాడు సిఎం స్టాలిన్తోను, కేసీఆర్ తోను ఫోన్లో సంభాషించారు. గత నెలలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగినప్పుడు వాటిలో పాల్గొనడానికి వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేసీఆర్‌ను కలిశారు. తాజాగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు వాటాల పంపకంలో గాని, నిధుల కేటాయింపుల్లో గానీ తీరని అన్యాయం జరిగిందని పలు రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. కొందరు ముఖ్యమంత్రులు సూటిగానే కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించారు. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ మోతాదులో వ్యక్తమయింది. దానికి తోడు కేంద్రం నియమించిన గవర్నర్లు కేరళ, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరుపైనా అక్కడి ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇటీవల ఐఎఎస్ క్యాడర్ బదిలీలను కేంద్రమే పర్యవేక్షించి నిర్ణయిస్తుందన్న ప్రతిపాదనను పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి.
దేశ వ్యాపితంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం వంటి తక్షణ సమస్యలను పరిష్కరించడంలో గానీ, కరోనా కాలంలో రాష్ట్రాలను ఆదుకునే విషయంలో కానీ, కేంద్రం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నడుమ సంప్రదింపులు, చర్చలు వేగం పుంజుకోవడం దేశ రాజకీయాలలో ఒక ముఖ్యమైన చర్చకు తెర తీశాయి.
ఒకప్పుడు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మమత ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆమె తమిళనాడు, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మోడీ ప్రభుత్వ బారి నుంచి ఫెడరలిజాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. దీనికి ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సంఘటితం చేసేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను తాను త్వరలో కలుస్తానని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు త్వరలోనే ఢిల్లీ వెలుపల జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా మమత, కేసీఆర్్, స్టాలిన్, ఉద్దవ్ వంటి ప్రతిపక్ష పాలిత ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులంతా ఏకమవుతుంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీటికి దూరంగా ఉండడం గమనార్హం.
దేశంలో ఏ రాష్ట్రానికీి చేయనంతటి తీవ్ర అన్యాయాన్ని మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసింది. ప్రత్యేక హౌదా విషయంలో కానీ, విభజన చట్టంలో హామీల విషయంలోకానీ బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దీనిపై అందరికన్నా ఎక్కువగా పోరాడాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూగనోము పాటిస్తున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపితే అప్పుడూ గట్టిగా మాట్లాడలేకపోయారు. ఫెడరలిజాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కదులుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణి రాజకీయంగా ఆ పార్టీకి నష్టం కలిగించే మాట అటుంచితే రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం కలుగజేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.