Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టికల్ 25 కింద రాజ్యాంగం కల్పించింది : హైకోర్టులో పిటిషనర్లు
- సమానత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసిన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు
- కర్నాటకలో తెరుచుకున్న పాఠశాలలు
న్యూఢిల్లీ : హిజాబ్ ధరించరాదని కర్నాటక ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల వల్లే రాష్ట్రంలో సమానత్వం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం వాటిల్లిందని న్యాయవాది దేవ్‌దత్తా కామత్ అన్నారు. హిజాబ్ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ కొంతమంది కర్నాటక హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల వాదనను న్యాయవాది దేవ్‌దత్తా కామత్ కోర్టు ముందు ఉంచారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధించటం చట్ట విరుద్ధమని, ఆర్టికల్ 25ప్రకారం హిజాబ్ ధరించటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని కామత్ తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయనే కారణాన్ని చూపి..ప్రభుత్వం ఈ ఆదేశాల్ని జారీచేసిందని, అయితే కాలేజీ యాజమాన్యాల కమిటీ నిషేదాన్ని అమలుజేస్తున్నాయని, కాలేజీలు ఇలా వ్యవహరింటాన్ని అనుమతించవచ్చా? అని ఆయన ధర్మాసనాన్ని ప్రశ్నించారు. హిజాబ్ ధరించటం మత స్వేచ్ఛ కిందకు రాదనే కొత్త వాదనను రాష్ట్ర ప్రభుత్వం వినిపించటం విడ్డూరంగా ఉందన్నారు. హిజాబ్ వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు ఫిబ్రవరి 10న కీలక ఆదేశాలు జారీచేసింది. మతపరమైన దుస్తులు ధరించి విద్యార్థులు విద్యాసంస్థలకు రాకూడదని, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నిషేధం అమల్లో ఉంటుందని హైకోర్టు తెలిపింది. అయితే హైకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. శాంతిభద్రతల దృష్ట్యా అన్నిరకాల విద్యా సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం మూసేసింది. ఆరు రోజుల బ్యాన్ తర్వాత సోమవారం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి పాఠశాలలు తెరుచుకున్నాయి.
ఉడిపి సహా పలు చోట్ల 144 సెక్షన్ విధింపు
హిజాబ్ వివాదంతో కర్నాటకలో మూతపడిన విద్యాసంస్థలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. ఇంటర్ కళాశాలలు, వర్సిటీలు మాత్రం బుధవారం వరకు మూసివేసే ఉండనున్నాయి. అయితే పలుచోట్ల కొందరు విద్యార్థులు హిజాబ్‌తో పాఠశాలలకు రాగా..వాటిని తొలగించిన తర్వాతే యాజమాన్యం లోనికి అనుమతించింది. ఈ సందర్భంలో పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందుజాగ్రత్త చర్యగా బెంగుళూరు, ఉడిపి, శివమొగ్గ, దక్షిణ కన్నడ..తదితర ప్రాంతాల్లో విద్యా సంస్థల పరిధిలో సెక్షన్ 144ను అమలుజేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ఫిబ్రవరి 19 వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పాఠశాలల ప్రాంగణంలో ఐదుగురు, అంతకు మించి గుమికూడటాన్ని నిషేధించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని అక్కడి ప్రభుత్వం పేర్కొన్నది. మంగళూరు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నత పాఠశాలల సమీపంలో 200మీటర్ల పరిధిలో సెక్షన్ 144ను అమలుజేస్తున్నారు. హిజాబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. పరిస్థితి కొద్ది రోజులపాటు పరిశీలించిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలను తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు.
అది కుట్రలో భాగమే : రాష్ట్ర హోంమంత్రి
కర్నాటకలో చోటుచేసుకున్న హిజాబ్ వివాదం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నామని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్నాటక హోంమంత్రి ఆరాగా జ్ఞానేంద్ర ఆరోపించారు. ఈ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆయన, ప్రస్తుతం ఈ కేసును హైకోర్టు విచారిస్తున్నందున, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని అన్నారు.